రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. గంటా చేరికకు జగన్ ఒప్పుకున్నాడు. ఆయన చేరిక లాంఛనమే అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చినప్పటికీ... ఆయన మాత్రం వాటిని ఖండించలేదు. 

ఆయన ఆ వార్తలను ఖండించకపోవడంతోప్ వాటికి మరింత బలం చేకూరింది. అంతా ఆయన ఎంట్రీ ఎప్పుడు అనే చర్చలకు తెరతీశారు. అంతే కాకుండా నలంద కిశోర్ ను అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ పై ఒంటికాలుమీద లేచిన గంటా, ఆయన మరణించినప్పుడు ప్రతిపక్షాలన్నీ కిషోర్ ది ప్రభుత్వ హత్య అని ఆరోపించినప్పటికీ... గంటా మాత్రం వెళ్లి నివాళులర్పించి వచ్చారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 

దీనితో అంతా కూడా గంటా చేరిక ఇక లాంఛనం అని ఫిక్స్ అయ్యారు. జగన్ విశాఖ వచ్చినప్పుడు గంటా చేరుతారు అని భావించారు. ఆగస్టు 9 ముహూర్తం పెట్టుకుని గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొనున్నారని తెలుస్తోంది. నిజానికి ఆగస్టు 15వ తేదీన ఇళ్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ, అంతకన్నా ముందే ఆయన టీడీపీలో చేరనున్నట్లు కొద్దిసేపటి కింద నుండి వార్తలు వస్తున్నాయి. 

జాగ్రత్తగా గనుక పరిశీలిస్తే ఏపీకి మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర తెలిపిన వెంటనే గంటా వైసీపీ తీర్థం పుచ్చుకునే విషయానికి సంబంధించిన తేదీ ప్రకటితమయింది. అంటే ఆయన ఈ మూడు రాజధానుల కారణం చెప్పి వైసీపీలో చేరుతున్నారనేది తేటతెల్లం. 

గంటా ఉత్తరాంధ్రలో కీలక నేత. తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. అన్నటికంటే ముఖ్యంగా పోల్ మానేజ్మెంట్ లో సిద్ధ హస్తుడు. ఆయనకు పర్సనల్ ఇమేజ్ తోపాటుగా సామాజికవర్గ అండ కూడా పుష్కలంగా ఉంది. 

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు వల్ల ఉత్తరాంధ్రకు ఎంతో లాభమని చెబుతూ... జగన్ నిర్ణయాలను మెచ్చే తాను వైసీపీ కండువా కప్పుకుంటున్నట్టుగా గంటా ప్రకటించబోతున్నారనేది ఇక్కడ అవగతమవుతున్న విషయం. 

మూడు రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకు ఎంతో లాభమని, ముఖ్యంగా విశాఖ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పే అవకాశాలు మెండు. విశాఖ ఎమ్మెల్యే అయినందు వల్ల గంటాకు ఈ మూడు రాజధానుల అంశం కలిసొచ్చింది. వైసీపీలో చేరిన ఇతర ఎమ్మెల్యేలు తాము ఎందుకు చేరామో చెప్పడానికి సరైన కారణం లేకపోయినప్పటికీ... గంటాకు మాత్రం ఈ కారణం బలంగా దొరికింది. 

బీజేపీలో గంటా తొలుత చేరతారని అంతా భావించినా, తన రాజకీయ భవిష్యత్తును బేరీజు వేసుకొని, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.