కమ్యూనిస్టు పార్టీల నేతల్లో సీపీఐ నేత నారాయణ తీరే వేరు. ఆయన వ్యవహార శైలే వేరు. కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆచితూచి మాట్లాడుతారు. సంచలన వ్యాఖ్యలు చేయరు. కానీ నారాయణ మాత్రం దానికి విరుద్ధం. ఆయన తన ప్రత్యేకమైన వ్యాఖ్యల ద్వారా, చేష్టల ద్వారా కమ్యూనిస్టేతర పార్టీల నేతలను తలపిస్తున్నారు.

నారాయణ సీనులోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ నాయకుల ప్రకటనల పట్ల కూడా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా ఆయన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రను కలుసుకుని సంచలనం సృష్టించారు. ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నారు. 

కమ్యూనిస్టు పార్టీ నేతలు హేతువాదులు. దైవాన్ని విశ్వసించరు. దేవుళ్లను కొలిచే స్వాములను వ్యతిరేకిస్తారు. కానీ ఆయన స్వరూపానందేంద్రను దర్శించుకోవడమే కాకుండా ఆయన సత్కారం కూడా పొందారు. జీవీఎంసీ 97వ వార్డు సీపీఐ అభ్యర్థి యశోద తరఫున ప్రచారం చేస్తూ ఆయన స్వరూపానందేంద్రను కలిశారు. 

మిమ్మల్ని కలిసినవారందరినీ గెలిపిస్తారట కదా అంటూ తమ అభ్యర్థిని కూడా గెలిపించాలని ఆయన కోరారు. 97వ వార్డులోనే స్వరూపానంద ఆశ్రమం ఉంది. ప్రచారంలో భాగంగా ఆయన స్వరూపానందను కలిశారు.  స్వరూపానందేంద్ర నారాయణకు శాలువా కప్పి ఆశీస్సులు కూడా ఇచ్చారు. 

భేటీ అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. స్వరూపానందను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు తెలిపారు ప్రచారంలో భాగంగా మఠానికి వెళ్లామని, ఆయన ఆశీస్సులు తీసుకుంటే గెలుస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉందని, అందువల్ల సిపిఐ అభ్యర్థికి ఆశీస్సులు ఇవ్వాలని స్వామిని అభ్యర్థించామని ఆయన వివరించారు. ఇందులో ఏ విధమైన రాజకీయ కోణం లేదని అన్నారు.

జగన్ ఇంట్లో కుక్కలను కట్టేసినంత స్థలం కూడా పేదలకు ఇవ్వడం లేదని ఆ మధ్య నారాయణ వ్యాఖ్యానించారు. అంత జనరంజకంగా వ్యాఖ్యలు చేయడం నారాయణ నుంచే ప్రారంభమైందని చెప్పాలి. దానిపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్రగా మండిపడ్డారు. అంతకన్నా జనరంజకమైన వ్యాఖ్యలు సీపీఐ నేత నారాయణ ఎన్నో చేశారు. తన వ్యాఖ్యల ద్వారా, వ్యవహారశైలి ద్వారా కమ్యూనిస్టు పార్టీల్లో నారాయణ కొత్త ఒరవడిని సృష్టించారు.