Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లో అంతర్గత ఆధిపత్య పోరు.. ఖమ్మం భారీ సభ.. ఎవరిది పైచేయి?

టీ కాంగ్రెస్‌లో అంతర్గత ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఖమ్మం సభ నేపథ్యంలో భట్టి వర్గం, రేవంత్ రెడ్డి వర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నదని టాక్. కానీ, రాహుల్ టీం ఎంట్రీతో ఈ వర్గ పోరుకు తాత్కాలికంగానైనా బ్రేక్ పడిందని తెలుస్తున్నది. ఖమ్మం సభ భట్టి ముగింపు సభగానే ఉంటూ.. పొంగులేటి చేరికకూ ప్రాధాన్యత దక్కనుందని కాంగ్రెస్ చెప్పి వర్గపోరు దూకుడును చల్లార్చింది.
 

congress high command breaks telangana congress internal clashes ahead of khammam meeting kms-sir
Author
First Published Jun 30, 2023, 1:47 PM IST

తెలంగాణ కాంగ్రెస్ గత కొన్ని రోజుల్లోనే అనూహ్యంగా పుంజుకుంది. కర్ణాటకలో విజయం, బీజేపీ బలహీనపడటం, భట్టి పాదయాత్ర వంటి అంశాలు హస్తం పార్టీకి కలిసొచ్చాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో హైకమాండ్ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా టీ కాంగ్రెస్ నేతల్లో ఐక్యతపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరించాల్సిన వ్యూహాలకూ పదునుపెడుతున్నది.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సక్సెస్ పార్టీ హైకమాండ్ దృష్టిని ఆకర్షించింది. 109 రోజుల ఈ పాదయాత్ర ముగింపు వచ్చే నెల 2వ తేదీన జరగనుంది. ఇదే సభలో ఖమ్మంకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ సభను కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అనివార్యంగా టీ కాంగ్రెస్ నేతలంగా ఈ సభను అంతే ప్రాధాన్యతతో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది.

టీ కాంగ్రెస్ ఫలానా రోజు ఐక్యంగా ఉన్నదని చెప్పడం కష్టం. నేతల మధ్య విభేదాలు ఎప్పుడూ.. అదీ బహిరంగంగా కనిపిస్తూనే ఉన్నది. సీనియర్లకు, సీనియర్లే మధ్య విభేదాలు కొన్నిసార్లయితే.. సీనియర్లు, జూనియర్లు అంటూ.. సీనియర్లు, వలసదారులు అంటూ ఇలా అనేక విధాల అసంతృప్తి బాహాటంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే మొన్నటి స్ట్రాటజీ మీటింగ్‌లోనూ హైకమాండ్ గట్టిగా చెప్పినట్టు తెలిసింది. ఎన్నికల్లో గెలవాలంటే ముందు కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉండాలనేది ప్రాథమిక అవసరం అని నొక్కి చెప్పినట్టు సమాచారం. టీ కాంగ్రెస్‌లో ఇది ఆచరణ సాధ్యమా?

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డిపై హస్తం పార్టీ సీనియర్ నేతల్లో కొంత విముఖత ఉండింది. కానీ, రేవంత్ రెడ్డికే టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించడం చాలా మంది సీనియర్లకు మింగుడపడలేదు. పలుమార్లు సీనియర్లు వేరుగా సమావేశమై అసంతృప్తి రాగాలూ అందుకున్నారు. అయితే, ఈ విభేదాలు ఇంకా సమసిపోలేదని తెలుస్తున్నది. ఇప్పటికీ అంతర్గతంగా వర్గపోరు, ఆధిపత్య పోరు నడుస్తున్నది. 

పాదయాత్ర సక్సెస్ కావడంతో భట్టి, రేవంత్ రెడ్డిల మధ్య వర్గపోరు జోరందుకున్నట్టు తెలిసింది. రేవంత్ రెడ్డి పాదయాత్రలో భట్టి పాల్గొన్నారు గానీ, వందకు పైగా రోజుల భట్టి పాదయాత్రలో రేవంత్ రెడ్డి పాలుపంచుకోలేదు. ఖమ్మం సభలో భట్టిని సత్కరించాలని అధిష్టానం భావిస్తున్నది. దీంతో రేవంత్ రెడ్డి వర్గం.. ఖమ్మం సభ ద్వారా భట్టికే క్రెడిట్ అంతా పోకుండా అడ్డుకోవాలనుకుంది. అందుకే ఖమ్మం జిల్లాకే చెందిన పొంగులేటి చేరికను సభలో హైలైట్ చేయాని భావించింది. భట్టి, పొంగులేటి ఇద్దరూ ఖమ్మంకు చెందినవారే కావడంతో వారి మధ్య విభేదాలను వాడుకోవాలని రేవంత్ వర్గం అనుకున్నట్టు బోగట్టా.

కానీ, రాహుల్ గాంధీ టీమ్ ఖమ్మం సభపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, భట్టి పాదయాత్ర గురించి రాహుల్ ఆరా తీయడం, మాణిక్ రావ్ ఠాక్రే పొంగులేటిని రప్పించి మరీ భట్టితో ప్రత్యేకంగా భేటీ కావడం, జనగర్జన సభగా నామకరణం చేయడం రేవంత్ రెడ్డి వర్గం డైలమాలో పడింది. ఖమ్మం సభ భట్టి పాదయాత్ర ముగింపు సభగానే ఉంటుందని, అయితే, పొంగులేటి చేరికకూ ప్రాధాన్యత ఉంటుందని ఠాక్రే స్పష్టం చేయడంతో రేవంత్ రెడ్డి వర్గం రివర్స్ గేర్ వేసినట్టు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఖమ్మం సభ పర్యవేక్షణకు వెళ్లడం గమనార్హం. పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరుకు రాహుల్ గాంధీ టీమ్ స్వయంగా బ్రేకులు వేస్తున్నది. ఎవరిది పైచేయి.. ఎవరిది ఓటమి అనే విషయమే లేకుండా చేస్తున్నది. అంతిమంగా.. ఇక్కడి వ్యూహాలను, రాజకీయాలను రాహుల్ టీమ్ పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికైనా.. కనీసం ఎన్నికలవరకైనా ఐక్యంగా ఉన్నట్టుగానైనా టీ కాంగ్రెస్ నేతలు మసులుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios