ఏపీలో రంగుల "పంచాయితీ": వెనక్కి తగ్గిన జగన్ ప్రభుత్వం, కారణమిదే...
ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేయడంపై హై కోర్టు తీవ్రంగా అభ్యంతరం చెప్పడం, ఆ తరువాత వాటిని తొలిగించమని ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతే కాకుండా ఆ రంగులను మార్చేంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించకుండా కోర్టు ఆదేశాలను ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేయడంపై హై కోర్టు తీవ్రంగా అభ్యంతరం చెప్పడం, ఆ తరువాత వాటిని తొలిగించమని ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతే కాకుండా ఆ రంగులను మార్చేంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించకుండా కోర్టు ఆదేశాలను ఇచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వేసిన పార్టీ రంగులు తొలగించేందుకు మూడు నెలల సమయం కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చుతూ మూడు నెలల గడువు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కేవలం మూడు వారల సమయాన్ని మాత్రమే ఇచ్చింది.
ఇలా ఈ భవనాలకు పార్టీ రంగులు వేయడానికి దాదాపుగా 1400 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైకోర్టు తన తీర్పులో భవనాలకు పార్టీ రంగులను తీసేసి, ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేని రంగులు వేయమని చెప్పింది.
ఇలా చెప్పినప్పటికీ కూడా వైసీపీ వారు ఒక నూతన థియరీని తెరమీదకు తెచ్చారు. వారు తాజాగా రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులనే వేశారు. కాకపోతే చిన్న ట్విస్టు ఇచ్చి రైతు భరోసా కేంద్ర భవనం కింద భాగాన ఒక రకమైన ఎర్ర మట్టి (టెర్రా కోట ) రంగును వేశారు. దానిపైన గ్రామీణ నేపథ్యం ఉట్టిపడే బొమ్మలను పెయింటింగులుగా వేశారు.
మిగితా రంగులన్నీ కూడా వైసీపీ పార్టీ రంగులు అలానే యథాతథంగా ఉన్నాయి. పార్టీ రంగులను మార్చలేదేందుకు అనే ప్రశ్నకు వైసీపీ వారు సరికొత్త రీతిలో ఒక తెలివైన సమాధానం చెబుతున్నారు.
కింద ఉన్న మట్టి రంగు పంటలను పండించే భూమికి చిహ్నమని, మిగిలిన రంగులకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వారంటున్నారు. నీలం రంగు నీలి విప్లవానికి(చేపల ఉత్పత్తికి సంబంధించింది), ఆకుపచ్చ రంగు హరిత విప్లవానికి (పంటల పెంపకానికి సంబంధించినది), తెలుపు రంగు క్షీర విప్లవానికి (పాల ఉత్పత్తికి) చిహ్నాలని వారు చెప్పారు.
దీనిపై హై కోర్టు తీవ్రంగా స్పందించి అధికారులపై కోర్టు ధిక్కరణ కేసును కూడా నమోదు చేసి వారిని విచారణకు హాజరు కమ్మన్న విషయం తెలిసిందే. నేడు ఆ కేసు మరోమారు విచారణకు రానున్న విషయం తెలిసిందే.
అందుతున్న సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం రంగులను మార్చేయడానికి ఒప్పుకోనున్నట్టు తెలియవస్తుంది. వాస్తవానికి ఈ విషయంలో సుప్రీమ్ కోర్టు తలుపు తడదామని అనుకున్నప్పటికీ.... ఆ విషయంలో ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గనున్నట్టు తెలియవస్తుంది. అందుకు అనేక కారణాలు కనబడుతున్నాయి.
మొదటగా ఈ మార్చిన రంగులను ఆధారంగా చేసుకొని సుప్రీమ్ లో వాదించేంత మెరిట్ ఈ కేసులో కనబడడం లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈ మధ్యే సుప్రీమ్ తలుపు తట్టినా వారికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది.
తీర్పు వ్యతిరేకంగా రావడం అటుంచితే అది ప్రతిపక్షాల చేతికి అస్త్రంగా మారుతుంది. అంతే కాకుండా, రంగులను మార్చేంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించొద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు సుప్రీమ్ లో కేసు దాఖలు చేసి అది తేలేంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేకులు పడ్డట్టే.
కాబట్టి అందుకోసమని ఇంకా ఆలస్యం అవకుండా, హై కోర్టులో ఆ రంగులను మారుస్తామని ఒప్పుకుంటే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలియవస్తుంది. ఇప్పటికే రంగులు వేయడానికి దాదాపుగా 1400 కోట్ల ఖర్చు పెట్టారు. ఇప్పుడు మరల అవన్నీ కనబడకుండా సున్నం వేయాలన్నా కూడా బోలెడంత ఖర్చు!