Asianet News TeluguAsianet News Telugu

డోంట్ వర్రీ!! ఆదుకుంటాం: ఆటో రంగానికి గడ్కరీ భరోసా

గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని, జీఎస్టీ తగ్గించే విషయాన్ని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ద్రుష్టికి తీసుకెళ్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. సియామ్ సదస్సులో పాల్గొన్న ఆటోమొబైల్ సంస్థల అధినేతలు వాస్తవ పరిస్థితిని కేంద్ర మంత్రి ద్రుష్టికి తెచ్చారు.

Nitin Gadkari assures auto companies, promises to discuss GST cut with Finance Minister
Author
New Delhi, First Published Sep 6, 2019, 9:08 AM IST

గతంలో ఎన్నడూ లేనివిధంగా కష్టాలెదుర్కొంటున్న దేశీయ ఆటో పరిశ్రమకు కేంద్రం అండగా నిలుస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ భరోసానిచ్చారు. ఆర్థిక మందగమనం, దాదాపు రెండు దశాబ్దాల కనిష్ఠానికి అమ్మకాలు పడిపోవడంతో ఆటో రంగం అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. 

ఆటో సమస్యలు తీరుస్తామన్న గడ్కరీ
ఆటోమొబైల్ పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తామని, డిమాండ్లను తీరుస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు అంశాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తామని, అవసరమైన అన్ని రకాల సాయం అందిస్తామని గురువారం జరిగిన భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) వార్షిక సదస్సులో స్పష్టం చేశారు. 

గడ్కరీ ప్రకటనపై మారుతి సుజుకి సీఈఓ అయుకావా హర్షం
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ భరోసాపై మారుతి సుజుకీ ఇండియా సీఈవో, ఎండీ కెనిచీ అయుకావా హర్షం వ్యక్తం చేశారు. కాగా, రూ.5 లక్షల కోట్ల విలువైన 68 రోడ్డు ప్రాజెక్టులకు రాబోయే మూడు నెలల్లో అనుమతులిచ్చే వీలుందని, ఇప్పటికే 80 శాతం భూమినీ సేకరించామని తెలిపారు.

దీనివల్ల వాణిజ్య వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై నిషేధం విధించాలని కేంద్రం యోచిస్తున్నదన్న మాటలు వినిపిస్తున్నాయని, అలాంటి ఆలోచనేదీ కేంద్రం వద్ద లేదని గడ్కరీ స్పష్టం చేశారు.

ఆ దిశగా తమ ప్రభుత్వం ఏ రకంగానూ ముందుకు వెళ్లడం లేదని ప్రకటించారు. కాగా, పెట్రోల్‌, డీజిల్‌ ఆధారిత వాహనాలపై పన్నును తగ్గించాలన్న ఆటో పరిశ్రమ ప్రతిపాదన బాగుందని, దీనిపై ఆర్థిక మంత్రితో చర్చిస్తామని గడ్కరీ చెప్పారు.

విద్యుత్ వెహికల్స్ మాదిరే పెట్రోల్, డీజిల్ వాహనాలపైనా జీఎస్టీ...
జీఎస్టీ భారం కొంత తగ్గినా అది ఇప్పుడు పరిశ్రమకు ఎంతో సహాయకారిగా ఉంటుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ వాహనాలపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించినట్లే.. హైబ్రీడ్‌ వాహనాలపైనా తగ్గించాలని కోరుతామని చెప్పారు. 

ఆటో ఎగుమతులపై కేంద్రీకరించాలని సీఐఐ అధ్యక్షుడు ఉదయ్ కొటక్ సూచన
దేశీయ మార్కెట్‌లో నెలకొన్న మందగమనాన్ని అధిగమించేందుకు ఆటోమొబైల్ సంస్థలు ఎగుమతులపై దృష్టి పెట్టాలని సీఐఐ అధ్యక్షుడు ఉదయ్‌ కొటక్‌ సూచించారు. కాగా, ఆటో రంగాన్ని ఆదుకునేందుకు ఉద్దీపనలను ప్రవేశపెట్టాలని సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా ప్రభుత్వానికి సూచించారు.

