తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మరింత గ్యాప్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు గరవ్నర్ తమిళిసై తాజాగా చేసిన కామెంట్స్ కారణంగా మారే అవకాశం ఉంది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మరింత గ్యాప్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు గరవ్నర్ తమిళిసై తాజాగా చేసిన కామెంట్స్ కారణంగా మారే అవకాశం ఉంది. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పిన గవర్నర్ తమిళిసై.. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం పూర్తిగా తన పరిధిలో అంశమని చెప్పారు. ఈ విధమైన కామెంట్స్‌ తెలంగాణలో సరికొత్త చర్చకు దారితీశాయి. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు, మద్దతు దారులు విమర్శిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం తనను లెక్క చేయడం లేదనే భావనలో గవర్నర్ తమిళిసై ఉన్నట్టుగా తెలుస్తోంది. 

దీపావళి సందర్భంగా మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదని చెప్పారు. గవర్నర్‌గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని చెప్పారు. తన పరిధికిలోబడే తాను నడుచుకుంటున్నానని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ రకంగా కామెంట్స్ చేయడం ద్వారా గవర్నర్ తమిళిసై మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. బిల్లులపై తమిళిసై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే టెన్షన్ కూడా ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. ఈ పరిణామాలు ప్రగతి భవన్, రాజ్‌భవన్‌ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలను మరింతగా పెంచే అవకాశం ఉంది. 

ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు.. ఏపీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. తమిళిసై తీరు రాజకీయ కోణంతో కూడుకున్నదని ఆరోపిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులు రాజకీయాలు చేయడం మానేయలని కోరుతున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంపై గవర్నర్ రాజకీయ విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ప్రగతి భవన్, రాజ్‌భవన్‌ల మధ్య దూరం.. 
గవర్నర్ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించడాన్ని గవర్నర్ నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో గవర్నర్, సీఎం మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్.. 2021 డిసెంబర్‌లో ఎమ్మెల్యే కోటా కింద కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. 2021 అక్టోబర్‌లో హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం కోసం రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్.. ఆ తర్వాత కొన్ని నెలల పాటు రాజ్‌భవన్‌ వైపు వెళ్లలేదు. ఈ ఏడాది జనవరి 26న రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. 

సమక్క సారక్క జాతరలో పాల్గొనడానికి వెళ్లిన గవర్నర్‌‌కు ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆహ్వానించడానికి రాలేదు. దీంతో ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపించాయి. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. గవర్నర్ తమిళిసై హన్మకొండ, యాదాద్రి పర్యటనల సందర్భంగా మంత్రులు, అధికారులు ప్రోటోకాల్ పారించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిణామాలపై తమిళిసై వివిధ సందర్భాల్లో బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు.

ఇక, రాజ్‌భవన్‌లో జరిగిన అధికారిక ఉగాది వేడుకలకు కేసీఆర్ హాజరు కాలేదు. జిల్లాల పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘనలపై గవర్నర్ తమిళిసై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు మహిళలు తమ ఫిర్యాదులను తెలియజేయడానికి వీలుగా ఈ ఏడాది జూన్‌ నుంచి రాజ్‌భవన్‌లో ‘‘మహిళ దర్బార్‌’’ను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఇది ముఖ్యమంత్రి, గవర్నర్‌ల మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. అయితే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి జూన్‌లో రాజ్‌భవన్‌కు వచ్చారు. దీంతో భవిష్యత్తులో రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారనే ఊహాగానాలకు దారితీసింది. అయితే రాజ్‌భవన్‌లో జరిగిన "ఎట్‌హోమ్" కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాకపోవడంతో ఊహాగానాలన్నీ తప్పని రుజువైంది. ఇక, తాజాగా గవర్నర్ తమిళిసై చేసిన కామెంట్స్.. ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ల మధ్య దూరాన్ని మరింతగా పెంచేలా ఉన్నాయి.

సంచలనంగా మారుతున్న కామెంట్స్.. 
ప్రగతి భవన్, రాజ్‌భవన్‌ల మధ్య గవర్నర్ తమిళిసై చేస్తున్న కామెంట్స్, వాటిపై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తనకు ప్రోటోకాల్ విషయంలో తమిళిసై బహరింగంగానే కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్‌తో పనిచేయడం కష్టమనే కామెంట్స్ కూడా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలకు సంబంధించి నివేదికలు కోరుతున్న గవర్నర్.. పలు సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. గాంధీ జయంతి నాడు ఆర్ఎస్ఎస్ తలపెట్టిన ర్యాలికి అనుమతి ఎందుకు ఇవ్వరంటూ ప్రభుత్వాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రశ్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే గవర్నర్ తమిళిసై చేస్తున్న వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు కూడా మండిపడుతున్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని.. ప్రజాస్వామ్యం లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు తమవని కౌంటర్స్ ఇస్తున్నారు. సెప్టెంబర్ 17 విషయంలో గవర్నర్ తమిళిసై చేసిన కామెంట్స్‌పై టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఆమె ఓ గవర్నర్​లా కాకుండా రాజకీయ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

నా ఖర్చు నేను చెల్లిస్తున్నా..
ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన తమిళిసై.. గవర్నర్ హోదాలో ప్రత్యేక హెలికాప్టర్, ప్రత్యేక విమానం సేవలు పొందే అధికారం ఉన్నా.. తాను ఎప్పుడూ వాటిని వినియోగించలేదని అన్నారు. సాధారణ జీవితం గడపడమే తన నైజమని, తెలంగాణ రాజ్ భవన్ లో తనకు అయ్యే ఖర్చును నెలనెలా తానే చెల్లిస్తున్నానని చెప్పారు. 

అప్పుడు లేని సమస్య ఇప్పుడేందుకు..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో గవర్నర్‌గా ఈఎస్‌ఎల్ నరసింహన్‌ ఉన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌ల మధ్య సత్సబంధాలు ఉన్నాయి. ఆ సమయంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఘర్షణపూరితమైన వాతావరణం లేదు. నరసింహన్ స్థానంలో గవర్నర్‌గా వచ్చిన తమిళిసై సౌందర్ రాజన్‌ కూడా కేసీఆర్ సర్కార్‌తో కొంతకాలంగా సత్సబంధాలే కొనసాగించారు. అయితే గవర్నర్ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించడాన్ని గవర్నర్ నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో.. ప్రగతి భవన్ వర్సెస్ రాజ్‌భవన్‌గా పరిస్థితులు మారిపోయాయి. 

అయితే దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మాదిరిగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య సఖ్యతతో కూడిన వాతావరణం లేకపోవడమే ఇందుకు కారణం అని వారు అంటున్నారు. ఇక, తెలంగాణలో బీజేపీ బలపడాలనే ప్రయత్నాలు చేస్తుందని.. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. గవర్నర్ తమిళిసై మాత్రం తాను ఎవరికి వ్యతిరేకం కాదని.. తన పరిధి మేరకే నడుచుకుంటున్నానని చెబుతున్నారు. రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని.. తనకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. రాజ్‌భవన్‌కు ఇవ్వాలి కదా అంటూ తమిళిసై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజానీకంలో కూడా గవర్నర్‌, ప్రభుత్వం మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.