బోయపాటి సినిమా తర్వాత తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని నందమూరి హీరో బాలకృష్ణ చేసిన ప్రకటన టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. కోటం శ్రీనివాసులు రెడ్డి అనే నేతకు ఫోన్ చేసి ఆయన ఆ విషయం చెప్పారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోందనే చర్చ సాగుతోంది. బాలకృష్ణ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏం ఏర్పడిందనే ప్రశ్న ఉదయిస్తోంది.

బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతూనే సినిమాల్లో నటిస్తున్నారు. చెప్పాలంటే, ఆయన ఎక్కువ సమయం సినిమాలకే వెచ్చిస్తున్నారు. అయితే, తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఆయన ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు. బాలకృష్ణ అవసరం వచ్చినప్పుడు రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పటికీ ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారని చెప్పవచ్చు.

తాజాగా ఆయన ప్రకటన చూస్తుంటే, రాష్ట్రవ్యాప్తంగా ఆయన రాజకీయాలు నడిపేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో టీడీపీ వ్యవహారాలు చూస్తూ కార్యాచరణ చేపడుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎదుర్కోవడంలో వారి కృషి సరిపోవడం లేదని బాలకృష్ణ భావిస్తున్నారా, అందుకే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.

ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను నిలువరించడంలో చంద్రబాబు పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నారనే అభిప్రాయం కూడా పార్టీలో ఉంది. నిజానికి, టీడీపీ పగ్గాలను చంద్రబాబు నారా లోకేష్ కు అప్పగించాలని అనుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ఉంటే బహుశా అది జరిగిపోయి ఉండేది. కానీ, ఈ పరిస్థితిలో టీడీపీని నారా లోకేష్ నడిపించలేరనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ స్థితిలో మరోసారి ఎన్టీఆర్ వారసత్వం పార్టీకి అవసరమనే అభిప్రాయం తలెత్తినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి, టీడీపీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తే అది భర్తీ అవుతుందని అనుకుంటున్నారు. దీంతో బాలకృష్ణ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని సమాచారం.