అమరావతి: బహుశా తన నిర్ణయంపై ఇంతగా వ్యతిరేకత ఎదురవుతుందని టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఊహించి ఉండరు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు ప్రకటించిన నిర్ణయంపై నిరసన సెగలు పెరుగుతున్నాయి. ఆయన నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. తీవ్రమైన అసంతృప్తిని బయటపెడుతున్నారు. 

చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జ్యోతుల నెహ్రూ తాజాగా మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు కేవలం తన నిర్ణయాన్ని మాత్రమే ప్రకటించారని, క్యాడర్ ను దృష్టిలో పెట్టుకోలేదని ఆయన అన్నారు. ఆ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లాలని మాత్రమే నిరస తెలిపినట్లు చెప్పారు. తమ అభిప్రాయాలను చెప్పకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.  

టీడీపీ తాడిపత్రి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన రీతిలో స్పందించారు. చంద్రబాబు నిర్ణయంతో వైసీపీ అభ్యర్థులు సంతోష పడుతున్నారని, పైసా ఖర్చు లేకుండా వారు గెలుస్తారని ఆయన అన్నారు. చంద్రబాబు నిర్ణయంతో కార్యకర్తల్లో నిరుత్సాహం చోటు చేసుకుందని ఆయన అన్నారు. అయినా కూడా ప్రతి ఒక్కరూ అధిష్టానం నిర్ణయాన్ని పాటించాల్సిందేనని అన్నారు. 

మరోవైపు కడప జిల్లా బద్వేలులో శిరీష తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. బరిలో నిలిచిన ఆమెకు అండగా కార్యకర్తలు కూడా వెంట వెళ్తున్నారు. విశాఖలో బండారు సత్యనారాయణమూర్తి తన వర్గంవారిని వెంట పెట్టుకుని ప్రచారం సాగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే విజయనగరం జిల్లాలో తమ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలపడానికే అశోక్ గజపతి రాజు నిర్ణయం తీసుకున్నారు పైగా ప్రచారం కూడా చేస్తున్నారు.

అంతకన్నా ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో టీడీపీ పోటీకి నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు కాదంటూనే అక్కడ టీడీపీ పోటీ చేస్తోంది. అలాగే కల్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కూడా తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

బహుశా, చంద్రబాబుకు ఇటువంటి వ్యతిరేకంగా గతంలో ఎప్పుడు కూడా ఎదురై ఉండదు. ఎన్నికలను బహిష్కరించాలంటూ చెప్పి పెద్ద తప్పే చేసినట్లు కనిపిస్తున్నారు. నిర్ణయాన్ని స్థానిక నాయకత్వాలకు వదిలేసి ఉంటే గౌరవంగా ఉండేదనే మాట వినిపిస్తోంది.