పరిషత్ ఎన్నికల బహిష్కరణ: చంద్రబాబు నిర్ణయం మిస్ ఫైర్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలనే టీడీపీ చీఫ్ చంద్రబాబు నిర్ణయం మిస్ పైర్ అయినట్లు కనిపిస్తోంది. సొంత పార్టీ నుంచే చంద్రబాబుకు వ్యతిరేక ప్రతిస్పందనలు వస్తున్నాయి.

Boycott decission of Parisadh elections of TDP chief Chandrababu misfired

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నిర్ణయం మిస్ ఫైర్ అయినట్లు కనిపిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగలేదు కాబట్టి ఏ పార్టీ ఏ మేరకు విజయం సాధించిందనేది అంచనా వేయడం కష్టమే. అయితే, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోరమైన ఫలితాలను చవి చూసింది. 

మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ గెలుచుకుంది. అది కూడా పార్టీ బలంపై కాకుండా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెగువ మీద ఆధారపడి గెలిచింది. అది టీడీపీ బలమని అంచనా వేయడానికి వీలుకాదు. ఈ స్థితిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకుంది. ఇది టీడీపీ ఉమ్మడి నిర్ణయమని చెప్పడానికి వీలు కాదు. చంద్రబాబుకు పార్టీలో ఎదురు ఉండదు.

ఆ రెండు ఎన్నికల్లో ఓటమి పాలైన స్థితిలో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదనే అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో కొంత మంది నాయకులకు ఆ అభిప్రాయం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పోటీలో ఉండాలి కదా అని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. జ్యోతుల నెహ్రూ తన పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇంకా ఇటువంటి గొంతులు టీడీపీలో ఉండడానికి వీలుంది. 

బలవంతపు ఏకగ్రీవాలు చేశారనే కారణంతో, ఎన్నికలు స్వేచ్ఛగా జరగవనే కారణంతో చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని టీడీపీ మాత్రమే కాదు, జనసేన వంటి ఇతర పార్టీలు కూడా కోరుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియను రద్దు చేయాలని కోరుతున్నాయి. అయితే, ప్రక్రియను కొనసాగించాలని, కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని కొత్త ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని నిర్ణయం తీసుకున్నారు. 

సీఈసీ అలా చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. కుర్చీపై మోజులతో నీలం సాహ్ని ఆ పనిచేశారని వ్యాఖ్యానించారు. గతంలోని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వైసీపీ తప్పు పట్టినప్పుడు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదని కూడా వ్యాఖ్యానించారు. అదే చంద్రబాబు నీలం సాహ్నీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి వెనుకాడలేదు. 

అది అలా ఉంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా తెలివిగా వ్యవహరించారనే చెప్పాలి. వివాదంలోకి వెళ్లకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి తన హయాంలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించారు. తనకు తగిన సమయం ఉన్నప్పటికీ పరిషత్ ఎన్నికలను పక్కన పెట్టేశారు. అయితే, నీలం సాహ్ని పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత చేయాల్సిన పని చేస్తున్నారు.  వైసీపీ ప్రభుత్వం వద్దంటున్నా, కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలని సూచించినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కి తగ్గలేదు. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు నీలం సాహ్ని కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగకుండా ఎన్నికల ప్రక్రియను సాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.

అయితే, అది విడిగా చర్చించాల్సిన విషయమే గానీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే చంద్రబాబు నిర్ణయం టీడీపీని మరింతగా దెబ్బ తీసే అవకాశం ఉంది. వైసీపీ అక్రమాలకు, బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడినట్లయితే ఆ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రయోజనం ఉంటుంది గానీ వాటిని బహిష్కరించడం ద్వారా ఉండదు. గత రెండు ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు కాబట్టి ఎన్నికలను ఎదుర్కోలేక చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. 

చంద్రబాబు టీడీపీని ఎన్నికలకు దూరం చేయడం ద్వారా బిజెపి, జనసేన కూటమికి మంచి అవకాశం ఇచ్చారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ ఏర్పాటు చేసిన సమావేశాన్ని జనసేన బహిష్కరించింది.  అయితే, బిజెపి - జనసేన కూటమి పోటీ చేస్తుందా చూడాల్సి ఉంది. మొత్తం మీద, ఓటమి పాలైనా సరే, క్యాడర్ ను నిలబెట్టుకోవడానికి పోటీ చేయడం అవసరం. కానీ, క్యాడర్ ను నిష్క్రియాపరత్వంలోకి నెట్టడం సరి కాదు. ఏమైనా, చంద్రబాబు నిర్ణయం రాజకీయంగా అంత సమంజసమైంది కాదనేది మాత్రం చెప్పవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios