ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంతలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు చేదయ్యారు. ఇంతకు ముందు ఎస్ఈసీని బలపరుస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్ల తన వైఖరిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)చీఫ్ నారా చంద్రబాబు నా.యుడు యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ నిర్వీర్యమైపోయిందని ఆయన విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించడంతో ఆయన తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు.
చంద్రబాబు సొంత శానససభ నియోజకవర్గం కుప్పంలో కూడా టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో విజయం సాధించడం ద్వారా టీడీపీ పరువు దక్కించుకుంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగాఉంటాయి. ఆ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన పోరాటానికి చంద్రబాబు పూర్తి మద్దతు ప్రకటించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడ్డు పడుతూ వచ్చింది. న్యాయస్థానాల తీర్పుతో ఎన్నికలు నిర్వహించడానికి చేసిన ప్రయత్నాలను కూడా ముందుకు సాగనివ్వలేదు. అధికారులు, ఉద్యోగులు సహాయ నిరాకరమణ పాటించారు. చీవరకు సుప్రీంకోర్టు తీర్పుతో వైఎస్ జగన్ ప్రభుత్వ దిగివచ్చి ఎన్నికలకు సహకరించడం ప్రారంభించింది.
తన పోరాట క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరినీ వదిలిపెట్టలేదు. తనకు సహకరించని అధికారులను కూడా సహించలేదు. నోటీసులు జారీ చేశారు. గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. కొంత మంది అధికారులను బదిలీ చేయించారు. జగన్ ప్రభుత్వం సహకరించడం ప్రారంభించిన తర్వాత కూడా పలు విషయాల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కడ కూడా తనను తాను తక్కువ చేసుకోలేదు. తన ఆదేశాలు అమలయ్యే విధంగా చూసుకున్నారు. ఒక రకంగా జగన్ ప్రభుత్వాన్ని శాసించారు. తద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేశారు.
నిజానికి, చంద్రబాబుకు అనుకూలంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని వైసీపీ విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. మంత్రులను కట్టడి చేయడానికి రమేష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇంత వరకు చంద్రబాబుకు బాగానే ఉండి ఉంటుంది.
నిజానికి, తాము విజయం సాధించలేమనే భయంతోనే వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డుపడుతున్నారనే తప్పుడు అవగాహనకు చంద్రబాబు వచ్చి ఉంటారు. దాంతో తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలను అందుకుంటామని కూడా అనుకుని ఉంటారు. కానీ, ఆయన తప్పుడు అంచనాతో ఉన్నారని, క్షేత్ర స్థాయి పరిశీలన చేయలేదని అర్థమవుతోంది. తీరా, ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఎన్నికల కమిషన్ నిర్వీర్యమైపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా, చంద్రబాబు తప్పుడు అంచనాల వల్లనే ఈ పరిస్థితి వచ్చింది తప్ప మరోటి కాదు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Feb 22, 2021, 6:48 PM IST