న్యూఢిల్లీ: కంపెనీ పాలిట గుదిబండగా మారిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) బ్రాండ్‌లో వాటా విక్రయించాలని టాటా మోటార్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. టాటా మోటార్స్‌ దశాబ్దం క్రితం బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ జేఎల్‌ఆర్‌లో వంద శాతం వాటాను 230 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.

ఇప్పటివరకు టాటా మోటార్స్ కంపెనీకిదే అతిపెద్ద కొనుగోలు. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో నెలకొన్న తీవ్ర పోటీలో వెనకబడిన టాటా మోటార్స్‌ను కొన్నేళ్లపాటు ఈ బ్రాండే ముందుకు నడిపించింది. 

కానీ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం (బ్రెగ్జిట్‌), అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ పరిణామాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను మందగమనంలోకి నెట్టాయి. దాంతో జేఎల్‌ఆర్‌కు ప్రధాన మార్కెట్లైన అమెరికా, చైనా, బ్రిటన్‌లలో విక్రయాలు భారీగా తగ్గాయి. తత్ఫలితంగా టాటా మోటార్స్‌ ఆదాయంపై భారీ ప్రభావం పడింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ.26,961 కోట్ల భారీ నష్టాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలోని లిస్టెడ్‌ కంపెనీలు ప్రకటించిన త్రైమాసిక నష్టాల్లో ఇదే అతిపెద్ద మొత్తం.

ఆర్థిక కష్టాల్లోంచి గట్టెక్కేందుకు టాటా మోటార్స్‌ ప్రస్తుతం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని, అందులో భాగంగా జేఎల్‌ఆర్‌లో వాటా విక్రయించడం లేదా జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ కథనం పేర్కొంది. ఇందుకు సంబంధించి పలువురితో కంపెనీ చర్చలు జరుపుతోందని సమాచారం. 

కానీ జాగ్వార్ లాండ్ రోవర్ వాటాను విక్రయిస్తున్నట్లు వస్తున్న వార్తలను టాటా మోటార్స్ నిరాకరించింది. జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థలో మైనారిటీ వాటా విక్రయం గానీ, జాయింట్ వెంచర్‌గా ఇతర సంస్థలకు వాటా కల్పించడం గానీ యోచిస్తున్నట్లు వార్తలు నిరాధారమని పేర్కొంది.

జాగ్వార్ లాండ్ రోవర్ వాటాల విక్రయం వార్తలో నిజం లేదని టాటా మోటార్స్ అదికార ప్రతినిధి తెలిపారు. భారత కార్పొరేట్ చరిత్రలోనే టాటా మోటార్స్ అత్యంత భారీ నష్టాలను గత త్రైమాసికంలో ప్రకటించింది. దీనికి చైనాలో విక్రయాలు తగ్గడమే కారణమని తెలుస్తోంది. జేఎల్ఆర్ సంస్థపై నియంత్రణను వదులుకోబోమని టాటా మోటార్స్ పేర్కొంది.