Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ తో చేతులు కలిపిన రేవంత్: పద్మావతి జాతకం మారుతుందా...

తెరాస గెలుపు నల్లేరు మీద నడక అనుకున్న వారంతా ఇప్పుడు ఉత్తమ్ స్ట్రాటెజిని చూసి ఔరా అంటున్నారు. రాజకీయ వ్యూహాలు రచించడంలో కెసిఆర్ కు ఎదురులేదు అంటారంతా. కానీ అలంటి కెసిఆర్ వ్యూహాన్నీ కూడా తుత్తనీయలు  చేస్తూ ఉత్తమ్ దూసుకుపోతుండడం రాజకీయంగా గొప్ప విషయమే.  

arch rivals join hands: revanth to campaign in huzurnagar today
Author
Hyderabad, First Published Oct 18, 2019, 1:41 PM IST

హుజూర్ నగర్ ఉపఎన్నికకు నగారా మోగడంతోటే తెలంగాణాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.  అన్ని ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో రాష్ట్ర అగ్ర రాజకీయనేతలంతా హుజూర్ నగర్ లో తిష్ఠ  వేశారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేసేందుకు ఎత్తులు వాటికి పైఎత్తులు వేయడంలో తలమునకలైయున్నారు. 

కాంగ్రెస్ ఎలాగైనా తన సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని పట్టుదలగా ఉంటే, ఎలాగైనా కాంగ్రెస్ ని వారి సొంత సీట్లోనే ఓడించి విమర్శకుల నోర్లు మూయించాలని తెరాస సర్కార్ భావిస్తోంది. మరోపక్క తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం మేమే అని నిరూపించుకోవడానికి ఇక్కడ ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. 

అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్ లో మొదలైన వివాదం చూసినవారందరికీ కాంగ్రెస్ పార్టీ విభేదాలే వారిని ఓడించనున్నాయి అనే అనుమానం కలిగింది. ఉత్తమ్ ఏకపక్షంగా తన శ్రీమతి పేరును ఎలా ప్రకటిస్తారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బాహాటంగా పత్రికా ముఖంగా విమర్శించారు. అక్కడితో ఊరుకోకుండా తాను కూడా మరో అభ్యర్థి పేరును ప్రకటించాడు. 

ఒక్కసారిగా ఈ ప్రకటన చేయడంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మిగిలిన సీనియర్ కాంగ్రెస్ నేతలు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే ముందు రేవంత్ ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలవడంతో, పీసీసీ అద్యక్షుడిగా రేవంత్ రెడ్డి కి లైన్ క్లియర్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి.

ఈ విషయమై అలెర్ట్ అయిన సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఒక్కటయ్యారు. ఈ సీనియర్ నేతల ఢిల్లీ ట్రిప్పులు సాగుతున్న వేళనే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన తరువాత అభ్యర్థి ప్రకటన అంశంలో కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు ఓపెన్ గానే బయటకొచ్చాయి. 

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల మాధ్య ఉండే విభేదాలేంటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడదు అనేది బహిరంగ రహస్యం. వారిరువురి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. 2014ఎన్నికల్లో సూర్యాపేట వద్ద ఉత్తమ్ కు చెందిన ఒక వాహనంలో దాదాపుగా 3కోట్ల రూపాయలు కాలిపోయినప్పుడు, ఆ డబ్బును కోమటి రెడ్డి ప్రత్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డికి ఉత్తమ్ పంపుతున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. 

ఇలాంటి వైరాన్ని కూడా చెరిపేయడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సఫలీకృతుడయ్యానడంలో నో డౌట్. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా కోమటి రెడ్డి క్యాడర్ ఉత్తమ్ కు పూర్తి సహాయం చేయలేదనేది అక్కడి కాంగ్రెస్ నేతల మాట. కానీ ఉప ఎన్నికలో మాత్రం ఉత్తమ్ కోమటిరెడ్డిని కలుపుకుపోగలిగాడు. పద్మావతి నామినేషన్ వేసే రోజు ర్యాలీగా కోమటి రెడ్డి కూడా వచ్చాడు. 

ప్రచారంలో కలియతిరుగుతూ రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. జానా రెడ్డి కూడా ఉన్న వైరాన్ని పక్కకు పెట్టి హుజూర్ నగర్ ప్రచారంలో చెమటోడ్చుతున్నాడు. తన బంధు వర్గాన్ని వెంటేసుకొని ఊరూరూ తిరుగుతున్నాడు. ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి కలిసారా, లేదా ఐక్యమత్యమే మహాబలం అని నమ్మారో కానీ కోమటి రెడ్డిని, జానా రెడ్డిని తన వైపుగా తిప్పుకోవడంలో ఉత్తమ్ సఫలీకృతుడయ్యాడు. 

ఉత్తమ్ బద్ద శత్రువైన రేవంత్ రెడ్డిని కూడా హుజూర్ నగర్ కు రప్పించడంలో ఉత్తమ్ విజయవంతం అయ్యాడు. నేడు హుజూర్ నగర్ లో రేవంత్ ప్రచారం చేయనున్నాడు. ఇలా ఒకానొక స్టేజి లో కాంగ్రెస్ నిట్టనిలువునా చీలుతుందేమో అనే అనుమానం నుంచి ఇప్పుడు అందరినీ ఒక్కతాటిపైకి తేవడంలో  ఉత్తమ్ పూర్తిగా సఫలీకృతుడు అయ్యాడు. 

తెరాస గెలుపు నల్లేరు మీద నడక అనుకున్న వారంతా ఇప్పుడు ఉత్తమ్ స్ట్రాటెజిని చూసి ఔరా అంటున్నారు. రాజకీయ వ్యూహాలు రచించడంలో కెసిఆర్ కు ఎదురులేదు అంటారంతా. కానీ అలంటి కెసిఆర్ వ్యూహాన్నీ కూడా తుత్తనీయలు  చేస్తూ ఉత్తమ్ దూసుకుపోతుండడం రాజకీయంగా గొప్ప విషయమే.  

తన భార్యకు టికెట్ తెచ్చుకోవడం దగ్గర నుంచి మొదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను ఒక బలమైన, తెలివైన రాజకీయ నాయకుడినని నిరూపించుకుంటూనే ఉన్నాడు. కెసిఆర్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఉద్యమసమయంలో కెసిఆర్ ఎలాగైతే తన శత్రువులను కూడా తనతో కలిపి నడిపించగలిగాడో ఇప్పుడు ఉత్తమ్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. 

50వేల మెజారిటీ అని తొలుత బీరాలు పలికిన తెరాస ఇప్పుడు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. అందివచ్చిన ఆర్టీసీ సమ్మె ను విజయవంతంగా తనకు అనుకూలంగా మార్చుకొని తెరాస శిబిరంలో ప్రకంపనలు సృష్టించడంలో మాత్రం ఉత్తమ్ సక్సెస్ అని చెప్పక తప్పదు.

Follow Us:
Download App:
  • android
  • ios