Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మం చుట్టూ తెలంగాణ రాజకీయం.. అన్ని పార్టీల చూపు అటువైపే.. కారణాలు అనేకం..

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం చుట్టే తిరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఖమ్మంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. మిగిలిన ప్రాంతాలతో పోల్చితే.. ఖమ్మంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది.

ALL Parties including BRS BJP Congress Focus on Khammam
Author
First Published Jan 19, 2023, 8:35 AM IST

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం చుట్టే తిరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఖమ్మంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. మిగిలిన ప్రాంతాలతో పోల్చితే.. ఖమ్మంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్‌, తెలంగాణ  అధికారం సాధించాలని చూస్తున్న బీజేపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణలో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న టీడీపీ, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీతో సత్తా చాటాలని చూస్తున్న వైఎస్ షర్మిల.. ఖమ్మంపై ఫోకస్‌ చేసి వ్యుహాలు రచిస్తున్నారు. ఖమ్మంలో చంద్రబాబు సభ, పాలేరు నుంచి బరిలో నిలుస్తానని షర్మిల ప్రకటన, బీఆర్ఎస్ తొలి సభకు ఖమ్మం వేదికగా నిలవడం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు వార్తలు.. ఈ క్రమంలోనే అందరి దృష్టి ఖమ్మంపైనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో ఉన్న ఖమ్మం.. తెలంగాణ రాజకీయాల్లో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారడం వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. 

బీఆర్ఎస్ ప్రభావం ఎంత..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈ రెండు ఎన్నికల తర్వాత వివిధ పార్టీల నుంచి గెలిచిన నేతలతో, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. 
ఖమ్మంలో ఆంధ్రా మూలాలు ఎక్కువ మంది ఉండడం కూడా బీఆర్ఎస్ ప్రభావం కనిపించలేదనే విశ్లేషణలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన పువ్వాడ అజయ్ కుమార్ ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించి.. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. 

మరోవైపు 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌ను కాదని టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ ఖమ్మం ఎంపీ టికెట్ ఇచ్చారు. ఖమ్మం ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావు.. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కీలక భూమిక పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పాలేరు నియోజకవర్గం గురించి తెగ చర్చ నడుస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు మీద విజయం సాధించారు. ఆ తర్వాత ఉపేందర్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. అప్పటి నుంచి పాలేరు బీఆర్ఎస్‌లో తుమ్మల వర్సెస్ కందాల పోరు కొనసాగుతోంది. పార్టీ క్యాడర్‌లో కూడా ఈ చీలక ఉంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం ఇద్దరు నేతలు వారి వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వామపక్షాలతో పొత్తు ఖరారైతే.. ఆ స్థానాన్ని సీపీఎంకు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. మరోవైపు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా పాలేరు నుంచే బరిలో నిలవాలని చూస్తున్నారు. ఇక, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరతారనే కూడా తన అనుచరుడిని అక్కడి నుంచి బరిలో దింపే అవకాశం ఉంది. 

అలాగే.. ఉమ్మడి ఖమ్మంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల మధ్య బీభత్సమైన పోటీ కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్‌లో ఈ పోరు ఎక్కువగానే ఉంది. కొత్తగూడెంఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో బీఆర్ఎస్‌లో చేరి రాజకీయాల్లో రావాలని చూస్తున్న తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు.. ఆ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలు చేస్తున్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. 

మరోవైపు విపక్ష పార్టీలు కూడా బీఆర్ఎస్‌కు వ్యతిరేక పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడనున్న సంకేతాలు వెలువడుతుండటంతో.. కేసీఆర్ కూడా ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ రాజకీయాల్లో వెళ్తున్న కేసీఆర్.. ఖమ్మం వేదికగానే బలపరీక్షలో భాగంగా బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను నిర్వహించారు. ఇందుకు మూడు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించడం ద్వారా అందరి దృష్టి సభపై ఉండేలా చూశారు. మరి ఇది ఏ మేరకు లాభం చేకూరుస్తుందో తెలియాల్సి ఉంది. 

పాలేరు నుంచే షర్మిల.. 
వైఎస్ షర్మిల తెలంగాణ తన  రాజకీయ భవిష్యత్తు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర కూడా చేపట్టారు. అయితే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పాలేరు నుంచి బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే ఆమె ప్రణాళికలు రచిస్తున్నారు. పాలేరులో పార్టీ కార్యాలయానికి భూమి పూజ కూడా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 జరిగిన ఎన్నికల్లో తన సోదరుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ.. ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఇందుకు వారి తండ్రి మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విధేయుల మద్దతు, ఆంధ్ర మూలాలు ఉన్న ప్రజల మద్దతు కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 2023 ఎన్నికల్లో పాలేరులో తమ పార్టీకి మంచి అవకాశం ఉందని షర్మిల విశ్వసిస్తున్నట్లుగా సమాచారం.

టీడీపీ రీఎంట్రీ.. 
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా కనుమరుగైనట్టుగానే చెప్పాలి. అయితే మళ్లీ పార్టీకి పునరుజ్జీవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాల్లో విజయం సాధించగా.. ఆ తర్వాత ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా పార్టీకి  గుడ్ చై చెప్పారు. ఇతర పార్టీలో చేరిపోయారు. ఓటు బ్యాంకుకు గండి పడినప్పటికీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట, సత్తుపల్లి స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు కూడా సత్తుపల్లి టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పార్టీకి మళ్లీ వైభవం తీసుకురావాలని భావిస్తున్న చంద్రబాబు.. అందుకు ఖమ్మంను ఎంచుకున్నారు. అక్కడ చంద్రబాబు నిర్వహించిన సభ విజయవంతం అయిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఒకవేళ జనసేన, బీజేపీలతో టీడీపీకి పొత్తు కుదిరిన నేపథ్యంలో అది మరింతగా కలిసి వచ్చి.. జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయనే చర్చలు కూడా సాగుతున్నాయి. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ గురి..
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పొంగులేటికి ఆర్థిక బలంతో పాటు పలు నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్నారు. కనీసం నాలుగు నియోజకవర్గాలపై ఆయనకు పట్టు ఉంది. ఈ క్రమంలోనే పొంగులేటిని బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా.. జిల్లాలో బలపడాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. టీఆర్ఎస్‌కు వ్యతిరేక ఓటు బ్యాంకును తమ ఖాతాలోకి మళ్లించుకోవాలని చూస్తుంది.

రేవంత్ రెడ్డి కూడా.. 
కాంగ్రెస్ పార్టీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్.. సాధించిన స్థానాల్లో ఎక్కువగా ఖమ్మంలోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జనవరి 26వ తేదీ నుంచి హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభించాలని రేవంత్ భావిస్తున్నట్టుగా సమాచారం.పాదయాత్ర ప్రారంభానికి భారీ స్థాయిలో జనసమీకరణకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. అయితే టీ కాంగ్రెస్‌లో నెలకొన్ని విభేదాల నేపథ్యంలో రేవంత్ పాదయాత్ర విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. 
 

కమ్యూనిస్టుల ప్రభావం.. 
పినపాక, మధిరతో పాటు జిల్లా వ్యాప్తంగా వామపక్షాలకు బలమైన పునాది ఉంది. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే నల్గొండ, ఖమ్మం నుంచి మెజారిటీ స్థానాల్లో పోటీ చేయాలని వామపక్షాలు భావిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios