చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం భారతదేశాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో వున్న పలువురు భారతీయులు కూడా కోవిడ్-19 బారినపడ్డారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ఓ భారతీయ విద్యార్ధికి నోవల్ కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో యూఏఈలో కరోనా బాధితుల సంఖ్య 27కి చేరింది.

Also Read:ఫిలిప్పీన్స్‌లో కారు ప్రమాదం: తెలుగు వైద్య విద్యార్ధి దుర్మరణం

ఐదు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లి ఇటీవలే దుబాయ్ తిరిగొచ్చిన 16 ఏళ్ల విద్యార్ధి తల్లిదండ్రుల్లో కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని.. వారి నుంచి అతనికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకిందని గల్ఫ్ న్యూస్ ఒక కథనంలో పేర్కొంది. ఈ విషయాన్ని దుబాయ్ హెల్త్ అథారిటీ కూడా ధ్రువీకరించింది.

బాధిత విద్యార్ధి కుటుంబాన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్ధి చదువుకుంటున్న పాఠశాలను మూసివేస్తున్నట్లుగా దుబాయ్‌లోని ఇండియన్ హై గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రకటించింది.

Also Read:రేప్ చేస్తానంటూ ఎఫ్‌బీలో బెదిరింపులు: దుబాయ్‌లో భారతీయుడికి అరెస్ట్ ముప్పు

మరోవైపు భారతదేశంలో గురువారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 30కి చేరింది. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది.