గుంటూరు జిల్లాలోకి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టిన దగ్గర నుండి జనాలు అనూహ్యంగ స్పందిస్తున్నారు. రాజధాని జిల్లాలో జగన్ కు జనాలు అంతగా సానుకూలంగా స్పందిస్తున్నారనే విషయంలో టిడిపి వర్గాల్లో ఆందోళన మొదలైందట. ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లిలో అయితే జన స్పందన చెప్పనే అక్కర్లేదు. ఎంతగా వైసిపి నేతలు జనాలను పోగేసినా ఈ స్దాయిలో అయితే సమీకరించలేరు.

సహజంగానే జగన్ విషయంలో జనాలు బాగా స్పందిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. పైగా పై రెండు నియోజకవర్గాలు స్పీకర్ కోడెల శివప్రసాద్ కు బాగా పట్టున్నవి కావటం గమనార్హం. అదే సమయంలో టిడిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పై రెండు నియోజకవర్గాల్లో కోడెల కుటుంబీకుల అరాచకాలు తారాస్ధాయికి చేరుకున్నట్లు పలు ఆరోపణలు వినబడుతున్నాయి. కోడెల కొడుకు కోడెల శివరామకృష్ణ దందాలకు టిడిపి నేతలే తట్టుకోలేకపోతున్నట్లు బాహాటంగానే ఆరోపణలు వినబడుతున్నాయి.

వైసిపి నేతలతో పాటు పలువురు వ్యాపారులను, కాంట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకుని కోడెల కొడుకు అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఎన్ని ఫిర్యాదులు చేసిన పోలీసుల నుండి స్పందన కనబడటం లేదట. దాంతో జనాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇటువంటి నేపధ్యంలోన పాదయాత్ర ద్వారా జగన్ జిల్లాలోకి ప్రవేశించారు. నరసరావుపేట, సత్తెనపల్లిలోకి అడుగుపెట్టగానే జనాలు ఏకంగా బ్రహ్మరథమే పడుతున్నారు.

అంటే, టిడిపి ప్రత్యేకంగా కోడెల కుటుంబంపై జనాల్లో ఏ స్ధాయిలో వ్యతిరేకత ప్రబలిపోయిందో అర్ధమైపోతోంది. దానికితోడు వైసిపి నేతలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు నిత్యమూ జనాల్లోనే తిరుగుతుండటంతో పాటు పలు కేసులు కూడా పడటంతో వారిపై సానుభూతి కూడా ఉంది. అన్నీ కలిసి జనాలు జగన్ కు అంతలా స్పందిస్తున్నారు.

జగన్ విషయంలో జనస్పందన చూసిన తర్వాత టిడిపిలో ఆందోళన తారస్దాయికి చేరుకుంది. మరి, వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ప్రత్యేకించి నరసరావుపేట, సత్తెనపల్లిలో ఫలితాలు ఏ విధంగా ఉంటుందో చూడాలి.