బిజెపి వ్యతిరేక ఫ్రంట్: కెసిఆర్, నితీష్ కుమార్ మధ్య పెరిగిన గ్యాప్
కాంగ్రెస్ మధ్య భిన్న వైఖరులు తెలంగాణ సీఎం, బిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య విభేతాలను పెంచినట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్ ప్లీనరీ తర్వాత నితీష్ కుమార్ చేసిన ప్రకటన అందుకు బీజం వేసింది.
జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక ఫ్రంట్ ను ఏర్పాటు చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ చీఫ్ కె. చంద్రశేఖర రావుకు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు మధ్య గ్యాప్ పెరిగినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ను ఎన్నికల ముందు ఫ్రంట్ లో కలుపుకోవాలా, వద్దా అనే విషయంపై ఇరువురి విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ స్థితిలో కెసిఆర్ వైఖరి ఎలా ఉంటుందనే విషయమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే తమ పార్టీ లేకుండా బిజెపికి వ్యతిరేకంగా ఏ విధమైన కూటమి కట్టినా ఫలితం ఉండదని కాంగ్రెస్ పార్టీ తన ప్లీనరీలో స్పష్టం చేసింది. ఆ ప్రకటన రావడమే తరువాయి నితీష్ కుమార్ ఓ ప్రకటన చేశారు. బిజెపి ముక్త్ భారత్ కోసం అన్ని ప్రతిపక్షాలతో కూటమి ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసి ఏర్పాటు చేసే ఏ కూటమిని కూడా అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. తెలంగాణలో బిఆర్ఎస్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీతో కలిపి ఏర్పాటు చేసే కూటమిలో తమ పార్టీ చేరితే శాసనసభ ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందని కెసిఆర్ భావిస్తున్నారు. అందువల్ల తాము జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ కు దూరంగానే ఉంటామనే సంకేతాలను పంపిస్తున్నారు.
మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలో బిజెపి పుంజుకుంటుందనే అభిప్రాయానికి విఘాతం కలిగింది. కాంగ్రెస్ మాత్రమే బిఆర్ఎస్ పోటీ ఇస్తుందనే అభిప్రాయం బలపడింది. దీంతో కాంగ్రెస్ కు దూరంగా ఉండాలనే అభిప్రాయానికి కెసిఆర్ వచ్చారు.
2024 ఎన్నికల్లో బిజెపి ఓడించడానికి కాంగ్రెస్ తో కలిపి కూటమి కట్టాలనేది నితీష్ కుమార్ నిశ్చితాభిప్రాయం. అయితే, బిజెపిని ఓడించాలనే ఎజెండాతోనే నితీష్ కుమార్, కెసిఆర్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ వారిద్దరి మధ్య విభేదాలను మరింతగా పెంచింది.
అయితే, మరో మాట కూడా వినిపిస్తోంది. కెసిఆర్ ప్రధాన మంత్రి పదవి ఆశిస్తున్నారని, అదే సమయంలో నితీష్ కుమార్ కూడా ఆ పదవిపై కన్నేశారని, ఇది కూడా ఇరువురి మధ్య సఖ్యతకు అడ్డుగా ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. బీహర్ లో నితీష్ కుమార్ ను కలిసిన తర్వాత ఏర్పాటైన మీడియా సమావేశంలో వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రధాని అభ్యర్థి ఎవరనే తర్వాత నిర్ణయిస్తామని కెసిఆర్ అన్నారు. కెసిఆర్ ఆ మాట అన్న మరుక్షణం నితీష్ కుమార్ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు. తనకు కూడా ఆ ప్రశ్న ఎదురవుతుందని, ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఇష్టం లేదని, అందుకే మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారని అంటూ వచ్చారు.
జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుపై తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాతనే కెసిఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ సాధించే ఫలితాలతో పాటు కాంగ్రెస్ సాధించే ఫలితాలను పరిగణనలోకి తీసుకుని కెసిఆర్ ముందు వెళ్తారని అంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ శాసనసభ ఎన్నికల్లోనూ పోటీ చేసి బిఆర్ఎస్ ఉనికిని చాటాలని కెసిఆర్ అనుకుంటున్నారు.