Asianet News TeluguAsianet News Telugu

జగన్ పాలనలో.... ప్రాంతం, ప్రభుత్వం, ప్రజలు – మీడియా

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఇటీవలి సమావేశంలో మీడియా పని తీరు మీద నియంత్రణ వ్యవస్థ అవసరం అని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో ‘మీడియా’ రాతల మీద సంబంధిత శాఖల కార్యదర్శుల నియంత్రణ పరిధి అవసరం అనుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం

AP CM YS Jagan Mohan Reddy government News Media Strategy
Author
Hyderabad, First Published Oct 25, 2019, 3:19 PM IST

-జాన్ సన్ చోరగుడి

మన వద్ద ‘ఒపీనియన్ మేకర్స్’ నిన్న మొన్నటి విషయాల్ని కూడా అది కనుమరుగైన చరిత్ర అనుకొని, వాటిపై తమకు నచ్చినట్టు వార్తావ్యాఖ్యలు చేయడం ఇప్పటి సరికొత్త మీడియా ‘ట్రెండ్’ అయ్యి కూర్చుంది. ప్రధాన మీడియాలో అందుకు వారికి చోటు దొరకనప్పుడు, ‘సోషల్ మీడియా’ ను వారు అందుకు యధేచ్చగా వాడుతున్నారు. పౌరులు అంటే, మనకు ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన వోటర్లు. వాళ్ళు గత పాతికేళ్ళుగా చరిత్ర ఇతర సామాజిక శాస్త్రాలు చదవకుండానే, కుటుంబాలతో తల్లి తండ్రులు కూడా అవుతున్నారు. కనుక, వారికి ఈ ‘ఒపీనియన్ మేకర్స్’ చెబుతున్నదే, నిన్న-నేడు-రేపుగా మారింది. ఎం.బి.ఏ. మాదిరిగా ఒక కోర్సు లేదు గాని, గడచిన పాతికేళ్ళలో మీడియా ‘మేనేజ్ మెంట్’ కూడా కొన్ని ప్రభుత్వాల్లో ఒక ‘కరిక్యులం’ అయింది.

ఇటువంటి ధోరణి అక్కడ ఆగితే బాగుండేది. మనకి అదీ చాల్లేదు. ‘సర్ఫ్’ ‘కోల్గేట్’ వంటి గిరాకీ ఉన్న బ్రాండ్స్ ‘మీ పేస్ట్ లో ఉప్పు ఉందా...’ అంటూ ఏదో ఒక కొత్త ‘యాడ్ కాపీ’ తో ప్రచార ప్రపంచంలో నిత్యం “విజువల్” అవుతున్నట్టే, కొన్ని పార్టీల నాయకులు కూడా మంచికో చెడుకో మనం “విజువల్” అయితే చాలు అన్నట్టున్నారు. ఇందులో ఉన్నది ప్రజా సంబంధాలు కాదు. మార్కెట్లో కనిపిస్తేనే గిరాకీ, అనే ఫక్తు ‘షేర్ మార్కెట్ ఫిలాసఫీ’. అస్సలు వారి రాజకీయ ఉనికే ఇటువంటి ప్రాతిపదికతో మొదలు అయినప్పుడు, మంచికా చెడుకా అనే తేడా లేకుండా, ‘మీడియా’ తోనే వీరి దినచర్య ఉంటుంది. చివరికి ఇదొక ‘స్కూల్’ గా స్థిరపడ్డాక, ఈ ‘నమూనా’ లో కాకుండా కూడా ప్రభుత్వాలు ఉంటాయని ‘మీడియా’ కూడా నమ్మలేని పరిస్థితి వచ్చేసింది.

