Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అమరావతి: సెల్ఫ్ ఫైనాన్స్‌ ప్రాజెక్టా లేక సెల్ఫ్‌ గోల్‌ ప్రాజెక్టా?

టీడీపీ చెబుతున్నట్టే సేకరించిన భూములను అమ్మి అమరావతి నిర్మాణానికి ఖర్చు పెట్టాలనుకున్నా వారి లెక్క ప్రకారం ఎకరా కోటి చొప్పున 10,000 ఎకరాలకూ 10,000 కోట్లు వస్తాయి. అంటే లక్ష కోట్ల అంచనా అందుకోవాలంటే ఎకరం కోటి చొప్పున అమ్మగలిగే ఖరీదైన భూములు ఎక్కడ నుంచి తేవాలి? 

Chandrababu Amaravati: Is it self finance project oe Self goal project?
Author
Amaravathi, First Published Dec 31, 2019, 12:28 PM IST

''అమరావతి నుంచి రాజధాని తరలించడమే సీఎం వైయస్ జగన్ లక్ష్యం''. ''అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తోంది''. ''రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అమరావతి నుంచే పుడతాయి'' ఇదీ నేటి టీడీపీ వాదన. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని గతంలోనే ప్రకటించారు చంద్రబాబు. మరోసారి అదే విషయాన్ని జగన్ ప్రభుత్వానికి చెబుతున్నానంటున్నారు. రాజధాని భూముల నుంచి 10,000 ఎకరాలు అమ్ముకున్నా లక్ష కోట్లు వచ్చేస్తాయని దాంతో బ్రహ్మాండమైన సింగపూర్, జపాన్‌ లాంటి రాజధానులు కట్టేయొచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఈ  సెల్ఫ్ ఫైనాన్స్‌ స్కీమ్ వెనకున్న మతలబు ఏంటి? చూద్దాం.

- రాజధాని కోసం రైతులనుంచి సేకరించిన 33,000 ఎకరాల్లో ఒక్క ఎకరం కూడా మిగలదని, అసలు చాలదని అన్నాడు చంద్రబాబు. రహదారులు, మౌలిక వసతులు, భవనాలు నిర్మించడానికి మరికొంత భూమి అవసరం అని చెప్పి ప్రభుత్వ భూమి మరో 23,000 ఎకరాలను రాజధాని అవసరాలకు తీసుకున్నాడు. మరి అలాంటప్పుడు 10,000 ఎకరాల భూమి అమ్ముకోడానికి ఎలా మిగులుతోంది? అసలు రాజధాని భూములను రియలెస్టేటుగా మార్చి అమ్ముతామని చంద్రబాబు ప్రజలకు చెప్పారా?

- రాజధాని నిర్మాణానికి మొత్తంగా 1,09,023 కోట్లు ఖర్చు అవుతుందని, తొలి దశలో మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, రైతుల ఫ్లాట్ల లేఅవుట్ల నిర్మాణానికి 52,837 కోట్లు ఖర్చు అవుతుందని CRDA అంచనా వేసింది. చంద్రబాబు కూడా రాజధాని అమరావతి కోసం 1,09,500 కోట్లు అవసరం అని కేంద్రానికి స్వయంగా లేఖ రాసాడు. రాజధాని నిర్మాణానికి ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుందని కూడా లెక్కలేసారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయినప్పుడు కేంద్రం నిధులు, అప్పుల అవసరం ఎందుకు పడింది? కేంద్రం నుంచి 1500 కోట్లు, బ్యాంకుల నుంచి రుణాల రూపంలో మరో 4000 కోట్లు ఎందుకు తీసుకున్నారు? 5500 కోట్లు అప్పెందుకు అయ్యింది? దీనికి టీడీపీ అధినేత దగ్గర సమాధానం ఉన్నట్టు లేదు.

- పోనీ ప్రాజెక్టు అభివృద్ధి చేసేందుకే అప్పులు తెచ్చారనుకుందాం. మరి 5500 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాతైనా మౌలిక వసతులు ఏర్పాడ్డాయా అంటే అదీ లేదు. ఐదేళ్ల కాలంలో కనీసం 500 ఎకరాల భూమిలో కూడా నిర్మాణాలు పూర్తి స్థాయి జరగలేదు. గత ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పిన సీడ్‌ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదు. 8,914.51 చ.కి. సీఆర్‌డీఎ పరిధిలో ఉంది. రైతులకిస్తామని చెప్పిన రెసిడెన్షియల్, కమర్షియల్‌ ఫ్లాట్లకు కనీసం దారి, విద్యుత్, వాటర్‌ కనెక్షన్ వంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదు.

