ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రాజధాని అంశం చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి అమరావతి పరిసర ప్రాంత రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా జగన్ ప్రవేశ పెట్టిన బిల్లులు అసెంబ్లీలో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉండడం వల్ల పాస్ అయిపోయినప్పటికీ... మండలిలో మాత్రం టీడీపీ దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడంలో సఫలీకృతమైంది. 

మండలిలో టీడీపీ ప్రతి  విషయానికి అడ్డుతగులుతూ ఉండడం వల్ల జగన్ మండలిని రద్దు చేసే యోచనలో ఉన్నట్టుగా వారి పార్టీ నేతలే కాదు... ఆ అర్థం ధ్వనించేలా స్వయానా ఆ పార్టీ అధినేతే అన్నారు. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో శాసన మండలి రద్దు అనేది ప్రస్తుతానికి ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో అసలు శాసన మండలిని జగన్ రద్దు చేస్తాడా లేదా.. అనేది చర్చనీయాంశంగా మారింది. జగన్ రద్దు చేస్తాడా చేయడా అనే చర్చను పక్కనబెడితే... శాసన మండలిని రద్దు చేస్తే అధికార వైసీపీకి ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. షార్ట్ టర్మ్ లో పెద్ద నష్టం కనపడకున్నప్పటికీ... లాంగ్ టర్మ్ లో మాత్రం దాని ప్రభావం ఖచ్చితంగా కనబడుద్ది. 

Also read; మండలి రద్దు: అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ అంతే తేడా..మిగితాదంతా సేమ్ టు సేమ్

మొదటగా జగన్ గనుక తన రాజకీయ నిర్ణయానికి అడ్డుపడ్డారన్న రాజకీయ కక్ష సాధింపుతో మండలిని రద్దు చేయడానికి పూనుకున్నా... మండలిని రద్దు చేసే అధికారం జగన్ కి లేదు. రాజ్యాంగం ప్రకారం జగన్ ఒక తీర్మానాన్ని ప్రత్యేక మెజారిటీతో పాస్ చేసి పార్లమెంటుకు పంపాలి. 

శాసనమండలిని ఏర్పాటు చేయాలన్నా... రద్దు చేయాలన్నా సర్వాధికారాలు పార్లమెంటువే. పార్లమెంటు వెంటనే ఒప్పుకున్నా కూడా అది పూర్తిగా పాస్ అవడానికి దాదాపుగా సంవత్సరంన్నర సమయం పడుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే అది పరిస్థితి. 

ఒకవేళ కేంద్రం గనుక సహకరించకపోతే... ఆ బిల్లు ఇక పొద్దుపొడుపును చూడడం కష్టమే. ఈ అన్ని పరిస్థితుల్లో శాసన మండలిని రద్దు చేయడం కన్నా కూడా ఆ మూడు నెలల సమయం ఏదో గడవనిచ్చి ఆ తరువాత నింపాదిగా బిల్లును పాస్ చేస్తే సరిపోద్ది. 

Also read; ఏపీ మండలి రాద్ధాంతం: తలా పాపం తిలా పిరికెడు

ఇక మరో అంశం ఏమిటంటే జగన్ మంత్రి వర్గంలో ఇద్దరు మంత్రులు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు మోపిదేవి వెంకటరమణ కాగా, మరొకరు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు మండలిని రద్దు చేస్తే వీరు తమ మంత్రి పదవులను కోల్పోతారు. 

ఇంకొక్క రెండు సంవత్సరాల్లో జగన్ కి మండలిలో పూర్తి స్థాయి మెజారిటీ వస్తుంది. అప్పటివరకు ఆగితే సరిపోతుంది. అంతే తప్ప ఇప్పటికిప్పుడు రద్దు చేస్తే ప్రయోజనం శూన్యం.

2024లో ఎన్నికలప్పుడు టిక్కెట్ల కేటాయింపుల్లో కొందరిని బుజ్జగించాల్సి వస్తుంది. అప్పుడు ఆ సదరు రాజకీయ నిరాశ్రయులకు రాజకీయ ఆశ్రయంలో, పునరావాసమో కల్పించడానికి మండలి పనికొస్తుంది. 

అన్నిటికంటే ముఖ్యంగా జగన్ తన పాలనను రాజశేఖర్ రెడ్డి పాలనకు కొనసాగింపుగా, రాజన్న రాజ్యం ను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తారు. అదే ఆయనకు ఎన్నికల్లో విజయాన్ని సాధించిపెట్టింది.

2007లో తన తండ్రి పునరుద్ధరించిన ఈ మండలిని రద్దు చేస్తే రాజన్న రాజ్యానికి  తానే స్వయంగా తూట్లు పొడిచినట్టవుతుంది. 

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో శాసన మండలిని గనుక రద్దు చేస్తే ఇప్పటికిప్పుడు వచ్చే రాజకీయ ప్రయోజనం శూన్యం. ప్రస్తుతానికి ప్రయోజనం మాత్రమే రాకున్నప్పటికీ.... భవిష్యత్తులో మాత్రం మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టేలా కనబడుతున్నాయి.