దుబ్బాక ఉప ఎన్నిక: కాంగ్రెసుకు తెలంగాణ రాములమ్మ షాక్?
కాంగ్రెస్ లేడీ ఫైర్ బ్రాండ్ రాములమ్మ ఉరఫ్ విజయశాంతి మాత్రం రాజకీయ తెరపై కనబడడం లేదు. రాష్ట్రంలో తమ పూర్వ వైభవాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ తమ పూర్తి శక్తులను దుబ్బాకలో కేంద్రీకరించింది. రేవంత్, ఉత్తమ్, సీతక్క వంటి నాయకులంతా దుబ్బాకలో తిష్ట వేశారు. కానీ రాములమ్మ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు.
తెలంగాణలో రాజకీయ వేడి ఊపందుకుంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికలు అన్ని వెరసి రాజకీయ పార్టీల మధ్య హోరు తీవ్రమైంది. తెలంగాణాలో తమదే హవా అని చాటుకోవడానికి తెరాస విశ్వప్రయత్నం చేస్తుండగా.... తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం తామే అని నిరూపించుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయి.
ఇక ముఖ్యంగా దుబ్బాక పోరు హీట్ బాగా ఎక్కువగా ఉంది. ఇప్పటికే నామినేషన్ల గడువు ముగిసింది. తెరాస దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణిని బరిలోకి దింపితే... కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి తనయుడిని బరిలోకి దింపింది. బీజేపీ సైతం గత ఇక్కడ పోటీ చేసి ఓడిన రఘునందన్ రావు ను బరిలో ఉంచింది.
ఇక ఈ హోరాహోరీ పోరులో తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన ఉద్దండులు దుబ్బాకలోనే తిష్ట వేసి రాజకీయాన్ని నెరుపుతు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో బిజీగా ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లుగా కొందరు పర్యటిస్తుంటే... మరికొందరేమో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ సమీకరణాలను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నప్పటికీ... కాంగ్రెస్ లేడీ ఫైర్ బ్రాండ్ రాములమ్మ ఉరఫ్ విజయశాంతి మాత్రం రాజకీయ తెరపై కనబడడం లేదు. రాష్ట్రంలో తమ పూర్వ వైభవాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ తమ పూర్తి శక్తులను దుబ్బాకలో కేంద్రీకరించింది. రేవంత్, ఉత్తమ్, సీతక్క వంటి నాయకులంతా దుబ్బాకలో తిష్ట వేశారు. కానీ రాములమ్మ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు.
మెదక్ జిల్లాలో ముఖ్య నాయకురాలిగా ఉన్న విజయశాంతి దుబ్బాక ఉపఎన్నికలప్పుడు స్క్రీన్ మీద రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. రాజకీయంగా కాంగ్రెస్ కు చావో రేవో తేల్చుకునే తరుణంలో సొంత జిల్లా నేత కనబడకపోవడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది.
వాస్తవానికి రాములమ్మ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే రాజకీయ అరంగేట్రం చేసారు. ఆ తరువాత తల్లి తెలంగాణ పార్టీ అంటూ కొన్నాళ్ళు యుద్ధం చేసినప్పటికీ... 2009లో మెదక్ నుంచి ఎంపీగా తెరాస టికెట్ పై గెలుపొందారు. తెలంగాణ వాణిని ఢిల్లీ లెవెల్ లో బలంగా వినిపించింది రాములమ్మ. ఆ తరువాత కేసీఆర్ తో పొసగక కాంగ్రెస్ లో చేరింది. చేరిన తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో ఓటములను చవిచూసింది
ఆమె అసెంబ్లీ ఎన్నికలప్పుడు టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించింది. బహిరంగంగానే తన నిరసన స్వరాన్ని వినిపించింది. ఇక ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత రాములమ్మ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గాంధీ భవన్ వైపు కూడా కన్నెత్తి చూడడం లేదు.
వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నిక అనగానే విజ్జయశాంతిని అక్కడి నుండి బరిలో నిలపాలని అంతా భావించారు. దానికి విజయశాంతి కూడా సుముఖంగానే ఉన్నారు. కానీ స్థానిక దుబ్బాక నేతలు రెండు పర్యాయాలు వరుసగా ఓటమి చెందిన విజయశాంతిని ఎంతమాత్రమూ అంగీకరించలేదు. ఇక అది లగాయతు రాములమ్మ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏకంగా దుబ్బాక ప్రచారానికి కూడా రాంరాం అనేసారు.
అంతేకాకుండా రాములమ్మ ఏఐసీసీ పదవిని ఆశించారు. పలుమార్లు పార్టీ పెద్దల వద్ద ఈ విషయమై చర్చించినప్పటికీ... దానిపై మాత్రం మాట కూడా ముందుకు కదలడం లేదు. దీనితో విజయశాంతిగారు తీవ్రంగా అలకబూనారు. అన్ని వెరసి పార్టీకి దూరంగా, ఎన్నికల సంరంభానికి సంబంధం లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు.
అయితే సినిమాల పరంగా రాములమ్మ సెకండ్ ఇన్నింగ్స్ పై కూడా ఈ సందర్భంగా ఒక చర్చ మొదలయింది. రాములమ్మ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రెండవ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. దీనితో రాములమ్మ ఇప్పట్లో ఎన్నికలు లేనందున పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టిందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఫైర్ బ్రాండ్ మాత్రం ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఎన్నికప్పుడు లేకపోవడం మాత్రం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.