దేశమంతా లాక్ డౌన్ గందరగోళం కొనసాగుతోంది. రెండవదఫా విధించిన లాక్ డౌన్ కూడా రేపటితో ముగుస్తుండడంతో(తెలంగాణాలో కాదనుకోండి)....కేంద్రం మరోమారు లాక్ డౌన్ ని రెండు వారాలపాటు పొడిగిస్తున్నట్టు చెప్పింది. 

దీన్ని లాక్ డౌన్ పొడిగింపు అనేకంటే... లాక్ డౌన్ సడలింపులు అనాలేమో! అందరూ అనుకున్నట్టే రెడ్ జోన్లలో కఠినంగా లాక్ డౌన్, గ్రీన్, ఆరెంజ్ జోన్లకు మినహాయింపులు. అన్ని కూడా ఇచ్చారు. రెడ్ జోన్లలో సైతం కొన్ని సేవలను ఓపెన్ చేసారు. బహుశా ప్రధాని చెప్పిన స్టాగర్డ్ ఎగ్జిట్ ఇదేనేమో!

ఇక ప్రభుత్వం నిన్న ఎక్కడెక్కడ ఏమేమి సడలింపులు అనే విషయంలో ఒక చాంతాడంత లిస్టును విడుదల చేసింది. ఆ లిస్టును కూడా ఒకేసారిగా కాకుండా, తాపకు కొంచం గా ఒక్కో  లిస్టును ఒక్కో ఫాంట్ లో విడుదల చేసింది. 

అవన్నీ చదివిన తరువాత అర్థమవడం పక్కనుంచితే.... కన్ఫ్యూషన్ ఎక్కువయింది. దేశంలో మరో వారంరోజులపాటు ఈ కన్ఫ్యూషన్ కొనసాగుతూనే ఉంటుంది. నిన్న రాత్రి మద్యం షాపుల విషయంలో తీవ్రమైన సందిగ్ధత నెలకొంది. 

గ్రీన్, ఆరంజ్ జోన్లతో పాటు రెడ్ జోన్లలో కూడా మద్యం షాపులను తెరిచే ఉంచుతారు, కానీ కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే బంద్ అని తొలుత అన్నారు. ఆ తరువాత గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే అని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేనంతవరకు ఈ సందిగ్ధత ఇలానే కొనసాగుతుంది. 

దేశమంతా ఈ లాక్ డౌన్ సడలింపుల సందిగ్ధత కొనసాగుతుంటే.... మన తెలంగాణ వాసులు మాత్రం ఎవరు ఎక్కడికి పోతే మాకెందుకు అన్నట్టుగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసినా పట్టించుకోలేదు. 

మనదగ్గర ఎలాగూ మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. కేసీఆర్ సర్, మే 5వ తారీఖున కేబినెట్ సమావేశాము తరువాతే నిర్ణయం అని అన్నారు. కేంద్రం ఎన్ని సడలింపులు ఇచ్చినా మన సర్ గనుక "థూ మీ బతుకులు జెడ, మందు కావాల్నా...?" అంటే ఖతం, ఇక మందు లేదు, సడలింపులు లేవు. 

అదే గనుక జరిగితే.... లాక్ డౌన్ మే 17 వరకు ఎటువంటి సడలింపులు లేకుండానే కొనసాగుతుంది. అంతా కూడా మన కేసీఆర్ సర్ చేతుల్లోనే. తెలంగాణ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దానిమీదనే తెలంగాణాలో లాక్ డౌన్ సడలింపులు ఆధారపడి ఉంటాయి. 

తెలంగాణ దాదాపుగా నెలకు 95 శాతం ఆదాయాన్ని కోల్పోతుంది. లాక్ డౌన్ కొనసాగబట్టి 42 రోజులవుతుంది. ముగిసేనాటికి 47 రోజులవుతుంది. రాష్ట్రాన్ని నడిపించడానికి అప్పుల మార్గంలోనే పయనిస్తోంది ప్రభుత్వం. కాబట్టి ఆదాయ మార్గాలను తెరిచే దిశగా కూడా అడుగులు వేసే ఆస్కారమే ఎక్కువగా కనబడుతుంది. 

కానీ ఇలా మద్యం షాపులను తెరిస్తే... కరోనా వైరస్ పెచ్చు మీరే ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం కేసీఆర్ ప్రజారోగ్యానికి మాత్రమే పెద్దపీటవేస్తారు. ఆ పరిస్థితుల్లో లాక్ డౌన్ ను మాత్రం కొనసాగించవచ్చు. 

దానికి తోడుగా రంజాన్ మాసం. బయట దుకాణాలను తెరిస్తే... ఉన్నపళంగా ప్రజలు షాపింగ్ అని బయటకు వస్తే... అది ఏ జోన్ అయినా కూడా ప్రమాదమే ఉంటుంది. ఇంత కఠినంగా లాక్ డౌన్ అమలవుతుంటేనే, చాలావరకు ప్రజలు స్వచ్చంధంగా ఇండ్లలో ఉంటేనే లాక్ డౌన్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. 

ఇక అనుమతులిస్తే... అంతమంది ప్రజలను కట్టడి చేయడం, లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటించేలా చేయడం, పోలీసులకు తలకు మించిన భారమే అవుతుంది. దానికితోడుగా ప్రజల్లో ఇన్ని రోజులుగా కట్టేశామన్న భావన కూడా నెలకొంది. ఇంకా కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. ఇవన్నీ వెరసి కరోనా మహమ్మారి మరల విజృంభించే ప్రమాదం కూడా లేకపోలేదు. 

కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 17తో ముగుస్తుంది. కేసీఆర్ విధించిన లాక్ డౌన్ మే 7వ తేదీతో ముగుస్తుంది. ఇంకొక్క పది రోజులే కదా, అప్పటికే కొంప మునిగిపోయేదేమీలేదు, మిగిలిన రాష్ట్రాల్లోని పరిస్థితులు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకొని అప్పుడు ముందుకు పోదము అనుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు!