సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్: బిజెపి వ్యూహం ఇదీ...
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బిజెపి ఏపీలో భారీ ప్రయోజానాన్నే ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ద్వారా రాష్ట్రంలో బలమైన శక్తిగా కూటమిని తయారు చేయాలనే ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది.
అమరావతి: తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను ప్రకటించడం వెనక బిజెపి పకడ్బందీ వ్యూహాన్నే రచించినట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ను బిజెపి అభ్యర్థిగా ప్రకటించడం వెనక బిజెపి తాత్కాలిక ప్రయోజనంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కూడా ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. తాత్కాలిక ప్రయోజనం తిరుపతి లోకసభ ఉప ఎన్నిక.
తిరుపతి లోకసభ సీటును జనసేన ఆశించింది. తమ పార్టీ కూటమి అభ్యర్థిగా నిలబెట్టాలని పవన్ కల్యాణ్ పట్టుబడుతూ వచ్చారు. అయితే, ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి రత్నప్రభను ముందుకు తెచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ అంగీకరించక తప్పలేదు. రత్నప్రభ అభ్యర్థిత్వానికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో జనసేన, బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ పడుతున్నారు.
తిరుపతి లోకసభ పరిధిలో కాపు సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉండడంతో పవన్ కల్యాణ్ మద్దతు మాత్రమే కాకుండా ఆయన ప్రచారం కూడా బిజెపికి అవసరమవుతోంది. పవన్ కల్యాణ్ రత్నప్రభ తరఫున తిరుపతి లోకసభ స్థానంలో ప్రచారం చేస్తారని అంటున్నారు. ఆయన ప్రచారం ఏదో మేరకు బిజెపి అభ్యర్థిగా ఉపయోగపడే అవకాశం ఉంది.
కాగా, దీర్ఘకాలిక ప్రయోజనం విషయానికి వస్తే, మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన ఓటు బ్యాంకు ఏమిటో చాలా వరకు తేలిపోయింది. తమ ఓటు బ్యాంకుకు పవన్ కల్యాణ్ ఓటు బ్యాంకును కలిపితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బలమైన శక్తిగా రూపొందవచ్చుననే ఆలోచనలో కూడా బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది.
ఆ విషయం అలా ఉంచితే, రాష్ట్రంలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. కాపు సామాజిక వర్గం అధికారం కోసం ప్రయత్నాలు సాగిస్తూ వస్తోంది. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం బలమైన శక్తే. దాంతో సోము వీర్రాజు ఏపీ బిజెపి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాపు సామాజిక వర్గం నేతలను కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వంటి నేతల మద్దతు కోసం ఆయన తీవ్రంగానే ప్రయత్నాలు సాగించారు.
వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, జనసేన కూటమి బలంగా తయారు కావడానికి పవన్ కల్యాణ్ పనికి వస్తారని బిజెపి భావిస్తోంది. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గం ఓట్ల పోలరైజేషన్ జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల వైసీపీ బలం తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తం మీద, పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపొందాలనే వూహాన్ని బిజెపి రచించినట్లు కనిపిస్తోంది.