Asianet News TeluguAsianet News Telugu

ఏరో ఇండియా 2023: నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. బిలియన్ అవకాశాలకు అన్‌లాక్..

బెంగళూరులో జరిగే ఏరో ఇండియా 2023లో 80కి పైగా దేశాలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏరో ఇండియా 2023పై గిరీష్ లింగన్న అందిస్తున్న ప్రత్యేక రిపోర్టు.

Aero India 2023 Unlocking a billion opportunities from Feb 13
Author
First Published Feb 13, 2023, 9:41 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13న బెంగళూరులోని యెలహంకలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 14వ ఎడిషన్ ఏరో ఇండియా షోను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 17 వరకు ఈ ఎయిర్‌ షో జరగనుంది. 2023 ఏరో ఇండియా ఈవెంట్ ప్రధానంగా ‘‘ఒక బిలియన్ అవకాశాలను అన్‌లాక్ చేయడం’’పై దృష్టి సారించింది. ప్రధాని మోదీ ఆలోచనలకు తగ్గట్టుగా మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ కన్సెప్ట్‌కు మద్దతుగా భారతీయ నిర్మిత పరికాలు, సాంకేతికతలను ప్రదర్శించడం, విదేశీ సంస్థలతో పొత్తులకు ఏర్పరుచుకోవడంపై ఈ కార్యక్రమం కేంద్రీకృతమై ఉంటుందని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. 

ఎరో ఇండియా  2023 షోకు హాజరైనవారు.. డిజైన్ రంగాలలో, మానవరహిత వైమానిక వాహన పరిశ్రమలో విస్తరణ, ప్రొటెక్షన్ స్పేస్, అత్యాధునిక సాంకేతికలలో దేశాభివృద్దిని గమనించేందుకు అవకాశం కలుగుతుంది. ఇంకా ఈ షోకు హాజరయ్యేవారు.. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ)-తేజాస్,  హెచ్‌టీటీ-40, డోర్నియర్ లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్‌యూహెచ్), లైట్ కంబాట్ హెలికాప్టర్ (ఎల్‌సీహెచ్), అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్‌) వంటి దేశీయంగా తయారు చేయబడిన విమానాల ఎగుమతికి సంబంధించిన విషయాలను తెలసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమం స్థానిక ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లను అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఏకీకృతం చేయడాన్ని ప్రోత్సహిస్తుందని..అలాగే ఉమ్మడి ఉత్పత్తి, అభివృద్ధి కోసం సహకారాలతో సహా విదేశీ పెట్టుబడులను డ్రా చేస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఇక, ఏరో ఇండియా 2023లో 80కి పైగా దేశాలు హాజరు కానున్నాయి. ఏరో ఇండియా 2023లో దాదాపు 30 దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ, భారతీయ వ్యాపారాలకు చెందిన 65 మంది సీఈవోలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నారు. ఏరో ఇండియా 2023 షోలో 800కి పైగా రక్షణ సంస్థలు పాల్గొంటాయి. ఇందులో దాదాపు 100 విదేశీ సంస్థలు, మిగిలిన 700 భారతీయ సంస్థలు. ఏరో ఇండియా 2023 ఎగ్జిబిషన్‌లో భారతదేశం నుంచి ఎంఎస్‌ఎంఈలు, స్టార్ట్-అప్‌లు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో వారి విజయాలు, వారి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిని ప్రదర్శిస్తాయి. 

ఇక, ఏరో ఇండియా 2023.. ఎయిర్‌బస్, బోయింగ్, డస్సాల్ట్ ఏవియేషన్, లాక్‌హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సీ రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయిస్, లార్సెన్ అండ్ టూబ్రో, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ భారత్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), బీఈఎంఎల్ లిమిటెడ్ వంటి అంతర్జాతీయ, దేశీయ ఎగ్జిబిటర్ల శ్రేణిని ప్రదర్శిస్తుంది.

(రచయిత- ఏరోస్పేస్, డిఫెన్స్ విశ్లేషకులు)

Follow Us:
Download App:
  • android
  • ios