ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు విషయంలో వివాదం రాజుకున్నది లగాయతు.... ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. రాజకీయ పార్టీలు ఇదే అదనుగా జల రాజకీయాన్ని మొదలుపెట్టాయి. 

ఇరు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నది ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ సమస్యల ఆధారంగా రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలు. ప్రాంతీయ సమస్యలు ఇరు రాష్ట్రాల్లోనూ రాజకీయాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. ఈ విషయం ఎవరికీ తెలియనిది కాదు.  

పోతిరెడ్డిపాడు అంశాన్ని ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోని పార్టీలు తమకు అనుకూలంగా వాడుకొని పొలిటికల్ మైలేజి సాధించాలని తహతహలాడుతున్నాయి. రాజకీయ పార్టీల సహజ లక్షణమే రాజకీయం చేయడం. అందులో వింతేముంది అని అనిపించొచ్చు. కానీ ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను చూస్తుంటే మాత్రం విడ్డూరం అనిపించక మానదు. 

"రాయలసీమకు నీరందించడానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తీసుకోకూడదని, శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉందని తాము ఎప్పటినుండో చెబుతున్నామని అన్నారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని కన్నా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను నివృత్తి చేసి ఒప్పించో, న్యాయ పోరాటం చేసో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కన్నా సూచించారు." 

ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమకు మాత్రం వెనక్కి తగ్గకుండా నీళ్ళు ఇవ్వాల్సిందే అని కన్నా డిమాండ్ చేశారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని గతంలో బీజేపీ పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. అందుకోసం ఉపయోగపడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలని... అందుకు తమ సహకారం వుంటుందని కన్నా అన్నారు."

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైఖరి ఇలా ఉంటె.... అదే పార్టీ తెలంగాణ అధ్యక్షుడి వాదం పూర్తి వ్యతిరేకంగా ఉంది.  పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని అడ్డుకోకపోవడం కేసీఆర్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో కారణంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని బీజేపీ నేతలు అబిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణకు నష్టం కల్గించేలా వ్యవహరిస్తున్నా కూడ తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే... పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ప్రారంభమైతే తెలంగాణ సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.పోతిరెడ్డిపాడుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం నాడు ఇవాళ దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపారు.

ఏపీ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కు టీఆర్ఎస్ ఫండింగ్ ఏర్పాటు చేసిందన్నారు. అప్పటి నుండి కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని విస్తరిస్తే తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్టేనని చెప్పారు. కేసీఆర్ అసమర్ధత వల్లో, నిర్లక్ష్యం వల్లో ఇంకా ఏ కారణం వల్లో ఏపీ ప్రభుత్వం ఈ విస్తరణ పనులను ప్రారంభించేందుకు సిద్దంగా ఉందని ఆయన ఆరోపించారు. జగన్ తో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా ఈ పనులు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చిందో తెలియదని ఆయన ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విభాగం దీనికి ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇంతవరకు వారివైపు నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ ప్రకటన వచ్చిన మరుక్షణం ఇది ఖచ్చితంగా ఇలాగే ఉండబోతుంది. 

నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రాలు, అందునా విడిపోయే ముందు తీవ్రమైన ఘర్షణలు, సంఘర్షణల నడుమ విభజన జరిగింది. ఆ గాయాలు ఇంకా పూర్తిగా మానకముందే.... ఇప్పుడు ఇలా ప్రాంతీయ వైషమ్యాలను మరలా రెచ్చగొట్టడం ఏ రాజకీయ పార్టీకి కూడా తగదు. 

ఈ సమయంలో వీలైతే సంయమనంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పాలి కానీ... ఇలాంటి రాజకీయాలు ప్రమాదకరం. అయినా "ఎవిరీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్  టర్మ్స్ అఫ్ లవ్, వార్ అండ్ పాలిటిక్స్"