విశాఖపట్నం: తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు బిజెపి షాక్ ఇవ్వడానికి సిద్ధపడినట్లే కనిపిస్తోంది. ఆదివారం విశాఖపట్నంలోని బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో జరిగిన సమావేశం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తిరుపతి లోకసభ సీటును పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నారు. బిజెపి ఆ సీటులో తామే పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితిలోనూ తమ పార్టీ విజయం సాధించాలని, ఇందుకు పార్టీ శ్రేణులన్నీ అక్కడ పనిచేయాలని బిజెపి కోర్ కమిటీ నిర్ణయించింది. దీన్ని బట్టి జనసేనకు తిరుపతి సీటును బిజెపి కేటాయించబోదని స్పష్టమవుతోంది. 

ఆదివారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి మురళీధరన్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, సునీల్ దియోధర్, మరో జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి ఎన్నికల్లో ప్రతి మండలానికి ఓ బృందం పనిచేయానలి, కీలక వ్యక్తులకు నాయకత్వం బాధ్యతలు అప్పగించాలని, ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరూ అక్కడే ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. 

వచ్చే నెలలో తిరుపతిలోని కపిల తీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు రథయాత్ర చేయాలని, దీనికి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, పథకాలను సరిగా అమలు చేయడం లేనది, ప్రకటనలతో మభ్య పెడుతోందని భావించారు. ఆ విషయాలను బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.

రాష్ట్ర ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకోకుండా ఎదురు దాడికి దిగుతోందని, దాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని, ప్రజల్లోకి పార్టీ వాదనలను బలంగా తీసుకుని వెళ్లాలని నిర్ణయించారు.