Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ హానీమూన్ ముగిసినట్లేనా?: వేలెత్తిచూపుతున్న ప్రజలు

గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ మహమ్మారిని హ్యాండిల్ చేసే విషయంలో తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకి ఎక్కువవుతుంది. తాజాగా రోడ్డెక్కిన గాంధీ డాక్టర్లను చూస్తుంటే పరిస్థితి ఎంతలా చేయదాటిపోయేలా ఉందొ అర్థమవుతుంది. 

Corona Danger Bells In Telangana: KCR's 6 Years Honey Moon Period Now Comes Under Scanner
Author
Hyderabad, First Published Jun 11, 2020, 4:21 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్. మాటలమాంత్రికుడిగా, అపర చాణక్యుడిగా, ప్రతిపక్షాల పాలిట, ప్రత్యర్థులపాలిటి సింహస్వప్నంగా వెలుగొందేవారు. వ్యతిరేకత అనే పదమే ఆయన డిక్షనరీలో లేదు. 

కానీ గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ మహమ్మారిని హ్యాండిల్ చేసే విషయంలో తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకి ఎక్కువవుతుంది. తాజాగా రోడ్డెక్కిన గాంధీ డాక్టర్లను చూస్తుంటే పరిస్థితి ఎంతలా చేయదాటిపోయేలా ఉందొ అర్థమవుతుంది. 

జూనియర్ డాక్టర్ల సమ్మె మూడవ రోజుకి చేరుకుంది. నిన్న ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్ వచ్చి వారితోని చర్చలు జరిపినప్పటికీ అవి విజయవంతమవలేదు. వారు ఇంకా గాంధీ ఆసుపత్రి బయట రోడ్డుపైన విధులను బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. 

గత ఆరు సంవత్సరాలుగా 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చింది మొదలు కేసీఆర్ అప్రతిహతంగా పాలనను సాగిస్తూనే ఉన్నాడు. తిరుగులేని నేతగా వెలుగొందుతున్నాడు. ప్రతిపక్షం అనేది లేకుండా తన పాలనను సాగిస్తున్నాడు. ఒక రకంగా మీడియా కూడా కేసీఆర్ పాలనను పెద్దగా వ్యతిరేకించింది లేదు. 

24 గంటల విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు అన్నిటికన్నా ఎక్కువగా తెలంగాణ ఆత్మగౌరవం. అన్ని వెరసి ప్రజల్లో కూడా కేసీఆర్ పట్ల పెద్ద వ్యతిరేకత లేదు. గతంలో ఎన్నడూ చూడని ప్రాంతాల్లో సాగునీరు పారుతుండడం, ప్రాజెక్టులు సగంలో ఉండడం వెరసి కేసీఆర్ కి రెండవదఫా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 

అలాంటి కేసీఆర్ తొలిసారిగా ఇప్పుడు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దేశంలోని అన్ని మీడియా చానెళ్లు కూడా తెలంగాణాలో కరోనా వైరస్ టెస్టింగులను తెలంగాణాలో తక్కువగా చేస్తున్నారని వేలెత్తి చూపెడుతున్నాయి. 

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ నుండి మొదలు హై కోర్టు వరకు తెలంగాణ ప్రభుత్వాన్ని తలంటుతూనే ఉన్నాయి.  పక్కనున్న ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం కన్నా తక్కువగా ఉంటున్నాయి. 

ప్రజలు తమ పరిస్థితి ఏమిటో అని భయపడుతున్నారు. హైదరాబాద్ లో ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరుగుతుండడం, వాటితోపాటుగా మరణాలా సంఖ్య కూడా అధికంగా ఉండడం ప్రజల గుండెల్లో డేంజర్ బెల్స్ ని మోగిస్తున్నాయి. 

వీటికి తోడుగా కేసులు ఏకంగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందుల్లో కూడా పెరిగిపోతున్నాయి. వారు కూడా ఈ వైరస్ బారినపడుతుండడంతో ప్రజల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. వీటన్నిటికీ తోడు రోడ్డెక్కిన జూనియర్ డాక్టర్లు. 

కరోనాపై పోరులో తెలంగాణ ముందుందంటూ ఇన్ని రోజులపాటు చెప్పుకొచ్చిన కేసీఆర్ సారు, ఒక్కసారిగా ఈ సంఘటనతో ఉలిక్కిపడాల్సి వచ్చింది. జూనియర్ డాక్టర్లు తెలంగాణ ప్రభుత్వం కరోనా పై పోరులో వారు విఫలమైందని వారు బాహాటంగానే అంటున్నారు. 

తమకు కూడా టెస్టింగులు చేయడంలేదని, గాంధీలో వసతులు సరిగా లేవని, తాము కూడా వైరస్ బారిన పడుతున్నామని, పీపీఈ కిట్ల క్వాలిటీ సరిగా లేదని... ఇలా అనేక ప్రశ్నలను వారు సంధించారు. 

ఇన్ని రోజులు ఎవ్వరు తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని మాటాలన్నప్పటికీ... కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి తాము అన్నింటా ఫస్ట్ అంటే... ప్రజలు నమ్మారు. కేసీఆర్ ని ఎంతలా నమ్మారంటే... కరోనా కి కరెక్ట్ మొగుడు కేసీఆర్ అని సోషల్ మీడియాలో అనేంత. 

కానీ ఒక్కసారిగా కరోనా పై పోరాడే యోధులు డాక్టర్లే రోడ్డెక్కి ఇక్కడ పరిస్థితి సరిగా లేదు అని అంటుంటే... ప్రజలు సైతం ఇంతకుమునుపు ప్రభుత్వంపై సంధించిన అన్ని ప్రశ్నల గురించి వారు ఆలోచిస్తోస్తున్నారు. టెస్టులు తక్కువగా చేయడం దగ్గరి నుండి కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది అన్న విషయాల వరకు అన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. 

డాక్టర్ల నిరసనలు ఎంతలా సాగుతుంటున్నాయి అంటే... మీడియా వాటిని చూపెట్టలేకుండా కూడా ఉండలేకపోతుంది. చూడబోతుంటే... 6 సంవత్సరాల కేసీఆర్ హనీమూన్ పీరియడ్ ముగిసినట్టుగా కనబడుతుంది. ప్రస్తుతానికి సోషల్ మీడియా వరకే కనబడుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, సరైన హ్యాండ్లింగ్ లేకపోతే బాహాటంగానే వ్యక్తమయ్యే ఆస్కారం కూడా లేకపోలేదు.  

Follow Us:
Download App:
  • android
  • ios