ఏపీ దిక్సూచి: వికేంద్రీకరణ ప్రభావశీలి కేసీయార్
కేసీయార్ గమ్యం గమనం కేవలం రాష్ట్ర ఏర్పాటు. దానికి తోడు మన రాజధాని ఐన హైదరాబాద్ ను పదిలంగా కాపాడుకోవడం. ఇవి రెండూ సఫలం అయ్యాయి అంటున్నారు సీనియర్ జర్నలిస్టు కందుకూరి రమేష్ బాబు. మరి ఆ తర్వాత...
ఆంధ్రప్రదేశ్ కు స్వీయ అస్తిత్వం లేదు. అక్కడి రాజకీయాలన్నీ తెలంగాణ ప్రభావానికి గురై సాగాయి, నేటి రాజధానుల నిర్ణయంతో సహా. కేసీయార్ అందుకు ప్రభావశీలి కావడం యాదృచ్చికం కాదు. అది జాగురూకతతో తీసుకున్న నిర్ణయం. అందుకే అనడం, కేసీయార్ కనిపించని కేంద్రకం అని. వికేంద్రీకరణకు మార్గదర్శి అనీ...
తెలుగు ప్రజల జీవితాలకు సంబంధించి నిన్నటి రోజు మరో చారిత్రిక దినం. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం అనంతరం తిరిగి అంతటి సంచలన నిర్ణయానికి మూలమైన రోజు. నిన్న జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తున్నట్లు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం నిజంగానే ఒక ప్రభావశీలమైన నిర్ణయం. వికేంద్రీకరణకు దిక్సూచి. విశేషం ఏమిటంటే, ఎవరు అంగీకరించకపోయినా ఇందుకు ఇరుసుగా ఉన్నది, బహిర్గతంగా కానరానిది శ్రీ కేసీయార్. ఆయనే అందుకు ప్రభావశీలి.
కేసీయార్ గమ్యం గమనం కేవలం రాష్ట్ర ఏర్పాటు. దానికి తోడు మన రాజధాని ఐన హైదరాబాద్ ను పదిలంగా కాపాడుకోవడం. ఇవి రెండూ సఫలం అయ్యాయి. ఐతే, రాష్ట్ర ఏర్పాటు అనంతరం మరి పదేళ్ళు ఉమ్మడి రాజధాని ఐన హైదరాబాద్ ను సీమాంధ్రులకు ఆయుధం కాకుండా చేసిన దీర్ఘదర్శి కేసీయార్. వారు నెరిపిన రాజకీయ చతురత ఫలితమే, ఒకటి కాదు, మూడు రాజధానులకు మూలమైన నేటి వికేంద్రీకరణకు మార్గం అనాలి. జగన్ మనుగడకు ఇది అనివార్య ఆయుధం కావడం వేరే విషయమైనా మొదటిసారిగా స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాకి బీజం వేసింది కూడా ఒకరకంగా కేసీయారే అనాలి.
సీమాంధ్రులకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఎంతమాత్రం ఉపయోగపడకుండా ఒక రాజకీయ వ్యూయాని రచించి, ఇక్కడినుంచి శాశ్వతంగా వారి అధికార కేంద్రాన్నిఎత్తి అవతల పారేయడంలో కేసీయార్ చూపిన సాహసోపేత రాజకీయ పరినీతికి నేడు జోహార్లు చెప్పక తప్పదు. అక్కడి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ప్రవేశపెట్టిన బిల్లు ఇక తెలంగాణ రాష్ట్రంతో వారు సంపూర్ణంగా దూరం జరగడానికి బలమైన పునాది అనే భావించవలసి ఉన్నది. ఆ రకంగా ఇరు రాష్ట్రాల తమ మానాన తాము పరిపాలనలో నిమగ్నం కావడానికి, రాష్ట్ర విభజన గురించి అనవసరంగా మాట్లాడి ఇంకా కాలాన్ని దుర్వినియోగం చేయవలసిన అగత్యం ఇక ఎంత మాత్రంలేని తరుణంగా కూడా దీన్ని చూడాలి.
కేసీయార్ గురించి భయటకు తెలిసినవే చెప్పుకుంటే, నోటుకు ఓటు కేసులో చంద్రబాబు నాయుడిని ముప్పుతిప్పలు పెట్టి, ఇక్కడినుంచి మూటా ముల్లె సర్దుకుని పరిగెత్తేలా చేయడం ఒక ముఖ్యమైన ఎత్తు.
