ఆంధ్రప్రదేశ్ లో మొన్న ముగిసిన ఎన్నికల్లో జగన్ పార్టీ వైసీపీ అఖండ విజయం సాధించింది. ఈ అఖండ విజయానికి ప్రధాన కారణం ఏమిటని ఆలోచిస్తే... ఠక్కున గుర్తొచ్చేది జగన్ ప్రజా సంకల్ప యాత్ర. 

ఆయన ఆ యాత్రలో ఆంధ్రప్రదేశ్ ఒక చివర నుంచి ఇంకో చివర వరకు కలియ తిరుగుతూ ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ఆయన అమరావతి, హైద్రాబాదుల్లో కన్నా ప్రజల మధ్యనే ఎక్కువగా తిరిగారు. 

వారికోసం అన్నట్టుగా వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమైతూ వారిలో ఒక్కడిగా, వారందరికీ ఒక్కడిగా పార్టీకి అన్ని తానై వ్యవహరించాడు జగన్. ప్రజల్లో మెలుగుతున్నప్పుడు, వారి మధ్య ఉన్నప్పుడు మాత్రమే వారి నాడిని పట్టుకోవడం వీలవుతుంది. 

ఇది పక్కాగా తెలిసిన జగన్ అదే ప్లాన్ ని ఆచరణలో పెట్టాడు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఓదార్పు యాత్ర మొదలు.... నిన్నటి ప్రజాసంకల్ప యాత్ర వరకు ఇదే ఫార్ములాను వాడాడు జగన్. 

జగన్ తండ్రయిన రాజశేఖర్ రెడ్డి కూడా ఇలానే యాత్రద్వారానే ప్రజాసమస్యలపై గళమెత్తి ముఖ్యమంత్రయింది. ఆయన యాత్ర ఎంత పాపులర్ అయ్యిందంటే....దాని మీద ఒక సినిమా వచ్చేంత!

2014లో ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఇలానే పాదయాత్ర చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన కూడా సక్సెస్ అవడంతో పాదయాత్ర రాజకీయాల్లో ఎన్నటికీ ఫెయిల్ అవ్వని ఒక సక్సెస్ ఫార్ములా అనే అంశం అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 

ఇప్పుడుమరోసారి విపక్షంలో ఉండడంతో పబ్లిక్ లోకి మరోసారి వెళ్లి ప్రజాచైతన్య యాత్ర పేరుతో మరో యాత్రకు తెరతీశాడు చంద్రబాబు నాయుడు. ఆయన మరోసారి అమరావతి విషయంలో యాత్రను బలంగా నమ్ముకుంటున్నారు. 

ఇలా ఏ రాజకీయనాయకుడైనా సరే..... అధికార పీఠాన్ని ఎక్కాలంటే ప్రజల మధ్య ఉండడం తప్పనిసరి. ఎన్ని తరాలైనా అది మారని ఫార్ములా. ఇదే ఫార్ములాను ఇప్పుడు బీహార్ లోని యువ నాయకులు వంటపట్టించుకున్నట్టున్నారు. 

2020 అక్టోబర్ మాసంలో బీహార్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే అన్ని పార్టీలు దాదాపుగా మొదలెట్టేశాయి. ఈసారి అక్కడి ఎన్నికలు కొన్ని నూతన పొత్తులను, నవ యువ నాయకులను తెరపై చూడనుంది. 

Also read; బాత్ బీహార్ కి: ప్రశాంత్ కిషోర్ "యువత" రాజకీయ వ్యూహమిదే...

వారంతా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకింత పరిచయమున్నవారే అయినప్పటికీ కూడా ఈసారి మాత్రం వారే తమ పార్టీల బరువు బాధ్యతహలను భుజస్కంధాలపై వేసుకొని మోస్తున్నారు. 

బీహార్ ఎన్నికల సందర్భంగా ఇంతకీ తెర మీదకు వచ్చిన ఆ ముగ్గురు యువనేతలు ఎవరనే కదా? ఒకరు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజశ్వి యాదవ్ కాగా ఇంకొకరేమో ఇలానే వారసత్వ రాజకీయాలను పుణికి పుచు కున్న చిరాగ్ పాశ్వాన్. 

సీనియర్ పొలిటీషియన్, ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు ఈ చిరాగ్ పాశ్వాన్. ఇక మూడో వ్యక్తి ఇలాంటి ఏ రాజకీయ వారసత్వం లేకుండా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడికే గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందిన కన్నయ్య కుమార్. 

ఇప్పుడు ఈ ముగ్గురు యువనేతలు కూడా బీహార్ అంతా తిరిగే కార్యక్రమాన్ని నెత్తికెత్తుకున్నారు. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే జనగణమన యాత్ర పేరుతో కన్నయ్య కుమార్ రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. 