ఇప్పుడీ ప్రస్తావన, ఎవరెవరి మంచి చెడులు ఏమిటి అనే పంచాయతీ కోసం కాదు. ప్రజా జీవితంలో ఉన్నవారు తమ ఉనికి సమస్య కాకుండా ఇటువంటి కృత్రిమ మార్గాల్ని ఎంచుకున్నప్పుడు, రేపు వారు రాజకీయ వేదిక నుంచి నిష్క్రమించాక, వారు వదిలి వెళ్ళిన మార్గాల్లో వెనుక వచ్చేవారికి మున్ముందు మిగిలే నష్టాలను ఇప్పటి నుంచే గుర్తించడం ఇప్పటి మన అవసరం. ఆ మార్గంలో ముళ్ళు ఉన్నప్పుడు వాటిని ఏరి తీసివేయకపోతే, నడక కష్టం అవుతుంది, లేదా ఆ దారి మూసుకుపోతుంది. 

AP CM YS Jagan Mohan Reddy government News Media Strategy

 

ఈ దృష్టితో చూసినప్పుడు మొదటిది – ప్రాంతం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అని మొదట్లో ఎక్కువమంది నమ్మారు. అయితే, అప్పడు జరిగింది అనుకున్న నష్టం కంటే, గత ఐదేళ్ళలో ఏ.పి. కి జరిగింది తీవ్రమైన హాని. వెనక్కి చూస్తే - ఒక్కటి కాదు వరస పరిణామాలు అన్నీ అటువంటివే... తెలుగు రాష్ట్రాలని విభజించిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో కొనసాగలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగు అయింది. విభజన కావాలన్న తెలంగాణ ముచ్చట మాత్రం తీరింది. 

అయితే, అధికారం కోల్పోయిన యు,పి.ఏ. ఆంధ్రప్రదేశ్ అవసరాల్ని ముందు చూపుతోనే అంచనా వేసింది. పదేళ్ళు ఉమ్మడి రాజధాని అంది, ఇద్దరికీ ఒక్కడే గవర్నర్ అంది. మన దేశం ‘ఆసియాన్’ ఒప్పందంలో చేరి ఆగ్నేయ ఆసియా దేశాలతో కోస్తాంధ్ర ద్వారా దేశ వాణిజ్య అవసరాలు పెంచాలి అనుకుంది. అయితే, 2015 చివరి నాటికే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఏర్పాటుకు బీటలు పడ్డాయి. ఏడాది మించి అది కొనసాగలేదు. రాజకీయ కారణాలతో అంతా తారుమారు అయింది. సచివాలయం, శాఖాధికారుల కార్యాలయాల సిబ్బంది, హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం బెజవాడ - శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఇలా ఎందుకు తిరగాలో వారికే తెలియకుండానే అప్పుడే ఐదేళ్ళు అయిపోయాయి. ఇటువంటి వాతావరణంలో ఉద్యోగులు చేసే పని నాణ్యత గురించి ఇంక మనం మాట్లాడడానికి ఏముంది. 

AP CM YS Jagan Mohan Reddy government News Media Strategy

 

‘నువ్వొకందుకు – నేనొకందుకు’ అన్నట్టుగా సాగిన కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మైత్రి, కనీసం ప్రకాశం జిల్లాలో రాబోయే కొత్త పోర్టు ఎక్కడ? అనేది కూడా తేల్చకుండానే ముగిసింది. ఇల్లు చక్కబెట్టుకోవడం ఇక్కడ తలకు మించిన భారంగా ఉండగా, ‘పోలవరం’ వీళ్ళు ఎందుకు అడిగినట్టు, వాళ్ళు ఎందుకు ఇచ్చినట్టు, అనే ప్రశ్నలకు మనకు జవాబులు దొరకవు. గడచిన ఐదేళ్ళలో రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ అంశం చూసే కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో కేంద్ర-రాష్ట్ర అంశాల విభాగం, కేంద్ర అర్బన్ ప్లానింగ్ శాఖతో కలిసి ఏ.పి. రాజధాని అంశం గురించి ఒక్కసారి కూడా ఇక్కడ సమీక్ష జరపలేదు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఎవరిని బలహీనపర్చే చర్యలు ఇవి? అయితే గతానికి భిన్నంగా మొదటిసారి 2019 జూన్ లో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ లో ‘అవుట్ రీచ్ సమ్మిట్’ పేరుతో 35 దేశాల రాయబారులతో సదస్సు పెట్టి కొత్త కేంద్ర-రాష్ట్ర సంబంధాల సాంప్రదాయాన్ని ప్రారంభించారు. 

