#Day1

కమ్మని సాయంకాలం అంటే స్నేహితుల మధ్య జరిగే ఏ పిచ్చాపాటి సంభాషణో కానే కాదు. ఒక పోలీస్ తో జరిగిన సంభాషణ. పైగా ఒక జిల్లాకు బాసాది బాసు. పైగా ఐపీఎస్. తనే మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి. అందానికి, అధికార దర్పానికి, హుందాతనానికి అసలైన అడ్రెస్. ఆమె తలచుకుంటే న్యాయాన్ని, అన్యాయాన్ని ఆనవాళ్లు లేకుండా చేసి ఆటాడించగలదు. అంతగా అవసరమనుకుంటే  న్యాయాన్ని అన్యాయాన్ని కలగలిపి ఒక మిక్సీలో వేసి రుబ్బేసి ఏది ఎవరికీ వడ్డించాలో అది వారికి వడ్డించేలా మ్యాజిక్కు చేయగలదు. అసలా ఆ రెండు కనిపించకుండా లాజిక్కులతో జిమ్మిక్కు చేయగలదు. కానీ కొన్నిసార్లు ఆమె వెన'కడుగు' అనుభవలేమిని సూచిస్తుంది. 

సాయంకాలం... అందులో ఎండాకాలం, సమయం సరిగ్గా 4 గంటల 10 నిమిషాలు...

సీన్ 1: ఎస్పీ ఆఫీస్... పోలీస్-పబ్లిక్ పాలసీ-డిజిటల్ అవేర్ నెస్ అనే అంశంపై థీసిస్ పేరుతో ఆఫీసులోకి ప్రవేశించిన నేరుగా రిసిప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్లి నేను ఇలా పబ్లిక్ పాలసీ పేరు చెప్పగానే ఏంటి ఎల్ఐసి పాలసి ఆ... మాకేం అవసరం లేదు. ఇక్కడ ఎందుకు పాలసిలు అని విసుక్కుంటూ ఒక వ్యక్తి ఎక్కడలేని ఆవేశంతో కూడిన అసహనాన్ని ప్రదర్శించాడు. మొత్తానికి మేడం లేదని, అసలు రాదని, వచ్చిన కలవలేదని అల్టిమేటం జారీ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పాడు. నేను అంతకుముందే మేడం గారికి మెసేజి చేసి ఉన్నందున మేడం గారి ఆదేశాల ప్రకారం వేచి చూడటం జరిగింది. కొంతసేపు తర్వాత అనివార్య కారణాల వలన మేడం గారిని వేరే కార్యాలయంలో కలవాల్సి వచ్చింది.

సీన్ 2: ఎస్పీ క్యాంప్ ఆఫీస్... సరిగ్గా అదే అంశంతో ఆఫీసులోకి అడుగుపెడుతున్న నాకు అంతలోనే మేడం గారి గన్ మెన్ ని అంటూ పోవటానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసినంత పని చేశాడు. కానీ లోపల నుండి మేడం గారి ఆదేశాలతో సాదరంగా ఆహ్వానించాడు. మొత్తానికి మేడం దగ్గరికి వెళ్ళాను.

సీన్3: మేడం గారి ఆఫీసులోకి ప్రవేశించిన నేను... సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత ఒక జిల్లా బాస్ గా ఆమెను చూసిన నేను ఏమంత పెద్ద ఆశ్చర్యానికి లోనవ్వలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు తనను వివిధ ప్లాట్ ఫార్మ్స్ పైన ప్రజంట్ చేయటం మూలాన ఎందుకో నాకు అన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నానే అనుభూతి కలగలేదు. కానీ నాలో ఉన్న కవి మాత్రం కళ్ళు తెరచాడు కలం-కాగితం ఇస్తే టన్నుల కొద్దీ కవితలు రాయటానికి!! 

సీన్4: మేడం గారు నేను తన ఆఫీసు లోకి ప్రవేశించటానికి ముందే తాను నిత్యం గడిపే ఫైళ్లపై వేళ్ళు కదలాడిస్తున్నారు. నేను రాంగ్ టైం లో ఎంటర్ అయ్యాయనే భావన కలిగింది. కానీ కొద్దిసేపటికి అంతా సర్దుకుంది. వెళ్ళగానే అంతకుముందే నేను తెలుసుకున్న స్థానిక పోలీస్ వ్యవస్థ పని తీరు గురించి చర్చించటం మొదలు పెట్టాను. మేడం తన ఉద్యోగుల పని తీరు గురించి చాలా నమ్మకం కనబరిచారు. అంతే స్థాయిలో తన ఉద్యోగులు అదే పని తీరు కనబరుస్తున్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. మేడం తనను తాను ప్రెసెంట్ చేసుకోవటం కన్న తన టీంని తన ఉద్యోగుల్ని ప్రెసెంట్ చేయటంలో ఆసక్తి కనపరిచటం గమనార్హం. ఇంతలో అంతకుముందే కొంత మంది బాధితులు తమ సమస్యలను విన్నవించుకోవటం కొరకు ఎస్పీ గారి ఆఫీసు ముందు వేచి ఉండటంతో వారిని లోనికి పిలిపించారు. అదే ప్రజావాణి కార్యక్రమం. ఉదయం జరగాల్సిన ఆ కార్యక్రమం మేడం బిజీ షెడ్యూల్ కారణంగా సాయంత్రానికి వాయిదా పడిందన్న విషయం నాకు బోధపడింది. 

ఒక కేసులో అనుభవాన్ని అనుసంధానం చేస్తే, మరో కేసులో అసహనానికి ఆందోళన తోడయ్యింది. ఒకరికి ఉద్యోగ భరోసా, ఇంకొకరికి బతుకు భరోసా, మరొకరికి న్యాయ భరోసా... మొత్తానికి సమస్యల పరిష్కారానికి తానున్నానంటూ తానిచ్చిన ధైర్యం కొందరి బతుకుల్లో వెలుగులు నింపుతుందనే అనుకోవాలి. ఇంటితో ఒక సాయంకాలం కథ ముగిసింది. అయ్యో ఇంతటితోనే అంతటి అభినయం ముగిసిందనుకుంటే పొరపాటే... తానొక అద్భుతం ఆ అద్భుతం అంతటితో ముగిసిపోదు... ముగిసిపోలేదు. ఇంకా ఆ అద్భుతం నుండి రావాల్సిన ఆణిముత్యాలెన్నో... ఆ అద్భుతం గురించి వెలువడాల్సిన అక్షరాలు మరెన్నో!!

- హరికాంత్