దుబ్బాకలో పోరు హోరాహోరీగా సాగుతోంది. తెరాస, బీజేపీల మధ్య పోరు రంజుగా ఒక ఆక్షన్ థ్రిల్లర్ ని తలపిస్తుంది.వరుస అయిదు రౌండ్లలో బీజేపీ దూసుకెళ్ళగా తెరాస 6,7 రౌండ్లలో ఆధిక్యత సాధించినప్పటికీ.... బీజేపీ లీడ్ ని మాత్రం దాటలేకపోతుంది. 

దుబ్బాక సంస్థాగతంగా తెరాస కంచుకోట. 2014 నుంచి తెరాస అక్కడ గెలుస్తూ వస్తుంది. దానితోపాటుగా తెరాస లోని ఒక ప్రధానమైన మాస్ లీడర్ హరీష్ రావు సొంత జిల్లాలో ఉంది దుబ్బాక. జిల్లా అంతా గులాబీమయం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెరాస. బీజేపీ అంతంతమాత్రంగా ఇంకా తమ బలం నిరూపించుకునే పనిలోనే ఉన్న పార్టీ. 

సాధారణంగా ఉపఎన్నికలు అధికార పార్టీకి నల్లేరు మీద నడకగా అందరూ చెబుతూ ఉంటారు. అందునా ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస కు అక్కడ ఎదురు ఉండకూడదు. రాష్ట్రంలోని ప్రధాన నాయకులూ, మంత్రులు అంతా అక్కడ క్యాంపులు వేసి మరీ రేయింబవళ్లు కష్టపడ్డారు. ఈ పరిస్థితుల్లో అక్కడ తెరాస దే విజయం అని అంతా భావించారు. 

కానీ దుబ్బాకలో అనూహ్యంగా బీజేపీ దూసుకుపోతుంది. ప్రస్తుతానికి ఇంకా పూర్తి స్థాయి కౌంటింగ్ జరగలేదు. అప్పుడే విజేత ఎవరో మనం నిర్ణయించలేము. తెరాస ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నట్టుగా కనబడుతుంది. 6,7, 8 వ రౌండ్లలో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది కూడా. 

ఈ దుబ్బాక ఫలితాలను పరిశీలిస్తే అక్కడ పోరు ఏ స్థాయిలో హోరాహోరీగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అక్కడ కనిపించకుండా పోయింది. చివరకు డిపాసిట్లు దక్కుతాయో లేదో కూడా అర్థం కానీ పరిస్థితి. ఈ పరిస్థితిని చూస్తుంటే... దుబ్బాకలో ప్రధాన పోరు తెరాస, బీజేపీల మధ్యనే కేంద్రీకృతమైంది అనేది నిర్వివాద అంశం. 

తెరాస ఇంత చెమటోడుస్తుండడానికి ఏదైనా కారణం ఉందంటే... అది ఖచ్చితంగా కేసీఆర్ స్వయంకృతాపరాధమే. రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో బీజేపీ నామమాత్రపు పార్టీ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఒకటే అసెంబ్లీ సీటుకు పరిమితమయింది. కేసీఆర్ నిర్ణయాల వల్ల బీజేపీ అనూహ్యంగా పుంజుకొని ఇప్పుడు తెరాస నే సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. 

కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కాంగ్రెస్ వారందరికీ తెరాస ద్వారాలను తెరిచారు. ఆపరేషన్ కార్ అంటారా, ఆకర్ష్ అంటారా, లేదా అభివృద్ధిని చూసే నాయకులు వెళ్ళారా అనే విషయాన్నీ పక్కనబెడితే... కాంగ్రెస్ లో ఉన్న వారంతా తెరాస లో చేరిపోయారు. 

దీనివల్ల రెండు నష్టాలూ జరిగాయి. మొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినవారెవరైనా ఆ పార్టీలో ఉండరు అనే అనుమానం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అలా వెళ్లడం వల్ల ప్రజలు కాంగ్రెస్ నాయకుల విశ్వసనీయతపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి, అవుతున్నాయి. గెలిచినా నాయకుడు తెరాస లో చేరడు అనే గ్యారంటీ ఏమిటి అని ప్రజలు ప్రశ్నించే స్థాయికి రాష్ట్రంలో పరిస్థితులు చేరుకున్నాయి. 

ఇక ఇదే అదునుగా భావించిన బీజేపీ రాష్ట్రంలో బలపడింది. కాంగ్రెస్ లో నాయకులూ లేకపోవడం, కేంద్రం నుండి రాష్ట్రం వరకు నాయకత్వ లేమి అన్ని వెరసి బీజేపీ లాభపడింది. దీనివల్ల ప్రజలు ఓట్లు వేసేప్పుడు కాంగ్రెస్ కి వేయాలంటే ఆలోచించడంతో.... తెరాస వ్యతిరేక ఓటు అంతా కూడా బీజేపీ వైపు కన్సాలిడేట్ అయింది. 

రాష్ట్రంలో మూడుముక్కలాటగా పోరు ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలేది. కానీ ఎప్పుడైతే తెరాస చర్యల వల్ల కాంగ్రెస్ బలహీనపడిందో... ప్రభుత్వ వ్యతిరేక వోట్ తో పాటుగా, ఆంటీ కాంగ్రెస్ ఓట్ కూడా బీజేపీ వైపుగా మొగ్గు  ఇంతకుముందు యాన్తి కాంగ్రెస్ ఓటు రాష్ట్రంలో తెరాస కు వచ్చేవి. కానీ ఇప్పుడు బీజేపీ ఎదుగుదల వల్ల కాంగ్రెస్ వ్యతిరేకివె ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండు కూడా బీజేపీ ఖాతాలోకి వెళుతుండడంతో ఏ పరిస్థితి ఏర్పడింది. 

ఈ పరిస్థితులను చూస్తుంటే.... రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తెరాస కు పెద్ద ఛాలెంజ్ అని చెప్పక తప్పదు. నగరంలో ఇప్పటికే బీజేపీకి బలముంది. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికలు జరిగితే బీజేపీ తెరాస ఆశలకు భారీగానే గండి కొట్టేలా కనబడుతుంది.