Asianet News TeluguAsianet News Telugu

బైరెడ్డి రాజశేఖర రెడ్డికి వారసుడి సెగ: ఇదీ కథ

ప్రస్తుతానికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికొట్కూరు వైసీపీ ఇంఛార్జిగా ఉన్నాడు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కి సిద్ధార్థ్ రెడ్డికి పొసగడం లేదు. ఈ గొడవలతోపాటుగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుండడంతో అక్కడ పరిస్థితి టెన్షన్ గా మారింది. 

Byreddy Rajasekhar Reddy VS Scion Byreddy Siddarth Reddy: What's Brewing In Kurnool Politics
Author
Kurnool, First Published Jun 8, 2020, 3:30 PM IST

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న లీడర్. పెద్దనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజాకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన ఈ యువ నేత ఏమయిందో ఏమో కానీ పెదనాన్న వెంట ఉన్నట్టే ఉండి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. 

పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏమో టీడీపీలో సీనియర్ నేతగా వెలుగొందుతుండగానే.... రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసాడు.(ఆ సమయంలోనే సిద్ధార్థ్ రెడ్డిని తెరమీదకు తీసుకువచ్చాడు.) ఆతరువాత దాన్ని వదిలేసి కాంగ్రెస్ గూటికి చేరుకొని అక్కడ ఇమడలేక బీజేపీలో చేరారు. 

ఇకపోతే ప్రస్తుతానికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికొట్కూరు వైసీపీ ఇంఛార్జిగా ఉన్నాడు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కి సిద్ధార్థ్ రెడ్డికి పొసగడం లేదు. ఈ గొడవలతోపాటుగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుండడంతో అక్కడ పరిస్థితి టెన్షన్ గా మారింది. 

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సొంతూరు ముచ్చుమర్రిలో తాజాగా జరిగిన గొడవలను చూస్తుంటే... అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ తాజాగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గాల మధ్య జరిగిన ఘర్షణను చూస్తే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు. 

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన వివాదం... ఇప్పుడు వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకునే స్థాయికి చేరిపోయింది. స్థానిక ఎన్నికలు వాయిదాపడడం వల్ల అక్కడ పరిస్థితి సాధారణంగా బయటకు కనబడుతున్నప్పటికీ... వాస్తవానికి అది నివురుగప్పిన నిప్పులానే ఉంది. 

స్థానిక ఎన్నికల సందర్భంగా ముచ్చుమర్రిని ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని భావించాడు సిద్ధార్థ్ రెడ్డి. కానీ ఆ అవకాశాలకు గండి కొడుతూ... అక్కడే స్థానికంగా ఆరెంపీగా గ్రామంలో చిన్నపాటి వైద్య సేవలను అందిస్తున్న కరీంభాషాతో నామినేషన్ వేయించాడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. 

అనూహ్యంగా ఏకగ్రీవంగా గెలుస్తామన్న స్థానంలో పోటీ ఎదురవడంతో సిద్ధార్థ్ రెడ్డి వర్గానికి ఇది ఆగ్రహం తెప్పించింది. ఇక ఇంతలోనే మసీదు కమిటీ విషయంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గీయులు, సిద్ధార్థ్ రెడ్డి వర్గీయులు బాహాటంగానే పోట్లాడుకున్నారు. లాక్ డౌన్ కొనసాగుతుండగా ఆ ఊరిలో మాత్రం మినీ యుద్ధమే జరిగింది. 

ఇలా నామినేషన్ వేశారన్న కోపంతోనే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. స్థానికంగా పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ... పోలీసులు దాడిని నివారించలేకపోయారని, సున్నితమైన అంశం అనితెలిసినా పోలీసులు స్పందించలేదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారట. 

పనిలో పనిగా గతంలో ఆర్థర్ వర్గీయులపై కూడా జరిగిన దాడి విషయంలో పోలీసులు మిన్నకుండిపోయారని బైరెడ్డి రాశేఖర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లో చెప్పినట్టు సమాచారం. 

ఇకపోతే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాత్రం జరిగిన ఘర్షణకు తనకు సంబంధం లేదని అంటున్నారు. నందికొట్కూరు పరిధిలో ఏ ఒక్క అమాయకుడిపై చేయిపడ్డా తాను నేరుగా వారిపైన దాడికి దిగుతానని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు గనుక ఎన్నికల కమిషన్ తెరతీస్తే ఇక్కడ పరిస్థితులు ఎటువైపుకు దారితీస్తాయో వేచి చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios