ఈటల రాజేందర్ ఎఫెక్ట్ ట్విస్ట్: నష్టనివారణ చర్యలకు దిగిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు అర్థమవుతోంది. కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకదనే అభిప్రాయాన్ని మార్చడానికి ఆయన సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఉద్వాసన పలికిన వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావులో అనూహ్యమైన మార్పు తెచ్చినట్లు భావిస్తున్నారు. కేసీఆర్ నష్టనివారణ చర్యలకు దిగినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఆదివారంనాడు ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల, ఫ్లోర్ లీడర్ల సమావేశం ఏర్పాటు చేసి దళిత్ ఎంపవర్ మెంట్ మీద చర్చించడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు.
తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటల రాజేందర్ కేసీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనను కలుసుకోవడానికి మంత్రులకూ ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వరని ఆయన ఆరోపించారు. నిజానికి, కేసీఆర్ ఆపాయింట్ మెంట్ లభించడం అంత సులభం కాదనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. ఏడేళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ ఏడేళ్ల కాలంలో ఆయన ప్రతిపక్షాలకు ఎప్పుడు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.
అనూహ్యంగా కాంగ్రెసు శాసనసభ్యులకు ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ మీద వినతిపత్రం సమర్పించి, చర్చించడానికి వారికి ఆ సమయం ఇచ్చారు. దీంతో కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు. మరియమ్మ లాకప్ డెత్ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతుందని గ్రహించే ఆయన అందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ వ్యవహారం ముదిరితే ముప్పు తప్పదని ఆయన భావించినట్లు చెబుతున్నారు.
మరియమ్మ మృతిపై ఆయన చకచకా చర్యలు తీసుకోవడమే కాదు, ఆమె కుటుంబ సభ్యులకు వరాలు కూడా ప్రకటించారు. లాకప్ డెత్ కు బాధ్యులైనట్లు భావించిన పోలీసాఫీసర్లపై కూడా ఆయన చర్యలకు దిగారు. అయితే, కాంగ్రెసు ఎమ్మెల్యేలు కేసీఆర్ ట్రాప్ లో పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కాంగ్రెసు పార్టీలో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
తొలిసారి కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వడం వెనక రాజకీయ వ్యూహమే ఉందని భావిస్తున్నారు. తద్వారా తాను అందరికీ అందుబాటులో ఉంటాననే సంకేతాలను ఆయన ఇచ్చినట్లు అయింది. పైగా, తాను చేపట్టే కార్యక్రమాలపై కేసీఆర్ ప్రతిపక్షాల నేతలతో మాట్లాడిన సందర్భాలేవీ లేవు. ఇప్పుడు దళిత్ ఎంపవర్ మెంట్ పేరు మీద ప్రతిపక్షాల నేతలను, ప్రజాప్రతినిధులను ఆయన ఆహ్వానించారు.
కేసీఆర్ సమావేశానికి హాజరు కాకూడదని కాంగ్రెసు, బిజెపి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పిసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన నేపథ్యంలో కాంగ్రెసు వ్యవహార శైలి మారే అవకాశం ఉంది. కేసీఆర్ మీద పోరాటానికి కాంగ్రెసు శ్రేణులను రేవంత్ రెడ్డి సమాయత్తం చేస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ నష్టనివారణ చర్యలకు దిగినట్లు చెబుతున్నారు.