కరోనా వైరస్‌ మహమ్మారి ఎవరినీ వదల్లేదు. అన్ని క్రీడల మాదిరి క్రికెట్‌ సైతం కరోనా వైరస్‌ కారణంగా పూర్తిగా స్థంభించిపోయింది. ఈ ఏడాది జరగాల్సిన పాపులర్‌ టీ20 లీగ్‌ ఐపీఎల్‌పై అనుమానాలు పెరుగుతుండగా, అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణ సైతం సందిగ్ధంలో పడింది. 

ఐపీఎల్‌ వాయిదా క్రికెటర్ల వ్యక్తిగత ఆదాయాలపై ప్రభావం చూపనుండగా.. ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోవటంతో క్రికెట్‌ బోర్డులు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదంలో పడ్డాయి. సుమారు 80-90 రోజులు క్రికెట్‌ నిలిచిపోవటంతో రానున్న కాలంలో క్రికెట్‌ బోర్డులు అత్యంత గడ్డు పరిస్థితులు చవిచూసే ప్రమాదం పొంచివుంది. 

కరోనా వైరస్‌ను మహమ్మారిగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ నిలిచిపోయింది. జరుగుతున్న సిరీస్‌లతో పాటు జరగాల్సిన సిరీస్‌లు రద్దు, వాయిదా పడ్డాయి. 

కరోనా మహమ్మారి మూలంగా అంతర్జాతీయ క్రికెట్‌ ఇప్పటికే 80 రోజుల షెడ్యూల్‌ను కోల్పోయింది. పరిస్థితుల్లో వేగంగా మార్పు కనిపించకుంటే, మరిన్ని రోజులను సైతం కోల్పోవాల్సి ఉంటుంది. 

ఈ నేపథ్యంలో నష్టపోయిన షెడ్యూల్‌ను సర్దుబాటు చేయటంతో పాటు ఆర్థికంగా ఏర్పడిన శూన్యతను ఎదుర్కొవటం క్రికెట్‌ బోర్డులకు సవాల్‌ విసరనుంది. మార్చితో మొదలు : మార్చిలో మూడు అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌లు మొదలయ్యాయి. 

ఈ మూడు సిరీస్‌లు మధ్యలోనే రద్దుగా ముగిశాయి. భారత్‌తో మూడు వన్డేల కోసం దక్షిణాఫ్రికా జట్టు ఉపఖండానికి చేరుకుంది. వర్షం కారణంగా ధర్మశాలలో తొలి వన్డే సాధ్యపడలేదు. లక్నో, కోల్‌కతలలో జరగాల్సిన రెండు వన్డేలను బీసీసీఐ రద్దు చేసింది. సిరీస్‌ను వాయిదా వేస్తూ, నూతన షెడ్యూల్‌ తర్వాత ప్రకటిస్తామని భారత్‌, దక్షిణాఫ్రికాలు వెల్లడించాయి. 

అభిమానులు లేకుండా ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడిన న్యూజిలాండ్‌ సైతం సిరీస్‌ మధ్యలోనే స్వదేశానికి తిరిగి పయనమైంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకలో రెండు టెస్టుల సిరీస్‌ ఆడాల్సిన ఇంగ్లాండ్‌ సైతం పర్యటనను రద్దు చేసుకుంది. 

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం నెమ్మదిగా లాక్‌డౌన్‌లోకి వెళ్తున్న తరుణంలోనే ఈ మూడు సిరీస్‌లు రద్దు అయ్యాయి. కోవిడ్‌-19 దెబ్బ ఇక్కడితోనే మొదలైంది. కోవిడ్‌-19 దెబ్బకు ఏప్రిల్‌ మాసం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నిజానికి ఏప్రిల్‌ పూర్తిగా ఐపీఎల్‌ సీజన్‌. ఈ నెలలో చెప్పుకోదగిన ద్వైపాక్షిక సిరీస్‌లు షెడ్యూల్‌ చేయలేదు. 

అన్ని దేశాల క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉంది. ఐపీఎల్‌ వాయిదాతో ఏప్రిల్‌ సైతం క్రికెట్‌ లేని నెలగా మిగలనుంది. మరోవైపు ఐర్లాండ్‌, జింబాబ్వేల ఓ టెస్టు, ఐదు టీ20ల సిరీస్‌ రద్దు అయింది. 

క్రికెట్‌కు అతిపెద్ద సీజన్‌ మే-జూన్‌!. ఈ రెండు నెలల సమయంలో కనీసం 55 రోజుల క్రికెట్‌ షెడ్యూల్‌ చేయబడింది. కోవిడ్‌-19 కారణంగా ఈ 55 రోజుల క్రికెట్‌ సీజన్‌ పూర్తిగా వాయిదా/ రద్దు చేయబడింది. 

ఆర్థిక నష్టాన్ని పూడ్చడం చాలా కష్టం...

 ఇతర క్రీడల్లో ఆదాయ వనరుల వలే, క్రికెట్‌లోనూ ప్రధానంగా ఆట ఆడితేనే ఆదాయం. స్పాన్సర్లు, ప్రసార హక్కుల ద్వారా బోర్డులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. చాలా బోర్డులకు ప్రస్తుతం ప్రసార భాగస్వాములు ఉన్నారు. కానీ ఆట జరగనిదే, కంపెనీలు డబ్బులు చెల్లించవు. 

పైగా ఒప్పందం ప్రకారం అనుకున్న సమయంలో మ్యాచుల నిర్వహణ లోపం కారణంగా ప్రసార కంపెనీలు బోర్డులను ఆర్థిక నష్టపరిహారం కోరే అవకాశం లేకపోలేదు. ఐపీఎల్‌ రద్దు అయితే బీసీసీఐ కనిష్టంగా రూ. 3 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోనుంది. 

వేసవి సీజన్‌ ను నష్టపోయిన క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆర్థికంగా ఇప్పుడే కష్టాల్లో పడింది. రూ. 1500 కోట్ల అప్పు కోసం బ్యాంకుల తలుపు తట్టింది. బొటాబొటి ఆదాయం కలిగిన వెస్టిండీస్‌, శ్రీలంకల పరిస్థితి చెప్పనక్కర్లేదు. 

ప్రసార భాగస్వామి సహా ఇతర స్పాన్సర్లు ముందుకు రాకపోవటంతో ఈ రెండు బోర్డులకు అసలు ఆదాయ వనరే లేకుండా పోయింది. అంతర్జాతీయ క్రికెటర్లపై దీని ప్రభావం కాస్త తక్కువే. 

కానీ అన్ని దేశాల్లో దేశవాళీ క్రికెటర్లపై దీని ప్రభావం గణనీయంగా కనిపించనుంది. దేశవాళీ ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులు ఉండవు. మ్యాచు ఫీజుల నుంచే ప్రధానంగా ఆర్జిస్తారు. ఇప్పుడు మ్యాచులే లేకపోవటంతో దేశవాళీ క్రికెటర్ల ఆదాయ వనరు తుడిచిపెట్టుకుపోయింది. 

కష్టకాలంలో క్రికెట్‌ బోర్డులు సైతం ఈ విషయంలో దేశవాళీ క్రికెటర్లకు సాయం చేసేందుకు ముందుకొచ్చే అవకాశం లేదు. భారత్‌లోనే కాదు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశవాళీ సర్క్యూట్‌లో ఈ మార్పు కనిపించనుంది. కరోనా వైరస్‌ కారణంగా నష్టపోయిన షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకునేందుకు, క్రికెట్‌ బోర్డులు పోటీపడే వీలుంది.