రంజాన్ మాసమోస్తుందంటే హైదరాబాద్ వాసులంతా ఆతృతగా ఎదురు చూసేది దేని గురించేనా ఉందంటే అది ఖచ్చితంగా హలీం గురించే. ఈ నోరూరించే వంటకం కోసం హైదరాబాదీల ఏ లెవెల్ లో ఎగబడతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 

ఈ రంజాన్ మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచే ఇఫ్తార్ సమయానికి ఈ హలీం కోసం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అని తేడా లేకుండా అన్ని మతాల వారు క్యూలు కడతారు. మతాలకతీతంగా హైదరాబాదీలంతా ఏకమవుతారు. 

అలాంటి ఈ హలీం ఈసారి దొరుకుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సాధారణంగా హలీం తయారీ కోసం ఏర్పాట్లు దాదాపుగా రంజాన్ కి రెండు నెలల ముందు నుండే మొదలవుతాయి. ఒక్కపొద్దులు ప్రారంభమయ్యే నెల రోజుల ముందు నుండే బట్టీలను తయారు చేయడం మొదలుపెడతారు. 

ఇలా బట్టీలను తయారు చేయడం, ప్రతి ఫేమస్ హలీం సెంటర్ తన పాత హలీం మాస్టర్లకు కబురు పెట్టడం వారు ఎక్కడున్నారు కనుక్కొని వారి ఆరాలు తీయడం హలీం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఈ సారి ఏమైనా కొత్త ఫ్లేవర్లు ప్రవేశపెట్టాలా అనే విషయంపై తీవ్రంగా ఆలోచనలు చేస్తుంటారు. 

ఇలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే వెజ్ హలీం, ఫిష్ హలీం మొదలైనవన్నీ. మరో వారం రోజుల్లో సరిగ్గా వచ్చే శుక్ర లేదా శనివారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమవనున్నాయి. ఈ సారి ప్రార్థనలకు మసీదులకు కూడా మే 3వతేది వరకు వెళ్ళలేరు. 

మే 3వ తేదీ వరకు హోటళ్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఆ తరువాత కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అక్కడ కూర్చొని తినడానికి అనుమతిస్తుందా లేదా అనేది ఒక అనుమానం. 

ఒకవేళ మే 3 తరువాత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చినప్పటికీ... అప్పటికే రంజాన్ మాసం 30 రోజుల్లో దాదాపుగా 10 రోజులు అయిపోతాయి. ఆ తరువాత మిగిలి ఉండేది కేవలం మరో 20 రోజులు మాత్రమే. ఆ 20 రోజుల కోసం మాత్రమే గనుక ఏర్పాట్లు చేస్తే పెద్ద వచ్చే లాభం ఉండదు. 

ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పర్మిషన్లు ఇచ్చినా ఇంత తక్కువ సమయంలో బట్టీలు ఏర్పాటు చేయడం, ఈ లాక్ డౌన్ సమయంలో బావర్చీలను తీసుకురావడం చాలా శ్రమతో కూడుకున్న పనులు. 

ఇక వీటన్నిటిని పక్కన పెడితే....హలీం అమ్మకందారుల్లో కొంతమంది తమ మనసులోని కొన్ని అనుమానాలను సైతం వెలిబుచ్చారు. ప్రస్తుత తబ్లీగి జమాత్ ఈవెంట్ తరువాత ప్రజల్లో నెలకొన్న ఒకరకమైన అనుమానాల వల్ల హలీం అమ్మకాలపై ఒకింత ప్రభావం చూపెట్టే ఆస్కారం కూడా లేకపోలేదు అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

మిగిలిన రెస్టారెంట్లన్నీ ఇదే బాటలో ఉంటే... హలీం లో ప్రఖ్యాతి గడించిన, అత్యధిక పార్సిళ్లను అమ్మే పిస్తా హౌస్ మాత్రం డెలివరీలను ప్రవేశ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది. 

ఇప్పటికే ఈ విషయమై అధికారులతో, కొందరు నేతలతో కూడా ఈ సదరు రెస్టారంట్ ప్రతినిధులు మాట్లాడినట్టు కూడా తెలియవస్తుంది. అందుకు అనుగుణంగానే వారు ఒక ఫంక్షన్ హాల్ ను అద్దెకు తీసుకొని అక్కడే తాయారు చేపించి సోషల్ డిస్టెంసింగ్ సహా ఇతర నియమాలను పాటిస్తూ, హలీం తయారుచేసేవారందరికీ..... వైద్య పరీక్షలను నిర్వహించి ఆతరువాత మాత్రమే అనుమతిస్తూ హలీం తాయారు చేపించి స్విగ్గి, జొమాటోలతో సహా వారు సైతం హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో డెలివరీ పాయింట్లను పెట్టి వాటిని విక్రయించాలని ఆలోచిస్తున్నట్టు తెలియవస్తుంది. తెలియవస్తుంది. 

కాకపోతే తాజాగా ఢిల్లీలో ఒక పిజ్జా డెలివరీ ఏజెంట్ కి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో.... ప్రజలు డెలివరీలను సైతం ఏ స్థాయిలో స్వాగతిస్తారో వేచి చూడాల్సిన మరో అంశం. ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో హలీం తయారీదారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఈ నేపథ్యంలో చూడాలి హలీం పై ఈ సదరు రెస్టారంట్ ఓనర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో! ఒకవేళ గనుక హలీం అమ్మకాలు ఉండకపోతే... హైదరాబాద్ కే ప్రత్యేకమైన ఈ వంటకం దూరమై నగరం రంజాన్ శోభనే కోల్పోతుందనడంలో సందేహం లేదు.