జనగణమన యాత్ర ను ఇప్పటికే మొదలెట్టేసిన కన్నయ్య కుమార్ 

రాష్ట్రంలో లెఫ్ట్ దాదాపుగా కనుమరుగైపోయింది తరుణంలో కన్నయ్య కుమార్ ఒకరకంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే అక్కడ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అతడు యాత్ర మొదలుపెట్టినప్పటి నుండి మొదలు అతని యాత్రలు భారీ స్థాయిలో ప్రజలను తన సభలకు రప్పించగలుగుతున్నాడు.

రానురాను అతని సభలకు క్రేజ్ ఎక్కువయిపోయింది. దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరిస్తూ... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అందరిని కూడగట్టడానికే అన్నట్టుగానే ఉన్నా... బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీల మధ్య ఉన్న పొత్తును అతను బయటకు సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఎత్తి చూపెడుతున్నాడు. 

ఇప్పటికిప్పుడు అతను నేరుగా ఇంకా రాజకీయ ప్రచారాన్ని మొదలు మాత్రం పెట్టలేదు. ప్రస్తుత జనగణమన యాత్ర మార్చ మధ్య మాసంలో ముగుస్తుంది. ఇప్పుడు తనకంటూ బీహార్ లో ఒక గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. 

బేరోజ్ గారి యాత్రకు సిద్ధమవుతున్న తేజశ్వి యాదవ్ 

ఇక మరో యువనేత తేజశ్వి యాదవ్ కూడా "బేరోజ్ గారి యాత్ర" పేరుతో యాత్రను మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల 23వ తేదీ నుండి ఆయన రాష్ట్రమంతా తిరిగేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. 

లాలూ ప్రసాద్ యాదవ్ వారసత్వంగా పార్టీ పగ్గాలను అయితే అందుకున్నాడు కానీ ఇప్పటివరకు లాలూ మార్కు రాజకీయ చతురతను అందుకోవడంలో విఫలమయ్యాడు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది.

కూటమిని నడపడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆతరువాత దాదాపుగా ఒక నాలుగు నెలలు అడ్రస్ లేకుండా కనుమరుగయ్యారు. అతడిప్పుడు ఆర్జెడీకి పూర్వ వైభవం తీసుకొచ్చే పరిస్థితుల్లో మాత్రం కనబడడం లేదు.

అతనికి అలాంటి మాస్ ఇమేజ్ కూడా లేదు. దానికితోడు క్షేత్రస్ధాయిలు కార్యకర్తలతో అతనికి సంబంధ బాంధవ్యాలు తక్కువ. ఇలాంటి నేపథ్యంలో అతను మొత్తానికి ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనుకోవడం మంచి విషయమే. 

బీహార్ ఫస్ట్... బిహారి ఫస్ట్ అంటున్న చిరాగ్ పాశ్వాన్

ఇక మరో యువనేత చిరాగ్ పాశ్వాన్. "బీహార్ ఫస్ట్ బిహారి ఫస్ట్" అంటూ బీహార్ అంతా కలియతిరిగేందుకు సన్నాహకాలు మొదలుపెట్టాడు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21 నుండి తన యాత్రను మొదలుపెట్టనున్నాడు

ఈ యువనేత. గత రెండు దఫాలుగా ఎంపీగా గెలుస్తున్నప్పటికీ ఈయన ఈసారి మోడీ వేవ్ లో కొట్టుకొచ్చాడు తప్ప తన సొంత ఛరిష్మాయ మీద గెలిచినా వ్యక్తిమాత్రం కాదు. ఇతను కూడా తేజశ్వి మాదిరే క్షేత్రస్థాయి కార్యకర్తలతో సంబంధాలు లేవు.

ఇతను కూడా అంత పాపులర్ లీడర్ కాకున్నప్పటికీ తన అదృష్టాన్ని పరిరక్షించుకోవడానికి ఇప్పుడు బయల్దేరనున్నారు. 

నితీష్ కుమార్ అప్పట్లోనే.... 

2005 ఫిబ్రవరి ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అనుకున్నప్పటికీ... ప్రజాతీర్పు చీలిపోయింది. ఎవ్వరికి పూర్తి మెజారిటీ రాలేదు. దానితో నితీష్ కుమార్ న్యాయ్ యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగి బంపర్ మెజారిటీతో అక్టోబర్ ఎన్నికల్లో గెలుపొందాడు నితీష్ కుమార్. 

ఇలా ఈ యాత్రల నేపథ్యంలో ఎలా అక్కడి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకుంటారో చూడాల్సిన విషయం. రానున్న రోజుల్లో బీహార్ రాజకీయం మరింత వేడెక్కనుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.