పదేళ్ళ వ్యవధి ఉన్నాకూడా బాబు తమ కంటూ ఒక విజన్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోకుండా తక్షణం మౌలిక వసతుల పేరిట కోట్లాది రూపాయల వ్యయంతో రాజధాని ఒక్కటే మార్గం చేసుకుని, అందులో తమ స్వార్థం ప్రయోజనాలు ఎన్ని ఉన్నా కూడా - రాజధాని నిర్మాణమే తమ పరిపాలనలో ప్రథమ ఎజెండాగా అయ్యేట్టు చేయడంలో కేసీయార్ వ్యూహం ఫలించిందనే అనాలి. బాబు తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి రాజధానే కేంద్రం అయ్యిందీ అంటే అది కూడా కేసీయార్ చనిఖ్యమే. చంద్రబాబు కుల బలగాన్ని, అతడి సామాజిక వెన్నుదన్నును, మొత్తంగా వారి ఆర్థిక పునాదిని బద్దలు చేయడానికి రాజధాని వికేంద్రీకరణే శరణ్యంగా జగన్ నడుం కట్టేలా చేయగలిగిన పరోక్ష కారకం కేసీయారే. ఫలితంగా స్వతంత్ర రాష్ట్రంగా తెలంగాణ లేచి నిలబడ వడివడిగా పరిపాలనలో మున్ముందుకు సాగుతుండగా ఇంకా మెడకు చుట్టుకున్న రాష్ట్రానికి తాడూ బొంగరమూ లేదన్న విషయమే ఇంకా ప్రాధాన్యం వహించిందీ అంటే కేసీయార్ బలమే అనుకోవాలి.
చిత్రమేమిటంటే, కేసీయార్ పుణ్యాన తెలంగాణాలో తెలుగుదేశం లేకుండా పోవడం ఒక్కటే జరగలేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ద్వితీయం అవడం, ప్రస్తుతం జగన్ అమరావతి కేంద్రాన్ని బలహీనం చేయడం అది కేవలం వట్టి ‘మాట’గా మారిపోయింది. అలాగే మొత్తం ప్రాదేశిక మార్పులకు లోనవుతున్న తరుణంలో ఇక ‘ఆంధ్రప్రదేశ్’ అన్నా కూడా అది ఒక అభాస.
ఫలితంగా ఆంద్రుల అస్తిత్వం, ఆత్మగౌరవం అన్నది నేడు సంక్షోభంలో కూరుకుపోయింది. అందుకు వారి స్వయంకృతం ఒక కారణం అనుకుంటే, దాన్ని సానుకూలంగా వినియోగించి రాజకీయంగానే కాదు, సాంస్కృతికంగా కూడా ఎంతో ఉన్నతమైన తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ మరెన్నడూ సరితూగాకుండా చేసిన కార్యధారి శ్రీ కేసేయార్ అనాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల అచంచలమైన విశ్వాసంతో సుదీర్ఘ రాజకీయ కార్యక్రమాన్ని అమలు చేసి, అందులో సంపూర్ణంగా సఫలమైన కేసీయార్ పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించడం లోతుగా విశేలించుకోవలసే ఉంది. ఆ ధోరణి తనకు ఉద్యమం నుంచే ఉన్నది. అయన రెండంచుల కత్తి వలే పనిచేశారని ఎన్ని ఉదాహరనలతో నైనా చెప్పవచ్చు. తనకు సరితూగే నాయకుడు లేకుండా చూసుకోవడంతో పాటు, రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలో కూడా తన మాట చెల్లు బాటు అయ్యే విధంగా రాజకీయాలు చేయడం అన్నది గమనిస్తే కనిపించే వాస్తవమే. జగన్ పట్ల ఉదార వైఖరితో ఉన్నట్టు కానవస్తుంది గానీ, అతడి ప్రభుత్వానికి గౌరవ సలహాదారులుగా ఉన్నది కేసీయారే అంటే అతిశయోక్తి కాదు. శాసనసభలో బిల్లు పెట్టె కొన్ని రోజుల ముందు వారిద్దరి ఏకాంత సమావేశం గురించి జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు.
కాగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజన అనివార్యమైతే ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఏమిటో కనీసమైన యోచన గలవారు, అవశ్యమైన దూరదృష్టిగల అవతలి పక్ష్యం అన్నదే లేదు. దాంతో అక్కడి రాజకీయ శూన్యతను పూర్తిగా అవగతం చేసుకున్న కేసీయార్ చాలా నిశితంగా బాబును కట్టడి చేయడానికి నడుం కట్టారు. ఉద్యమ సహచరులు, అంతెందుకు తెలంగాణ ప్రజల వ్యతిరేకతను కూడా కాదని తలసాని కృష్ణ యాదవ్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి వారిదాకా, తెలంగాణలోని తెలుగుదేశం నాయకులను తమ పార్టీలో చేర్చుకొని ఆ పార్టీని వేర్లుతో సహా త్రెంపి వేశారు. ఇలాంటి అవసరాల కోసమే అయన ఉద్యమ పార్టీని ఫక్తు రాజ్జకీయ పార్టీగా మార్చిన విషయం కూడా కాదనలేం.
ఐతే, ఆంధ్రప్రదేశ్ భవితవ్యం గురించి కేసీయార్ అంచనా వేసినట్టు మరోకరు అంచనా వేయలేదు. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని సమస్య తొలినుంచి ప్రాధాన్యం అయ్యేలా చేయడం. అంతేకాదు, ఒక నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అసంభవం అనుకున్న ఆంధ్రులంతా నేడు అనివార్యమైన వికేంద్రీకరణ మంత్రంలో కూరుకుపోయి తమ రాజకీయ మనుగడ కోసం సతమతం కావలసి వస్తున్నదీ అంటే, ఎవరి ప్రయోజనాలేమిటో వెతుక్కోవలసి వస్తున్నదీ అంటే అది కేసీయార్ నాయకత్వం వచించి నెరిపిన రాకకీయమే అని అర్థం చేసుకోవచ్చు.
మరో సంగతి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అదుపులో పెట్టుకోవడానికి, ప్రజల విశ్వాసాన్ని పొందడానికి తాను ఒక్క రాజధాని అంటే సరిపోదని నవరత్నాల పథకం అమలు చేయడంతో పాటు, అనివార్యంగా తెలంగాణ విధానాలను అవలంభించక తప్పలేదు. పెర్లేమైనా ఇక్కడి మాదిరే అనేక సంక్షేమ పథకాలను అనుసరించవలసి వస్తున్నది. చెప్పాలంటే, మరింత దూకుడుతో వ్యవహరించవలసి వస్తున్నది. అలాగే- పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన కూడా చేయడం కూడా మరో ముక్యాంశం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా మార్చే నిర్ణయం తీసుకోవడం అన్నది ఈ పరిణామ క్రమంలో అంతమం అని చెప్పాలి.
దీంతో కేసీఆర్ పూర్తిగా అదృశ్యం చేసిన ‘తెలుగుదేశం’ అన్న భావన తిరిగి లేవకుండా కునారిల్లడం ఒకటైతే, ‘ఆంధ్రప్రదేశ్’ అన్న భావన అర్థం లేనిదిగా మారడం కూడా జరిగింది. ఇక, ఇప్పటికైనా రాష్ట్ర పునర్నిర్మాణం జరగవలసి ఉన్నది.
విచిత్రం ఏమిటంటే, ముందు విశ్లేషించినట్లు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ తెలంగాణ ప్రభావానికి గురై సాగాయి. కేసీయార్ అందులో ప్రభావశీలి కావడం యాదృచ్చికం కాదు. అది జాగురూకతతో తీసుకున్న నిర్ణయం. అందువల్ల తెలంగాణకు ఆంధ్రుల పీడ వదిలింది. ఆంధ్రప్రదేశ్ కు తన అసలైన సమస్యలేమిటో గుర్తుకొచ్చాయి. అందుకే అనడం, ఇప్పుడు జరిగే పునర్నిర్మాణంతో సహా తాను కనిపించని కేంద్రకం అని. నిజంగానే ఇదొక వైచిత్రి. తెలంగాణతో పెట్టుకున్నందుకు జరిగిన కవితా న్యాయం. అందువల్లే, మనలో మనకు ఎన్ని విమర్శలున్నా కేసీయార్ రాజకీయ చేతనకు సవాల్ లేదు. అయన వికేంద్రీకరణ మార్గదర్శి. అభినందనలు కేసీయార్.
- కందుకూరి రమేష్ బాబు
ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఫొటోగ్రాఫర్