Asianet News TeluguAsianet News Telugu

కవిత అడుగులు ఎటు వైపు.. తెరపైకి సరికొత్త సమీకరణాలు..కేసీఆర్ నిర్ణయాలతో మొదలైన చర్చ..!

తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కల్పకుంట్ల కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో.. కవిత రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్ ఎలాంటి ప్రణాళికలను రచిస్తున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

CM KCR Special focus on nizamabad creates discussion on mlc kavitha Political move
Author
First Published Dec 13, 2022, 11:36 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కల్పకుంట్ల కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తండ్రితో పాటే కలిసి నడిచిన కవిత.. తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి రాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోషించారు. 2014లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన కవిత.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ధర్మపురి అరవింత్ చేతిలో కవిత ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. కవిత ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఆమెను కేసీఆర్ తన కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆ దిశగా అడుగులు పడలేదు. 

అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో కవిత ప్రమేయం ఉందని బీజేపీ ఆరోపణలతో కొన్ని నెలలుగా ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. మరోవైపు తన కుమార్తె కవితను కూడా పార్టీ మారమని బీజేపీ నేతలు అడిగారని కేసీఆర్ చెప్పడం రాజకీయా వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ధర్మపురి అరవింద్ వర్సెస్ కవిత మధ్య మాటల యుద్దం సాగింది. ఈ సందర్భంగా అరవింద్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కవిత..  వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తావో చెయ్‌ వెంటపడి ఓడిస్తామని అంటూ కామెంట్ చేశారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అమిత్ అరోరా రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత పేరు ప్రస్తావన నేపథ్యంలో ఇటీవలే సీబీఐ అధికారులు ఆమెను సాక్షిగా విచారించడం కూడా జరిగింది. అయితే కవిత మాత్రం ఏజెన్సీల దాడులకు భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో కవిత భవిష్యత్‌లో ఏ విధంగా అడుగులు ముందుకు వేయనున్నారు?, వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ  చేయబోతున్నారనే అంశాలపై చర్చ సాగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే కవిత.. వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి బరిలో నిలుస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవల ఆమె చేస్తున్న  కామెంట్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

నిజామాబాద్‌లో అదనపు అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిజామాబాద్ అభివృద్దిపై ప్రత్యేక దృస్టి సారించారు. ఇటీవల ప్రగతి భవన్‌లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. నిజామాబాద్‌ నగరాన్ని రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అందమైన, చైతన్యవంతమైన నగరాల్లో ఒకటిగా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని.. రాబోయే రెండున్నర నెలల్లో నగరంలో జరుగుతున్న అన్ని మౌలిక సదుపాయాలు, సుందరీకరణ పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

అయితే నిజామాబాద్‌పై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేయడం వెనక రాజకీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవితను రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో గానీ, లేకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన నిజామాబాద్ ‌లోక్‌సభ నియోజవర్గం నుంచే బరిలో దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఒకవేళ కవితను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తే.. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏదో ఒక్క స్థానం నుంచే పోటీలో దించే అవకాశం ఉంది. బోధన్, ఆర్మూర్, జగిత్యాల‌, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానాన్ని ఎంపిక చేస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే కేసీఆర్ నిజామాబాద్ నగర అభివృద్దిపై దృష్టి సారించిన నేపథ్యంలో.. కవిత నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలే దిగుతారనే ప్రచారం మరింత జోరుగా సాగుతుంది. 

ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గణేష్ గుప్తా ఉన్నారు. అయితే రానున్న అసెంబ్లీలో సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వనున్నట్టుగా కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. కవితను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలపాలని అనుకుంటే.. గణేష్ గుప్తాను లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపే అవకాశం ఉందని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈసారి కవితను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకుని.. కేబినెట్‌లోకి తీసుకోవాలనే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ బాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 

అయితే మరి కవిత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి.. జాతీయస్థాయిలో బీఆర్ఎస్‌ విస్తరణ కీలక భూమిక పోషించేందుకు ఆసక్తి కనబరుస్తారా?, లేక ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అరవింద్‌ను వెంటపడి ఓడిస్తానని చెప్పిన కవిత.. ఈ సారి ఆయన పోటీ చేసే స్థానంలో నుంచే బరిలో దిగుతారా? అనే చర్చ కూడా రాజకీయాల్లో వర్గాల్లో సాగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios