దేశ యావత్తును ఆకర్షించిన రెండు సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండు సంఘటనల విషయంలో అనుసరించిన వైఖరి ఏ విధమైన సంకేతాలను పంపుతుందనేది ప్రధానమైన చర్చగా మారింది. ఒకటి - ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాగా రెండోది- దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రెండు విషయాల్లో కేసీఆర్ అనుసరించిన వైఖరి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు, ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది. 

సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ ప్రదర్శించిన ఔదార్యం ప్రశంసలు అందుకుంటోంది. ఆర్టీసీ కార్మికులు కూడా ఆయనను వేనోళ్ల పొగడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ సమ్మె యాభై రోజులకు పైగా జరిగింది. చివరకు డిమాండ్లేవీ పరిష్కారం కాకుండానే సమ్మెను విరమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆ తర్వాత కేసీఆర్ ఔదార్యం ప్రదర్శించి ఆర్టీసీ కార్మికులకు మేలు చేశారు. 

కేసీఆర్ ఔదార్యాన్ని మెచ్చుకునే సమయంలో కొన్ని విషయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు సంఘాలు ఉండకూడదనేది ఆయన స్పష్టంగా చెబుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి యూనియన్లను ఉద్యోగులు ఆశ్రయిస్తారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడానికి యూనియన్లు ప్రభుత్వాలతో వ్యవహారాలు నడుపుతాయి. ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించినప్పుడు ఆందోళనలకు దిగడం, చివరగా సమ్మెకు దిగడం ఆనవాయితీ. అయితే, యూనియన్ల అవసరం లేదని కేసీఆర్ చెబుతున్నారు. అయితే, ఆర్టీసీలో కార్మికుల సమస్యలను తెలుసుకోవడానికి ప్రతినిధులను నియమిస్తానని చెబుతున్నారు. 

నిజమే, ప్రభుత్వాధినేతకు ఇష్టం ఉంటే సమస్యలను పరిష్కరించవచ్చు, ఇష్టం లేకపోతే పరిష్కరించుకపోవచ్చు. అది ప్రభుత్వాధినేత ఇష్టాయిష్టాలపై మాత్రం ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాధినేత మొండిగా వ్యవహరించినప్పుడు ఉద్యోగులకు ఉండే ప్రత్యామ్నాయం ఏమీ ఉండదు. యూనియన్లు లేకపోవడం వల్ల కార్మికులు లేదా ఉద్యోగులు యాజమాన్యం దయాదాక్షిణ్యాల మీద పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామం. కోర్టులకు ఎక్కినా ఫలితం ఉండదనే సంకేతాలను కూడా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె పంపించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది.

ఇక రెండోది- దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్. ఈ ఎన్ కౌంటర్ ను ప్రజా ప్రతినిధులు సైతం హర్షిస్తున్నారు. రేపిస్టులను కాల్చి పారేయడమే న్యాయమని అంటున్నారు. రేపిస్టులను ఎన్ కౌంటర్ చేయడం ద్వారా దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తాను ఆ విధంగా అనలేదని ఆయన తర్వాత అన్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. ఎన్ కౌంటర్ ను దేశవ్యాప్తంగా పలువురు ప్రతినిధులు ప్రశంసించారు. ఎన్ కౌంటర్ ను ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే రోజా కూడా సమర్థించారు. 

నిజంగానే, ఎన్ కౌంటర్ జరిగిందా అంటే సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ కథనం ప్రకారం జరిగిందనే అనుకోవాలి. కానీ, ప్రజుప్రతినిధులు, ఇతరులు చేస్తున్న ప్రకటనలను బట్టి ఎన్ కౌంటర్ అనే పదానికి అర్థం మారిపోయిందని స్పష్టమవుతోంది. కోర్టు నిర్వహించాల్సిన పాత్రను పోలీసులే నిర్వహించడంగా ఇది పరివర్తన చెందింది. పోలీసులే నేరారోపణ చేసి, నిందితులను పట్టుకుని, నేరస్థులుగా ముద్ర వేసి చంపేయడంగా అది పరివర్తన చెందడాన్ని ప్రస్తుత పరిణామం తెలియజేస్తోంది.

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిస్పందనలు చూస్తే పోలీసు న్యాయాన్ని అంగీకరించినట్లు అనిపిస్తోంది. ఇది ఎంత ప్రమాదకరమైన దిశను తీసుకుంటుందనేది ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నవారికి అర్థమవుతున్నట్లు లేదు. ఎన్ కౌంటర్ ను సమర్థించినవారు దాదాపుగా విచక్షణ కోల్పోయినట్లు అనిపిస్తోంది.

దిశ సంఘటన అతి క్రూరమైన నేరమే. ఆ సంఘటనకు పాల్పడినవారు అత్యంత క్రూరులు, సంఘ వ్యతిరేక శక్తులు. ఆ నలుగురే కేసులో నేరస్థులని అనుకుందాం, సమాజం దాన్ని అంగీకరించింది కూడా. భవిష్యత్తులో సంఘటనతో సంబంధం లేనివారు కేసుల్లో ఇరుక్కుంటే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ ను మార్గదర్శకులకు ప్రశంసిస్తున్నవారు తమ కుటుంబాలకు చెందినవారు అనుకోకుండా చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు వారి మనోవేదనకు లేదా వారి నిర్దోషిత్వ నిరూపణకు పరిష్కారం ఏ వ్యవస్థ చేస్తుందనేది ఆలోచించాలి. 

ఏమైనా, తెలంగాణ ఈ రెండు సంఘటనల విషయంలో భవిష్యత్తు ప్రమాదాలకు సంకేతాలను పంపించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తే సంభవించే పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆలోచించాలి. అటువంటి డిమాండ్లు వస్తున్నాయి కూడా. న్యాయవ్యవస్థలో జరుగుతున్న జాప్యాన్ని సాకుగా తీసుకుని ఈ విధమైన తక్షణ న్యాయాలను పోలీసులే అందిస్తే ఆ ప్రమాదం ఎంత దూరం పోతుందనేది ఊహించడం కూడా కష్టమే.

ఆర్టీసీ సమ్మె ఎలాగూ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. సమ్మెలను కట్టడి చేయడానికి అవసరమైన అస్త్రాన్ని ఇతర ప్రభుత్వాలకు కేసీఆర్ అందించారు. అయితే, దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ విషయంలో చట్టాలకు సంబంధించిన ప్రక్రియలను సరిగా కొనసాగించకపోతే, ఆయన మరో ప్రమాదకరమైన అస్త్రాన్ని కూడా అందించినవారవుతారు.

- కాలనేమి

(ఈ వ్యాసంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలతో ఏషియా నెట్ తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. అభిప్రాయాలు రచయితకు మాత్రమే చెందుతాయి)