విద్యార్థులు తమ క్వాలిటీ టైంను విద్యాసంస్థలో  అధ్యాపకులతో గడపడం విద్యార్థుల రాజ్యాంగపరమైన హక్కు. ఆ హక్కును బంద్ లని, ఎన్నికలని, సర్వేలని, పండగలని, పబ్బాలని, ఊరేగింపులూ, నిమజ్జనాలని రకరకాల కారణాతో కాలరాస్తూనే ఉన్నారు.  పైగా ఈ సారి పండగ పేరిట 16 రొజుల సెలవులే ఎక్కువ అంటే మరో 7 రోజులు పొడిగించడం మహా దుర్మార్గం. 

ఇలా సెలవులను పొడిగించడం వల్ల విద్యార్థులపై, అధ్యాపకులపై ఒత్తిడి తీవ్రతరం అవుతుంది. ఇరువురిపై పెరిగిన ఒత్తిడి, భావితరాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దే విద్యావ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. 

ఇలా సెలవుల పొడిగింపులపై అధ్యాపకులతో మాట్లాడితే వారు వెళ్లగక్కే ఆవేదన అంత ఇంతా కాదు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పడినుండి వారిపైన మొదలయ్యే వత్తిడి విద్యా సంవత్సరం మొత్తం కొనసాగుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో బడి బాట పేరిట పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించడంతో మొదలు సిలబస్ పూర్తి చేయడం,  పరీక్షలు నిర్వహించడం, రిజల్ట్స్ లో ప్రగతి సాధించడం వరకు వారు బాధ్యతల్లో తలమునకలై ఉన్నారు.  వీటికి తోడు మధ్యలో వచ్చే ఎన్నికల విధులు, జనాభా గణన ఇతరాత్రాలు వారికి బోనస్. 

పాఠశాలల్లో ఇంత వరకు 1 నుండి 10 తరగతుల వరకు మెదటి సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలే జరగలేదు. ఇంకా సిలబస్ పూర్తి కాలేదు. నవంబరు గడిస్తే వచ్చే డిసెంబరు లో  10వ తరగతికి రివిజన్ కు వెళ్లకపొతే ఆ తర్వాత రిజల్టు పై తీవ్ర వ్యతిరేక ప్రభావం ఉంటది. వాళ్లకు సిలబస్ ఎప్పుడు పూర్తవుతుంది? రివిజన్ ఎప్పుడు పూర్తి చేయాలి?

పొనీ కేవలం 10 వాళ్లపై శ్రధ పెడితే మిగతా వాళ్ల పరిస్థితి ఎంటి? ఇలాంటి పరిస్థితుల్లో 23 రోజులు సెలవులిస్తే బడిపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.  దాదాపు నెల రోజుల సెలవుల తరువాత మల్లీ పాఠశాలలకు పిల్లలను తిరిగి ఆకర్షించడం, పాఠశాలలొ ఉంచడం అంత తేలికైన పనికాదు. విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులను బళ్ళలోకి లాక్కురావడానికి ఎంత ప్రయత్నం చేస్తారో, ఇప్పుడు కూడా అలంటి చిన్న సైజు యుద్ధమే చేయాల్సి ఉంటుంది. 

ఇన్ని రోజుల తరువాత బడికి తిరిగి వచ్చిన పిల్లలకు చదువొకింత గ్రీక్ అండ్ లాటిన్ లాగా అనిపిస్తుంది. విద్యార్ధి మేధస్సుకు తగ్గట్టు ఒక్కొక్కరికి ఒక్కో స్థాయి నుండి తిరిగి నేర్పవలిసి ఉంటుంది. ఉపాధ్యాయులపై పడే భారాన్ని పక్కకుంచండి, ఎంత విలువైన సమయం వృధా అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. 

ఇలా బడికి రావడం వల్ల ఒక క్రమశిక్షణకు అలవాటుపడ్డవారు ఇప్పుడు ఇన్ని రోజుల సెలవుల వల్ల వారి పూర్వపు స్థితికి వెళ్లడం వల్ల చాలామంది నిరుపేద బాలలు తిరిగి బాలకార్మిక వ్యవస్థలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అలా పనిచేసే చోట చిన్న పిల్లలపై ఎన్ని మానసిక, శారీరక, లైంగిక దాడులు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. 

ఇక ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సింది విద్యాహక్కు చట్టం గురించి. చట్టప్రకారంగా, రాజ్యాంగబద్ధంగా విద్యార్థులందరికీ సమానమైన స్థాయిలో విద్య అందాలి. కానీ ఇలా ఆర్టీసీ సమ్మె వల్ల ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి ఖచ్చితంగా సెలవులు ఇవ్వవలిసిందే అని అల్టిమేటం జారీ చేస్తుంటే, మరోవైపు కార్పొరేట్ పాఠశాలలు వారికి సొంత బస్సులు ఉన్న కారణంగా స్కూళ్లను యధావిధిగా నడపనున్నట్టు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మెసేజ్ లు పంపుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గురుకులాలు కూడా పనిచేయనున్నాయి. ఇలా కొందరికి మాత్రమే ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్? ఇది ఖచ్చితంగా విద్య హక్కు చట్టానికి తూట్లు పొడవడమే.  

ఇలా సెలవులను పెంచడానికి కారణం, ఆర్టీసీ సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోవడమే. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యావ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపి విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దాలి. అప్పుడే కలలుకాని తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణగా రూపాంతరం చెందుతుంది.