బద్వేలు ఉప ఎన్నిక: పవన్ కల్యాణ్ తో విభేదాలు, బిజెపి వ్యూహం ఇదీ...
బద్వెలు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయంతో బిజెపి తీవ్రంగా విభేదిస్తోంది. దీంతో బద్వెల్ లో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని నిర్ణయం తీసుకుంది.
బద్వేలు శానససభ ఉప ఎన్నిక (Badvel bypoll)ల్లో పోటీకి దిగాలని ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకత్వం నిర్ణయం తీసుకుంది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య దాసరి సుధ పోటీ చేస్తున్నందు వల్ల ఆమెపై గౌరవంతో బద్వెల్ లో పోటీ చేయడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాసరి సుధపై పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుని బద్వెల్ పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కూడా తప్పుకుంది. దీంతో దాసరి సుధను ఏకగ్రీవం చేయాలని జనసేన, టీడీపీ భావించాయి.
బద్వెల్ లో పోటీ చేయకూడదనే మిత్రపక్షం జనసేనతో బిజెపి తీవ్రంగా విభేదించి తమ అభ్యర్థిని పోటీకి దించాలని బిజెపి నిర్ణయం తీసుకుంది. దీంతో బద్వెలులో పోటీ అనివార్యంగా మారే స్థితి వచ్చింది. మిత్రపక్షం జనసేన నిర్ణయంతో నిమిత్తం లేకుండా తాము ఒంటరిగా పోటీ చేయాలని బిజెపి నిర్ణయం తీసుకుంది.
బద్వెల్ ఉప ఎన్నికలో పోటీ చేయాలా, వద్దా అనే విషయంపైనే కాకుండా ఎవరిని పోటీకి దించాలనే విషయంపై కూడా బిజెపి నేతలు ఆదివారంనాడు కడపలో సమావేశమై చర్చించారు పోటీకి దిగాలని చర్చల తర్వాత ప్రకటించారు. నియోజకవర్గంలోని 7 పంచాయతీలకు ఎన్నికల ఇంచార్జీలను నియమించి ప్రచారం సాగించాలని బిజెపి నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కరపత్రాల ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో పరిస్థితిపై కూడా ప్రజలతు తెలియజేయాలని బిజెపి నిర్ణయించింది. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై, ప్రభుత్వం చేసిన అప్పులపై, తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై నియోజకవర్గంలో ప్రచారం చేయాలని నిర్ణయించింది.
కాగా, బద్వెల్ నుంచి పోటీకి దించే అభ్యర్తుల పేర్లను కూడా పరిశీలించింది. మాజీ ఎమ్మెల్యే జయరాములు పేరుతో పాటు 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి పేరును కూడా బిజెపి పరిశీలించింది. కాగా, అట్లూరు మండలానికి చెందిన మాజీ సర్పంచ్ నరసింహులు, ప్రభుత్వ రిటైర్డ్ వైద్యుడు రాజశేఖర్ పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో వీరిద్దరి పేర్లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
నలుగురి పేర్లతో బిజెపి రాష్ట్ర నాయకత్వం ఓ జాబితాను అధిష్టానానికి పంపించింది. జయరాములు గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉందని, ఆయనను పోటీకి దించితే మంచి ఫలితం వస్తుందని కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత కందుల అభిప్రాయడడ్డారు. గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో విజయజ్యోతిపై సానుభూతి ఉంటుందని మరో నేత అన్నట్లు తెలుస్తోంది. ఆమె అభ్యర్థిత్వాన్ని సీఎం రమేష్ బలపరిచారు.