కమ్మ వర్సెస్ కాపు: చంద్రబాబుపై కినుక, రచ్చకెక్కిన బెజవాడ చిచ్చు

విజయవాడ టీడీపీలో వర్గపొరు ముదిరి, విభేదాలు రచ్చకెక్కాయి. కేశినేని నానిపై ముగ్గురు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.

Differences cropped up among Vijayawada TDP leaders

విజయవాడ: విజయవాడ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై టీడీపీ నాయకులు బొండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విమర్శల జడివాన కురిపించారు. 

విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో నెలకొన్న విభేదాలు సమసిపోయాయని భావిస్తున్న తరుణంలో వారు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడాన్ని బట్టి విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయనేది అర్థమవుతోంది.

పార్టీ అధినేత చంద్రబాబు కేశినేని నానికి నైతిక మద్దతు ఇస్తున్నారనే అభిప్రాయంతో ఆ ముగ్గురు నేతలు ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ స్థితిలో విజయవాడ టీడీపీలో వర్గ పోరు చోటు చేసుకుంది. అది కమ్మ వర్సెస్ కాపు పోరుగా పరిణమించినట్లు కనిపిస్తోంది. వంగవీటి రంగా పేరును కూడా ముందుకు తెచ్చి వారు కేశినేనిపై మండిపడ్డారు. 

వంగవీటి రంగా హత్య కేసు నిందితులను వెంట పెట్టుకుని కేశినేని ప్రచారం చేస్తున్నారని, టీడీపీని కుల సంఘంగా మార్చాలని చూస్తున్నారని వారు విమర్శలు చేశారు. దీన్ని బట్టి టీడీపీ నేతల మధ్య విభేదాలు కులపోరుగా మారినట్లు కనిపిస్తోంది. విజయవాడ కార్పోరేషన్ మేయర్ అభ్యర్థిగా చంద్రబాబు నుంచి అంగీకారం తెచ్చుకోవడంలో మిగతా నాయకులపై కేశినేని పైచేయి సాధించారని భావిస్తున్నారు.

Also Read: చంద్రబాబుకు హెచ్చరికలు: కేశినేనిపై బోండా ఉమా, బుద్ధా తీవ్ర వ్యాఖ్యలు

విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో టీడీపీలోని వర్గపోరు ఎటు దారితీస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. తనపై ముగ్గురు టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కేశినేని నాని స్పందించడానికి నిరాకరించారు. ఆ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. 

ఈ వ్యవహారమంతా చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. చంద్రబాబును కూడా హెచ్చరించే స్థాయిలో బుద్ధా వెంకన్న, బొండా ఉమా వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని ఉంటే చంద్రబాబు పర్యటనలో తాము పాల్గొనబోమని వారు చెప్పారు. ఈ రకంగా చూస్తే బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్ మీరా తెగించే కనిపిస్తున్నారు. అధిష్టానం తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. వారు ఏ ఉద్దేశంతో ఇంతగా తెగించారనే చర్చ ప్రస్తుతం సాగుతోంది.

నిజానికి వైసీపీని ఎదుర్కోవడంలో బొండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న ముందు వరుసలో ఉంటూ వచ్చారు. చంద్రబాబుకు ఎనలేని మద్దతు ఇస్తూ వచ్చారు. చంద్రబాబుకు విధేయులుగా వారికి పేరు ఉంది. అటువంటి నాయకులు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది, కేవలం కేశినేని నానిపై ఆగ్రహం మాత్రమేనా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నాలు సాగుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios