హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు మధ్య పడడం లేదనే ప్రచారం ఇటీవలి కాలంలో సాగుతూ వచ్చింది. ఈటెల రాజేందర్ మీద కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తామే గులాబీ ఓనర్లమని ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో ప్రారంభించి పలు సందర్భాల్లో ఈటెల రాజేందర్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. 

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చిన ఈటెల రాజేందర్ కేసీఆర్ మీద ఎందుకు అసంతృప్తితో ఉన్నారనేది తెలియదు. అయితే, ఈటెల రాజేందర్ పార్టీ పెడతారనే ప్రచారం కూడా సాగింది. దీనిపైనే కేసీఆర్ అప్పట్లో పరోక్షంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్డు మీద పార్టీ పెట్టినవాళ్లు ఏమయ్యారో తెలుసునని ఆయన నరేంద్ర ఉదంతాన్ని ప్రస్తావించారు. 

ఈటెల రాజేందర్ మీద ఒక వర్గం మీడియాలో భూకబ్జాల ఆరోపణలు వచ్చాయి. దాదాపు వంద ఎకరాలు రాజేందర్ కబ్జా చేశారని ఆరోపించారు. అసైన్డ్ ల్యాండ్స్ ను లాక్కున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు. విచారణ జరిపించాలని ఆయన సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు. 

ఈ స్థితిలో ఈటెల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన అందుకు సిద్ధపడలేదు. తనపై వచ్చిన ఆరోపణల మీద వివరణ ఇచ్చారు. అసైన్డ్ భూములను తాను తీసుకోవడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. తాను ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. రాజీనామా చేస్తారా అని అడిగితే ప్రభుత్వ విచారణ పూర్తి కానివ్వండని ఆయన సమాధానమిచ్చారు. దీంతో బంతిని ఆయన కేసీఆర్ కోర్టులోకి విసిరారు. 

తాను ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడినని ఆయన శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. తాను తలొగ్గేది లేదని, తనకు సంబంధించిన అన్ని విషయాలపై ఏ విచాణనైనా ఎదుర్కుంటున్నానని ఆయన చెప్పారు. తాను తప్పు చేసినట్లు తేలితే ముక్కుకు నేలకు రాస్తానని కూడా చెప్పారు. 

బహుశా, తొలిసారి ఆయన తన సతీమణి జమునను పక్కన కూర్చోబెట్టుకుని మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను కుమారుడికి నితిన్ అని, కూతురికి నీతి అని పెర్లు పెట్టానని, వారు రెడ్డి చేర్చుకున్నారని, కానీ తాను తెలంగాణలోని బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడినని ఆయన అన్నారు 

ఈటెల రాజేందర్ మాట్లాడిన తీరు చూస్తుంటే, కేసీఆర్ ను నేరుగా ఎదుర్కోవడానికే సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. పైగా, తనపై వచ్చిన ఆరోపణలపై మాట్లాడుతూ పరోక్షంగా కేసీఆర్ కు ఓ సవాల్ కూడా విసిరినట్లు కనిపిస్తోంది. ఎవరు ఎలా సంపాదించారనేది కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. 

తద్వారా ఈటెల రాజేందర్ కేసీఆర్ మీద విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు బలమైన ఆస్త్రాన్నే అందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కొంత మంది భూకబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. వారందరిని చూపిస్తూ ప్రతిపక్షాలు కేసీఆర్ మీద విమర్శలు ఎక్కు పెట్టే అవకాశం ఉంది. 

ఇదిలావుంటే, కరోనా విషయంలో కేంద్రం చర్యలను ఇటీవలి కాలంలో ఈటెల రాజేందర్ తీవ్రంగా తప్పు పడుతూ వస్తున్నారు. కేంద్రంపై బహిరంగంగా తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇది కూడా కేసీఆర్ కు నచ్చలేదని అంటున్నారు