నక్కతోక తొక్కడమంటే... అజిత్ పవార్ ను అడగాల్సిందే?
మహారాష్ట్ర రాజకీయాల్లో సుడిగాడు ఎవరన్నా ఉన్నారంటే...అది ఖచ్చితంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్. నక్కతోక తొక్కడం అంటే ఏమిటో తెలియాలంటే...ఆయన రీసెంట్ గ్రాఫ్ చూడాలి. ఆ గ్రాఫ్ చూస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం.
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సుడిగాడు ఎవరన్నా ఉన్నారంటే...అది ఖచ్చితంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్. నక్కతోక తొక్కడం అంటే ఏమిటో తెలియాలంటే...ఆయన రీసెంట్ గ్రాఫ్ చూడాలి. ఆ గ్రాఫ్ చూస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం.
గత పర్యాయం కాంగ్రెస్ ఎన్సీపీ ల కూటమి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీ నేతగా కొనసాగారు.
ఇక 2019లో ఎన్నికలు అయిపోయిన తరువాత దేవేంద్ర ఫడ్నవిస్ తెల్లవారుఝామున చేసిన ప్రమాణ స్వీకారంలో కూడా అజిత్ పవార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అది ఒక మూడు రోజులపాటు మాత్రమే కొనసాగినా ఆయన మాత్రం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు.
Also read: 'మహా' రాజకీయాలు: అందరి చూపూ పంకజ ముండేపైనే...
ఇక కాంగ్రెస్-ఎన్సీపీ- శివసేనల కూటమి ద్వారా ఏర్పడ్డ మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలోనూ ఆయన ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. దీన్ని చూసి మాత్రమే అదృష్టం అనుకోకండి. బీజేపీకి మద్దతిచ్చినప్పుడు ఆయన మీద నీటిపారుదల రంగానికి సంబంధించి దాఖలైన కేసులలో అతనికి క్లీన్ చిట్ లభించింది.
ఒక మూడు రోజులపాటు ఆయనకు ఆయన కుటుంబసభ్యులకు మధ్య సంబంధాలు చెందితే చెడ్డాయేమో కానీ...ఆదెబ్బకు ఆయన మీదున్న కేసులు మాత్రం కనపడకుండా పోయాయి.
ఇక ఆ మూడు రోజులతరువాత మహారాష్ట్రలో జరిగిన ఫామిలీ డ్రామా అందరికి తెలిసిందే. ఆతరువాత ఆయన రాజీనామా చేయడం ఎన్సీపీ గూటికి ఘర్ వాపసీ కార్యక్రమం అందరికి తెలిసిందే.
ఈ సారి ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవితోపాటు అత్యంత ముఖ్యమైన హోమ్ మంత్రిత్వ శాఖ కూడా దక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన ఈ పోర్టుఫోలియో దక్కించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక మహారాష్ట్రలో పావార్ల కుటుంబంలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని మాట వినబడుతున్నాయి. అజిత్ పవార్ కి మొదటిసారి ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేసినప్పుడు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఒకరకంగా ఆయనకు ఒక రిహాబిలిటేషన్ కల్పించింది ఎన్సీపీ.
ఎప్పుడైతే అజిత్ పవార్ ఇలా దెబ్బతీశాడు అనే విష్యం అర్థమయిందో...శరద్ పవార్ సైతం మేల్కొన్నాడు. మొన్నటివరకు సుప్రియ సూలే ఢిల్లీలో శరద్ పవార్ వారసురాలిగా కొనసాగితే... రాష్ట్రంలో ఎన్సీపీ అధ్యక్షుడి వారసుడిగా అజిత్ పవార్ కొనసాగుతారు అని అందరూ అనుకునేవారు. కాకపోతే ఈ ఎన్నికలకు ముందు నుండే పార్టీలో వారసత్వపోరు నడుస్తుందనేది బహిరంగ రహస్యం.
ఇక అజిత్ పవార్ పరిణామం నేపథ్యంలో శరద్ పవార్ తన కూతురు సుప్రియ సూలేను మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లోకి దింపాలని యోచిస్తున్నారట. అందుకే ఈ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసే రోజు ఆమె మహారాష్ట్ర అసెంబ్లీలో అందరిని పలకరించడానికి కారణం ఇదేనట.
దానితోపాటు ఇప్పటివరకు మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మహిళా ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. కాబట్టి ఆయన తన కూతురికి లైన్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు.
Also read: తెరపైకి శివాజీ.. హిందుత్వ స్థానేనా లౌకికత్వం..ఆసక్తికరంగా మహా రాజకీయం
ఇలాంటి ఇన్ని వ్యతిరేకపరిస్థితుల్లో కూడా అజిత్ పవార్ ఇంత కీలక పదవిని దక్కించుకోవడం నిజంగా విశేషమే. ఆయన దక్కించుకోవడానికి ప్రధాన కారణం ఆయనకు పార్టీ మీద ఉన్న పట్టు.
అంతే కాకుండా గ్రౌండ్ లెవెల్ లో ఉన్న నేతలతో సంప్రదింపులు జరిపేది, వారి టిక్కెట్ల కేటాయింపు ఇతరత్రాలు అన్ని చూసేది ఆయనే. దానితోపాటు ప్రజల్లో సైతం అజిత్ పవార్ కి చాలా ఇమేజ్ ఉంది. ఆయన ఘర్ వాపసీ సందర్భంగా "ఏకచ్ వాదా .... అజిత్ దాదా" అనే నినాదాలతో మూడు పార్టీలు సమావేశమైన హోటల్ ప్రాంగణం దద్దరిల్లిన విషయం మనకు తెలిసిందే.
మొత్తానికి అజిత్ పవార్ ఏదేమైనా నక్కతోక తొక్కాడు అని అనడంలో ఎటువంటి సందేహం, సంశయం అవసరం లేదు.