తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి ఉప ఎన్నిక అత్యంత కీలకం కాబోతోంది. తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లో బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భుజం మీద కాడి పెట్టి బిజెపి తమ అభ్యర్థి భవిష్యత్తును తేల్చాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. తమ బలంపై, తమ వ్యూహంపై కన్నా బిజెపి పవన్ కల్యాణ్ జనాకర్షణ మీదనే ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ మీద బిజెపి నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏకంగా తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటించి తిరుపతి ఉప ఎన్నికలో ఆయన సేవలను వాడుకోవాలనే నిర్ణయానికి బలంగా వచ్చినట్లు కనిపిస్తున్నారు. బిజెపి నాయకులను సంతృప్తి పరచడానికే అన్నట్లు పవన్ కల్యాణ్ తిరుపతిలో పాదయాత్ర కూడా చేశారు. ముఖ్యమంత్రి అయితే తాను అందరికన్నా బాగా పనిచేస్తానని ఆయన చెప్పారు.

తిరుపతి లోకసభ సీటును వాస్తవానికి జనసేన ఆశించింది. ప్రజారాజ్యం పార్టీ కాలంలో తిరుపతి నుంచి చిరంజీవి విజయం సాధించడం, కాపు సామాజిక వర్గం ఓట్లు ఆ నియోజకవర్గంలో చెప్పుకోదగిన స్థాయిలో ఉండడం దానికి కారణం. అందుకే పవన్ కల్యాణ్ అండదండలు పూర్తి స్థాయిలో ఉంటే తిరుపతిలో సత్తా చాటవచ్చుననే అభిప్రాయంతో బిజెపి నేతలు ఉన్నట్లు కనిపిస్తున్నారు.

అందుకే పవన్ కల్యాణ్ ను బిజెపి నేతలు నెత్తికెత్తుకుంటున్నారు. పవన్ కల్యాణ్ అధిపతి అని బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటిస్తే, తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణే అని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. తిరుపతి లోకసభ ఉప ఎన్నిక ప్రచారంలో బిజెపి నేతలు పవన్ కల్యాణ్ ను ప్రశంసించడమే పనిగా పెట్టుకున్నారు.

పవన్ కల్యాణ్ నిజమైన జాతీయ నేత అని బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సునీల్ దియోధర్ అన్నారు. ఆ మాటను ఆయన పదే పదే అంటూ వచ్చారు. జనసేన కార్యకర్తలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించేందుకు బిజెపి నేతలు ఆ పని చేస్తున్నారని అనుకోవచ్చు. టికెట్ ఆశించి భంగపడిన జనసేన కార్యకర్తలు కాస్తా నిరుత్సాహంతో ఉన్నారు. పవన్ కల్యాణ్ ను ప్రశంసించడం ద్వారా, పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపే పనిని పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు.

తిరుపతి అభ్యర్థి రత్నప్రభ కూడా పవన్ కల్యాణ్ ను ఆకాశానికెత్తారు. తనను తమ్ముడు పవన్ కల్యాణ్ గెలిపిస్తాడని ఆమె ప్రచారంలో చెప్పారు. అయితే, తిరుపతిలో గెలిచే సత్తా బిజెపికి ఉందా అంటే దానికి అవునని కరాఖండిగా సమాధానం చెప్పడానికి వీలు కాదు. కానీ, రెండో స్థానంలో వచ్చినా బిజెపి లక్ష్యం నెరవేరినట్లే. 

వైసీపీకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న టీడీపీని వెనక్కి నెడితే చాలా వరకు బిజెపి లక్ష్యం నెరవేరినట్లే. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సోము వీర్రాజు ట్వీట్స్ చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు తీసుకున్న యూటర్న్ ను ఆయన ట్విట్టర్ లో ప్రస్తావించారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి చంద్రబాబుపై గతంలో చేసిన వ్యాఖ్యలు అంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే, తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, వీడియోను మార్ఫింగ్ చేశారని పనబాక లక్ష్మి స్పష్టం చేశారు.

ఏమైనా, బిజెపి తక్షణ లక్ష్యం చంద్రబాబును వెనక్కి నెట్టి కనీసం రెండో స్థానంలోనైనా నిలబడాలనేది కావచ్చు. అయితే, తిరుపతిలో విజయం సాధిస్తే మాత్రం పవన్ కల్యాణ్ మరో ఎత్తుకు ఎదిగినట్లే.