- తుళ్లూరు చుట్టుపక్కల  ప్రాంతాలు కలిపి రాజధాని అంటూ 2014 డిసెంబర్‌లో ప్రకటన జరిగేనాటికి ఆ ప్రాంతంలో భూములు ఎకరా 24 లక్షలు ఖరీదు చేస్తున్నాయి. 2018 వచ్చేసరికి అమరావతి చుట్టు పక్కల రియలెస్టేట్‌ భూముల ధరలు ఆకాశాన్నంటాయి. చంద్రబాబు రాజధాని కోసం సేకరించిన 56000 ఎకరాలకు కనీసం సరైన రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయలేదు. కానీ ఊహాగానాలతో రియలెస్టేట్‌ ధరలను అమాంతంగా పెంచారు. బాబు ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్క కేంద్ర సంస్థకానీ, పరిశ్రమ కానీ అమరావతికి రాలేదు. వివిధ ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపులు చేసినా అవేవీ పనులు ప్రారంభించలేదు. కారణం ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడమే.

- పోనీ టీడీపీ చెబుతున్నట్టే సేకరించిన భూములను అమ్మి అమరావతి నిర్మాణానికి ఖర్చు పెట్టాలనుకున్నా వారి లెక్క ప్రకారం ఎకరా కోటి చొప్పున 10,000 ఎకరాలకూ 10,000 కోట్లు వస్తాయి. అంటే లక్ష కోట్ల అంచనా అందుకోవాలంటే ఎకరం కోటి చొప్పున అమ్మగలిగే ఖరీదైన భూములు ఎక్కడ నుంచి తేవాలి? నిజంగా కేపిటల్ గ్రామాల్లో భూములకు ఎకరం కోటి ధర పలుకుతోందా? పలికితే ఇన్నేళ్లుగా చంద్రబాబు వాటిని ఎందుకు అమ్మలేకపోయాడు? శంకుస్థాపన ఫలకం, 250 ఎకరాల్లో కట్టిన మూడు తాత్కాలిక భవనాలు చూసి కోట్లు పెట్టి భూములు కొనేస్తారా? ముమ్మాటికీ కొనరు. ఇది తెలుసు కనుకే ఇన్నేళ్లుగా బాబు ఆ పని సింగపూరుకు కంపెనీలకు అప్పజెప్పి చేతులు దులుపుకోవాలనుకున్నాడు. పక్కా కమర్షియల్‌గా అభివృద్ధి చెందిన మాదాపూర్ ప్రాంతంలో 2019లో గజం లక్షన్నర పలుకుతోంది.

అమీర్‌పేట, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతాల్లోనూ గజం 1లక్షరూపాయిలకు అటూ ఇటూగా ఉంటోంది. ఐటీ హబ్ అయిన బెంగుళూరు కంటే ఒక్క నిర్మాణమూ లేని అమరావతి ప్రాంతంలో రేట్లు ఆకాశాన్ని తాకడం విచిత్రం. రాజధానిలో గజం 60,000 నుంచి 1,50,000 పలుకుతుందని చెబుతున్నారు.  ప్రపంచ స్థాయి రాజధాని అయ్యిన తర్వాత ఉండే రేట్లను ఈ రోజూ చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టారు చంద్రబాబు. సింపుల్‌గా చెప్పాలంటే అరచేతిలో సింగపూర్‌ చూపించారు.

అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్ ప్రాజెక్టు కావాలంటే అది బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి మెట్రో సిటీ కావాలి. కానీ కాకముందే అది కోట్లెక్కి కూర్చుంది. గ్రాఫిక్‌లో రాజధాని కట్టినట్టే ఉంది ఈ అంకెలతో గారడీతో రాజధానికి లక్ష కోట్లు  సెల్ఫ్ ఫైనాన్స్‌ ద్వారా వస్తుందని చెప్పడం. భవిష్యత్తులో అంచనాలను ఇప్పుడే చూపించి భూముల ధరలైతే పెంచారు కానీ, ఆ స్థాయిలో రాజధాని నిర్మాణాలేమీ చేయలేకపోయారు. మాదాపూర్ భూములకున్నంత బూమ్ అమరావతి భూములకు రావాలంటే ఆస్థాయికి అమరావతి ఎప్పటికి చేరాలి? ఆకాశంలో మబ్బులు చూసి కుండలో నీళ్లు పారబోసుకున్నట్టైంది వ్యవహారం.

- బాబు చూపించిన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరగలేదు. రాజధాని ప్రాంతంలో గొప్ప నిర్మాణాలూ, సంస్థలూ లేవు. కానీ బాబు మాటలు నమ్మి, ఇక్కడేదో జరుగుతుందని అపోహపడి కోట్లు ఖర్చు పెట్టి రాజధాని చుట్టుపక్కల భూములు కొన్న రియల్టర్లు, ఇతరులు ఇప్పుడు నెత్తిపట్టుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios