రేవంత్ రెడ్డికి అధిష్ఠానం షాక్: కారణాలు ఇవీ...
కాంగ్రెసు అధిష్టానం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి అనూహ్యమైన షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై వెనక్కి తగ్గినట్లు సమాచారం.
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెసు అధిష్టానం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడమే తురావయి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.
రేవంత్ రెడ్డి దుకూడు పార్టీ కలిసి వస్తుందని భావించారు కానీ, కాంగ్రెసులోని సీనియర్ నాయకులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. తొలి నుంచి కాంగ్రెుసలోనే ఉంటున్న వి. హనుమంతరావు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు తెలంగాణ కాంగ్రెసు వ్యవహారల ఇంచార్జీ మాణికం ఠాగూర్ మీద కూడా ఆయన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డికి పీసీసి పదవి ఇస్తే తాను పార్టీలో ఉండబోనని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లను తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి అధిష్టానం పరిశీలించనట్లు, చివరకు రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. జనవరి మొదటివారంలో ఆయన పేరును ప్రకటిస్తారని కూడా భావించారు విహెచ్ తో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ నాయకులు పలువురు నిష్క్రియాపరులు కావడమో, పార్టీని వీడడమో జరుగుతుందని భావించి అధిష్టానం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
టీడీపీ ముద్ర కూడా రేవంత్ రెడ్డికి కలిసి రాలేదని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెసులో చేరారు. గత అసెంబ్లీ ఎన్నకిల్లో కొడంగల్ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తదనంతరం మల్కాజిగిరి నుంచి లోకసభకు పోటీ చేసి విజయం సాధించారు. కొద్ది కాలంలోనే రేవంత్ రెడ్డికి కాంగ్రెసులో మంచి గుర్తింపు వచ్చింది. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు.
దాంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో రేవంత్ రెడ్డిని పీసీసి ఆధ్యక్షుడిగా నియమించాలని అధిష్టానం ప్రయత్నించింది. అయితే, తెలంగాణ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. జీవన్ రెడ్డిని నియామకాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించే పరిస్థితి లేదు. వివాదరిహతుడు కావడం ఆయనకు కలిసి వచ్చినట్లు భావించవచ్చు. పైగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు.