తన తనయుడు, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బ్యాచ్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు షాక్ ఇచ్చారు. ఒక రకంగా కేటీఆర్ అనుయాయులకు ఆయన కళ్లెం వేశారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు. తానే పదేళ్లు సీఎంగా ఉంటానని ఆయన స్ఫష్టం చేశారు. 

గత నెల రోజులుగా కొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులు తదితరులు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతూ వస్తున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే మంత్రులకు, నాయకులకు ఆయన హెచ్చరికలు చేశారు. పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడేవారిపై చర్యలు తీసుకుంటానని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. 

కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ముహూర్తం ఖరారు చేస్తారని మీడియాలో వస్తున్న వార్తలకు ఆయనకు చెక్ పెట్టారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, తన ఆరోగ్యం సహకరించని రోజు తానే చెబుతానని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ప్రచారంపై గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ కఠినంగా మాట్లాడారు. 

ఎవరూ నోటికొచ్చినట్లు మాట్లాడవద్దని ఆయన అన్నారు. కేటీఆర్ ను సీఎంగా చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ప్రజల నాడిని, పార్టీ నాయకుల నాడిని, మంత్రుల నాడిని తెలుసుకోవడానికి కేసీఆర్ అటువంటి ప్రచారాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈటెల రాజేందర్ మాటలను ఆయన ఒక్కడి మాటలుగా కేసీఆర్ తీసుకోలేదని, మరి కొంత మంది కూడా అదే స్థితిలో ఉన్నారని కేసీఆర్ పసిగట్టినట్లు తెలుస్తోంది.

ఎవరిని సీఎం చేయాలనే విషయంపై మీ అందరితో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ చెప్పారు. తానే సీఎంగా ఉంటానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత కూడా అటువంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారంపై కాంగ్రెసు, బిజెపి నాయకులు కూడా స్పందించారు. మొత్తం మీద, కేటీఆర్ సిఎం అవుతారనే ప్రచారానికి ఆయన తెర దించారు.