Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ నుంచి వలసకూలీల వరకు: కేసీఆర్ దారిలోనే మోడీ!

రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటలను ఆలకించిన ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ను కొనసాగించేందుకే మొగ్గు చూపెట్టినట్టు తెలియవస్తుంది. ఆయన  తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ బాటలో పయనిస్తున్నట్టు ఆయన  వైఖరిని చూస్తే మనకు అర్థమవుతుంది. 

From lock down to Migrant Labour issues, Modi treading the path of KCR
Author
Hyderabad, First Published May 12, 2020, 12:01 PM IST

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు దేశమంతా కూడా మూడవదఫా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే!ఈ మూడవదఫా లాక్ డౌన్ కూడా 17వ తేదీతో ముగుస్తున్న తరుణంలో నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే!

ఇక నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అందరూ అనుకున్నట్టే లాక్ డౌన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే విషయమై వాడివేడిగా చర్చలు జరిగాయి. మహారాష్ట్ర, అస్సాం, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరితే.... లాక్ డౌన్ వల్ల   ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నందున లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు. 

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటలను ఆలకించిన ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ను కొనసాగించేందుకే మొగ్గు చూపెట్టినట్టు తెలియవస్తుంది. ఆయన  తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ బాటలో పయనిస్తున్నట్టు ఆయన  వైఖరిని చూస్తే మనకు అర్థమవుతుంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ముందు చూపుతో మూడవదఫా లాక్ డౌన్ ప్రకటించగానే తెలంగాణాలో మాత్రం మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగియదని, మే 29 వరకు తెలంగాణాలో లాక్ డౌన్ కొనసాగుతుందని కుండబద్దలు కొట్టారు. 

కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న వేళ, భారత దేశంలో ఇంకా కరోనా కేసుల పీక్ రీచ్ అవ్వలేదని, ఇంకా కూడా కేసులు విపరీతంగా పెరిగే ఆస్కారముందని అన్ని పరిశోధనలు తెలుపుతున్నాయని. జూన్ జులై నెలల్లో కేసులు విపరీతంగా పెరిగే ఆస్కారముందని ఇప్పటికే అనేక రీసెర్చులు చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా లాక్ డౌన్ ను ఎత్తివేయడం కష్టమని కేసీఆర్ ఒక ధృడ నిశ్చయానికి వచ్చారు. అందుకోసమనే ఆయన లాక్ డౌన్ ను మే నెల 29 వరకు పొడిగించారు. 

కేసీఆర్ లాక్ డౌన్ ను మే 29 వరకు పొడిగించినప్పటికీ.... ఆర్థిక ఉత్పత్తిని ప్రారంభించే విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఆర్ధిక వ్యవస్థను గనుక గాడిలో పెట్టకపోతే... తీవ్ర నష్టం తప్పదనే విషయం ఆయనకు కూడా తెలుసు. అందుకోసమే ఆయన కేంద్రం ఇచ్చిన సడలింపులు అమలు చేసారు. 

హైదరాబాద్ విషయంలో మాత్రం ఆయన మే 15వ తేదీ వరకు ఆపింది, మిగిలిన నగరాల్లో పరిస్థితులను చూసి ఒక నిర్ణయానికి రావడానికి. ఇప్పుడు ఆయన మే 15వ తేదీ  కూడా అనుమతులను ప్రాంతాలవారీగా ఇచ్చే ఆస్కారముంది. కేసులు ఆధారంగా ఆయన ఇక్కడ సడలింపులు ఇవ్వొచ్చు. 

ఇదే బాటలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పయనిస్తున్నారు. మూడవదఫా లాక్ డౌన్ ముగిసిన తరువాత కూడా నాలుగవదఫా కూడా లాక్ డౌన్ ను విధించనున్నట్టు  ఆస్కారముందని తెలియవస్తుంది.  మూడవదఫా ఇచ్చిన సడలింపులకన్నా ఈ నాలుగవ దఫాలో సడలింపులు ఎక్కువగా ఉండే ఆస్కారముంది. 

అదే విషయాన్నీ నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా వెలిబుచ్చారు. ఈ దఫా లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు ఇవ్వనున్నట్టు, ఆర్ధిక వ్యవస్థకు సాధ్యమైనంత ఊతం అందించేందుకు చూడాలని ప్రధాని అన్నారు. 

ఇక మరో విషయంలో పోలిక ఏమిటంటే... వలస కూలీలా విషయంలో. కేసీఆర్ ఎప్పటినుండో కూడా కూలీలను వారి సొంత ఊళ్లకు పంపించి  అక్కడివారిని తీసుకురావాలని అంటున్నారు. ఆయన రైళ్లు  ప్రారంభం కాగానే అలానే చేసారు కూడా. బీహార్ నుంచి కూలీలను తీసుకువచ్చారు.  తెలంగాణలోని రైస్ మిల్లుల్లో ఇప్పుడు పనిచేయడానికి వారు సిద్ధపడుతున్నారు. 

నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా వలసకూలీల విషయంలో ఇదే విషయాన్నీ వెలిబుచ్చారు. వారిని వెనక్కి తీసుకువచ్చాక కేసులు పెరిగే ఆస్కారమున్నప్పటికీ.... వారిని స్వీకరించడానికి, ఆ కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. 

చూస్తుంటే... మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా లాక్ డౌన్ ను పొడిగించనున్నారనేది మాత్రం తథ్యంగా కనబడుతుంది. దేశమంతా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి అది తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు! 

Follow Us:
Download App:
  • android
  • ios