న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను మాత్రమే రోడ్లపై నడుపాలన్నది దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశం. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను రూపొందించాలంటే ఖర్చు పెరుగుతుంది. ఇది ప్రత్యేకంగా డీజిల్ వేరియంట్ వాహనాల ఖర్చు బాగా పెరుగుతోంది. 

ఇప్పటికే డీజిల్ వేరియంట్ కార్ల ధరలు పెంచేస్తామని పలు సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో టయోటా కిర్లోస్కర్ కూడా డీజిల్ వేరియంట్ ధరలు 15 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉన్నదని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వాహన రంగం వ్రుద్ధి నమోదు చేయడం ఎంతైనా అవసరం అని, దీర్ఘ కాలంలో సంస్థాగత సమస్యలను అధిగమించడానికి ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీని తగ్గించాలని టయోటా కిర్లోస్కర్ కోరుతోంది.

టయోటా కిర్లోస్కర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా మాట్లాడుతూ.. ‘బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను తయారు చేయనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి టయోటా వాహనాల ధరలు 15-20 శాతం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డీజిల్ వేరియంట్ వెహికల్స్ ధరలు పెరుగతాయి’ అని చెప్పారు.

టయోటా కిర్లోస్కర్ సంస్థ కార్లు.. ఇన్నోవా, ఫార్చ్యూనర్ మోడల్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ రెండు మోడల్ కార్లు డీజిల్ వినియోగంతోనే నడుస్తాయి. ఈ ఏడాది జనవరి - జూలై మధ్య డీజిల్- పెట్రోల్ వేరియంట్ వాహనాల విక్రయం 82:18 నిష్పత్తిలో సాగింది. ఇదే సమయంలో ప్రయాణ వాహనాల విక్రయాలు 50:50 నిష్పత్తిలో సాగడం గమనార్హం. అయితే వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీ పలు రకాల డిస్కౌంట్లను ఆఫర్లు అందిస్తోందని రాజా చెప్పారు