రెండవది – ప్రభుత్వం. ఇది మొదటి అంశమైన ప్రాంతంతో అనుబంధమైన అంశం. విభజన చట్టం ప్రకారం 2014 నుండి 2024 వరకు ఏ.పి. సచివాలయం హైదరాబాద్ లో ఉండేది. ఆర్ధిక సంస్కరణల ఆరంభ కాలంలో ’90 దశకంలో వాటి అమలుకు అప్పట్లో సచివాలయంలో ‘ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్’ ఉన్నట్టుగానే, ఈ పదేళ్ళు బెజవాడలో ఒక ఏర్పాటు ఉండి వుంటే, మొదట రాజధాని స్థల మార్పిడి కారణంగా ఏర్పడ్డ సమస్యలు అధికార యంత్రాంగానికి ఉండేవి కాదు. రాష్ట్ర రాజధాని నగరంగా హైదరాబాద్ అరవై ఏళ్ల అనుభవాన్ని మరో పదేళ్ళు ఏ.పి. వాడుకునేది. 

AP CM YS Jagan Mohan Reddy government News Media Strategy

 

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణా సంస్థ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్, పోలీస్ అకాడమీ, ఇంకా ఎన్నో సంయుక్త ఆంధ్రప్రదేశ్ లోని శిక్షణా పరిశోధనా సంస్థల సేవలు ఇంకా ఎన్నో మౌలిక వసతులు ఏ.పి. ప్రభుత్వానికి అందుబాటులో ఉండేవి. అలాగే ఇప్పడు విభజన జరిగాక ఆరో ఏట ఏ.పి. ప్రభుత్వం తలపెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు మొదటి ఐదేళ్ళల్లోనే చేసివుంటే, 2024 నాటికి అవి స్థిర పడేవి దారిన పడేవి. కొత్త రాజధానిలో భవనాలు సిద్దమవుతున్న దశలో అంచెలు అంచెలుగా శాఖాధిపతుల కార్యాలయాలు తరలింపు, ఉద్యోగుల తరలింపు జరిగేది. ఈ మొత్తం ప్రక్రియలో అక్కడే స్థానికంగా అందుబాటులో వుండే గవర్నర్ కార్యాలయం ద్వారా విభజన చట్టంలో పంపకాలు అంశాలు మృదువుగా జరిగి ఉండేవి.

ఇవేమీ జరగకపోగా రాజధాని అర్ధంతర తరలింపు తర్వాత ప్రభుత్వంలో ఏమి జరుతుందో ఎవరికీ తెలియని ‘అస్పష్టత – అలజడి’ ఒక సరికొత్త ప్రభుత్వ పర్యావరణంగా మారింది. యుద్ద కాలంలో కూడా పాక్షికంగానే అయినా రక్షణ శాఖ అధికారిక సమాచారం పత్రికలకు విడుదల చేస్తారు. కానీ ఈ కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటో సమాచార మాధ్యమాలకు సరే, అధికారులకు కూడా తెలిసేది కాదు. ఈ వ్యాఖ్యకు ప్రాతిపదికగా గంట గంటకు అధికారిక ఆదేశాలు మారిన ఒక సంఘటన గుర్తు చేసుకుందాం... అది 2015 సంక్రాంతికి ముందు రోజు (12.01.2015) ఆ రోజు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందాన్ని తుళ్ళూరు తీసుకెళ్ళి ఆ ప్రాంతం వారికి చూపించాలి. 

హైదరాబాద్ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి సి.బి.ఎన్. క్రిందికి వచ్చి మరీ స్వాగతం పలికి ఆ బృందంతో అక్కణ్ణించి వైజాగ్, అక్కడ పెట్టుబడులు సదస్సు. ఒంటి గంటకు గన్నవరం రావాలి, అక్కణ్ణించి రాజధాని ప్రాంత ఏరియల్ సర్వే... లేదు ఏరియల్ సర్వే కాదు... కరకట్ట మీదుగా  తుళ్ళూరు మినీ బస్సుల్లో వెళ్తారు... తుళ్ళూరు ప్రజలతో సి.ఎం ఈశ్వరన్ తో కలిసి ముచ్చటిస్తారు... గుంటూరు కలెక్టర్ మినీ బస్సులతో మంతెన ప్రకృతి ఆస్పత్రి వద్ద ఉండాలి... లేదు, దుర్గ గుడి కొండ మీది నుంచి బైనాక్యులర్స్ తో రాజధాని ప్రాంతం సి.ఎం గారు సింగపూర్ బృందానికి చూపిస్తారు... అందుకూ ఏర్పాట్లు చేసారు. చివరికి సాయంత్రం 3- 4 మధ్య సి.ఎం. గన్నవరం చేరుకొని, అక్కడ కనిపెడుతున్న వాళ్ళను ఈశ్వరన్ బృందానికి పరిచయం చేసాక, నేరుగా తిరుపతి ప్రయాణం. మర్నాడు కుప్పంలో కుటుంబంతో సంక్రాంతి. 

AP CM YS Jagan Mohan Reddy government News Media Strategy

 

మరో సంఘటన చెబితే, పైది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. రాజమండ్రిలో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో మొదటి రోజు విషాదం తర్వాత, ప్రభుత్వం గమ్మున దేవాదాయ శాఖకు స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులకు మిగతా రోజుల్లో జరగాల్సినవి అప్పగించి సి.ఎం. కార్యాలయం అక్కణ్ణించి ఇవతలకు రావాలి. కానీ పోగొట్టుకున్న చోటే పోయిన దాన్ని దొరకపుచ్చుకోవాలి అన్నట్టు చేసింది టి.డి.పి. ప్రభుత్వం. సింగపూర్ ఈశ్వరన్ బృందం రాజమండ్రిలో ఓ స్టార్ హోటల్ లో అమరావతి రాజధాని ప్లాన్ ముఖ్యమంత్రికి అందచేస్తారు అన్నారు. అంతే మరో ‘ఈవెంట్’, మళ్ళీ అందుకు అధికారుల ఏర్పాట్లు. ఎటువంటి స్పృహలేని నిర్ణయాలు ఇవి. 

ఎంతటి గరుకు చర్మపు ఆలోచనలు ఆచరణ నిర్వాహణ ఇది?! ఇలా గడచిన ఐదేళ్లూ ఇటువంటి పరిస్థితుల్లో పని చేయడానికి ‘సిద్దపడే’ అధికారులు ఇక్కడ ప్రభుత్వాలకు అవసరం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాల్సిన ప్రభుత్వం ‘నవ నిర్మాణ దీక్ష’ పేరుతో జరిపిన అధికారిక సభా వేదికపై ముఖ్యమంత్రి ఐ.ఏ.ఎస్. అధికారులు మంత్రులతో చేయించిన ప్రతిజ్ఞ “కుట్రతో ....” అనే పదంతో మొదలయ్యేది! ఏ.పి. అధికారిక ‘లోగో’ క్రింద ఆ రోజు పత్రికల్లో ఆ ప్రతిజ్ఞ ప్రకటనగా విడుదల చేసేవారు. కేంద్ర సర్వీస్ అధికారులు భారత ప్రభుత్వ విభజన నిర్ణయాన్ని “కుట్రతో...” అని ఎలా బహిరంగంగా ప్రతిజ్ఞ చేస్తారు? అనే ఇంగితం ఆ ప్రతిజ్ఞ రాసిన సలహాదారుకు లేకపోయింది. జరుగుతున్న ఈ మొత్తం వ్యవహరాల్లో నిశబ్ద ప్రేక్షకులు – ప్రజలు.

