ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు.. పొత్తుపై రాష్ట్ర బీజేపీలో గందరగోళం.. అక్కడే తేడా కొడుతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర శాఖ వైఖరి ఏమిటనేది ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి దారితీస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర శాఖ వైఖరి ఏమిటనేది ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి దారితీస్తుంది. జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయని ఇరు పార్టీల నేతలు చెబుతున్నప్పటికీ.. రెండు పార్టీలు కలిసి పనిచేయడం లేదు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని చెబుతున్న ఏపీ బీజేపీ నేతలు.. ఆ ఉద్యమంలో జనసేనను కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇలా చాలా అంశాల్లో బీజేపీ ఒంటరిగానే ముందుకు సాగుతుంది.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతారు. ప్రధాని మోదీపై, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తారు. కానీ రాష్ట్ర నాయకులతో కలిసి సమావేశమై.. ఉమ్మడిగా ముందుకు సాగే ప్రణాళికలపై చర్చించిన దాఖలాలు లేవు. మరోవైపు అటు రాష్ట్ర స్థాయిలో గానీ.. ఇటు గ్రామ స్థాయిలో గానీ బీజేపీ, జనసేన శ్రేణుల మధ్య ఎలాంటి సమన్వయం లేదు. ఇక, ఇటీవల పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి చర్చలు జరిపారు. పవన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏపీ బీజేపీ నేతలకు కనీసం సమాచారం లేదు.
అదే సమయంలో పవన్ కల్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని పదే పదే చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్‌లు ఇటీవలి కాలంలో వరుసగా సమావేశం కావడంతో టీడీపీ, జనసేనలు పొత్తు ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య పొత్తు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. టీడీపీ, జనసేన కార్యకర్తలు పలుచోట్ల కలిసి పనిచేయడం ప్రారంభించారు.
అయితే రెండేళ్ల క్రితం రాష్ట్రంలో జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల టీడీపీ, జనసేన పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేశారు. పార్టీల అధిష్టానాల నిర్ణయాలతో సంబంధం లేకుండా.. స్థానిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగారు. అయితే ఇది కొన్ని చోట్ల మంచి ఫలితాలనే ఇచ్చింది. దీనిని గమనిస్తే.. అధికారికంగా జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ ఇరు పార్టీల శ్రేణులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని స్పష్టం అవుతుంది. మరోవైపు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు జనసేన మద్దతు ఇవ్వలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికార వైసీపీని గద్దె దింపాలంటే.. టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగాలని ఇరు పార్టీల అధినేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇరు పార్టీలకు లాభం చేకూరుస్తుందని వారు భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ ప్రయత్నంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా కలుపుకుని వెళ్లాలని వారు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో నుంచి బయటకు వచ్చామే గానీ, ఎన్డీయే అభివృద్ధి విధానాలపై ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పడం ద్వారా.. బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ సిద్దమని చంద్రబాబు సంకేతాలు పంపారనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది.
అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం జనసేనతో, జనంతో మాత్రమే తమ పొత్తు అని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు అంశంపై బీజేపీ నాయకుల మధ్య స్పష్టమైన విభజన ఉంది. పలువురు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తే.. కొందరు మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. టీడీపీతో పొత్తుకు వ్యతిరేకంగా ఉన్నవారు.. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తుకు అనుకూలంగా ఉన్నవారు.. 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి పవన్ వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఈ పరిణామాలే ప్రస్తుతం ఏపీ బీజేపీ శ్రేణుల్లో గందరగోళానికి దారి తీస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో క్రియాశీలంగా వ్యవహరించలేకపోతున్నామని కొందరు కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర బీజేపీలో నాయకుల మధ్య పలు అంశాలపై సఖ్యత లేకపోవడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో అధినాయకత్వమే ఏదో ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని బీజేపీ శ్రేణులు కోరుకుంటున్నారు.