అయితే పైన ప్రస్తావించిన రెండు అంశాల్నికూడా సునిశితంగా గమనించిన మూడవ అంశం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. గమనించి అర్ధం చేసుకుని వారు తమ ఐదేళ్ళ అనుభవాన్ని స్పష్టమైన ఎన్నికల తీర్పుగా ప్రకటించారు. ఈ పూర్వ రంగంలో... విభజన జరిగిన ఐదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తన పనిని ఎక్కడ మొదలుపెట్టాలి? ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారినప్పుడు మొదటి నుంచి మనకు తెలిసింది అధికార మార్పు జరిగినప్పటికీ, పరిపాలనలో ‘గతానికి’ పాక్షికంగా అయినా ఒక కొనసాగింపు ఉంటుంది. కానీ, ఇక్కడ ‘గతానికి’ ఈ రాష్ట్ర ప్రజల ఇచ్చిన విస్పష్టమైన తీర్పును గౌరవించవలసిన నైతిక బాధ్యత జగన్ ప్రభుత్వం మీద పెద్ద బరువుగా మారింది. అందుకే విభజన జరిగాక నూతన ప్రాదేశిక ప్రాంతంలో 2014 లోనే సి.బి.ఎన్. మొదలు పెట్టవలసిన పనిని, అప్పుడు జరగనిదాన్ని ఈ ప్రభుత్వం ఆరంభించింది. ఇది ఇప్పుడు ఎలా సాధ్యమయింది? ఎవరి పని వాళ్ళు చేసే స్వేఛ్చ ఇవ్వడం వల్ల. 

AP CM YS Jagan Mohan Reddy government News Media Strategy

 

నాలుగవది – మీడియా. మరి ఎవరి పని వారు చేయడం అనేది ‘ఫోర్త్ ఎస్టేట్’ గా పిలవబడే జర్నలిస్టు లకు వర్తించదా? పైన సమీక్షించుకున్న మొదటి రెండు అంశాల్ని ప్రజలు - జర్నలిస్టులు వేర్వేరుగా చూసారు అనే అంశం వద్ద ‘మీడియా’ వైఫల్యం బయటపడింది. వారి వైఫల్యానికి వారి స్వీయ కారణాలు వారికి ఉన్నప్పటికీ, జనబాహుళ్యం నాడి పట్టుకోవడం ‘మీడియా’వల్ల కాలేదు అనే వృత్తిపరమైన మచ్చ మాత్రం దానికి తప్పలేదు. నిజానికి ఈ స్థితిలో మీడియా తన వాస్తవ స్థితిని మూల్యాంకనం చేసుకుని ఉండి ఉంటే బాగుండేది. కానీ అది జరగలేదు. అటువంటి ఆలోచన దానికి ఉన్నట్టుగా కూడా మీడియా ప్రయోజనాలు కోరే వృత్తి సంఘాలు ఎక్కడా మాట్లాడలేదు. 

ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిదాన్నీ పునాదులు నుంచి సరిచేసుకుంటూ వీలైనంత త్వరగా తన పరిపాలన ముద్ర వేయాలనుకునే వొక యువ ముఖ్యమంత్రికి ఇక్కడ కూడా గతం అవరోధం అయింది. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఇటీవలి సమావేశంలో మీడియా పని తీరు మీద నియంత్రణ వ్యవస్థ అవసరం అని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో ‘మీడియా’ రాతల మీద సంబంధిత శాఖల కార్యదర్శుల నియంత్రణ పరిధి అవసరం అనుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పూర్వరంగ నేపధ్యంలో నుంచి చూసినప్పుడు, ఇటువంటి సర్కార్ చొరవకు ‘మీడియా’ వ్యాకులత చెందడం కంటే, నిర్మాణాత్మక సంస్కరణలతో ‘మీడియా’ కూడా తన ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకు రావడం ఐదేళ్ళ వయస్సున్న రాష్ట్రమైన ఏ.పి. ప్రత్యేక అవసరం.

Follow Us:
Download App:
  • android
  • ios