మందగమనంతో ఆటోమొబైల్‌ తయారీ రంగంలో 15 వేల కాంట్రాక్టు ఉద్యోగులు ఉపాధిని కోల్పోగా, దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో దాదాపు 2.8 లక్షల మంది ఉద్యోగాలకు దూరమయ్యారు.

మహీంద్రా పెట్టుబడులు వాయిదా
ఆటోమొబైల్‌ రంగంలో మందగమనం ఈ రంగంలోకి వచ్చే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వ్యాపార విస్తరణకు భవిష్యత్తులో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇంతకుముందు ప్రకటించింది.

కానీ తాజాగా ఈ ప్రతిపాదన వాయిదా వేసుకుంటున్నట్లు కంపెనీ ఎండీ పవన్‌ గోయెంకా ప్రకటించారు. పెట్టుబడులతోపాటు ఉద్యోగాలకూ ఎసరే ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆటోమొబైల్ గంలో పెట్టుబడులతోపాటు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని పవన్ గోయెంకా హెచ్చరించారు.

అమ్మకాలు పడిపోవడంతో ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లలో ఉత్పత్తిలో కోత విధించింది సంస్థ. వచ్చే పండుగ సీజన్‌లో కూడా అమ్మకాలు పెద్దగా పెరిగే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు. నూతన ఉత్పత్తులకోసం పెట్టే పెట్టుబడులను తగ్గించడం లేదని, ఇతర యాక్టివ్స్‌ కోసం పెట్టే ఖర్చులను వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.  

15 వేల మంది తాత్కాలిక ఉద్యోగాలు ఔట్
సియామ్‌ అంచనా ప్రకారం..15 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. కంపెనీ విషయానికి వస్తే 30 వేల మంది సిబ్బందిలో 1,500 మంది తాత్కాలిక వర్కర్లపై వేటు పడిందని ఒక ప్రశ్నకు మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గొయెంకా సమాధానమిచ్చారు. ప్రస్తుత మాంద్యం పరిస్థితుల నుంచి ఆటోమొబైల్‌ రంగ పరిశ్రమలు గట్టెక్కాలంటే వెంటనే జీఎస్టీని తగ్గించాలని ఆయన కేంద్రానికి సూచించారు.

కుప్పకూలడం ఖాయమన్న టాటా మోటర్స్‌ ఎండీ గ్యుంటర్‌ బషేక్‌
దేశీయ ఆటోమొబైల్‌ రంగం కుప్పకూలడం ఖాయమని టాటా మోటర్స్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గ్యుంటెర్‌ బషేక్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న మందకొడి పరిస్థితులకు తోడు, వినియోగదారుల సెంటిమెంట్‌ నిరాశవాదంగా ఉండటం, నిధుల లభ్యత అంతంత మాత్రంగానే ఉండటం ఇందుకు కారణమని విశ్లేషించారు. 

కేంద్రం చర్యలు తీసుకుంటేనే గట్టెక్కుతామన్న టాటా మోటార్స్ ఎండీ ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని టాటా మోటర్స్‌ ఎండీ గ్యుంటర్‌ బషేక్‌ అన్నారు.

ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, ఈ పరిస్థితి నుంచి బయటపడకపోతే కుప్పకూలడం ఖాయమని ఆయన జోస్యంచెప్పారు. 

భవిష్యత్ వాహనాల విక్రయాలు ఆందోళనకరమే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాహన అమ్మకాలు చూస్తే ఏ పరిస్థితిలో ఉన్నదో అర్థమవుతున్నదని, గడిచిన రెండు నెలల్లో కూడా అమ్మకాలు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం చూస్తే భవిష్యత్తులో ఈ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనావేయడం కష్టమని టాటా మోటర్స్‌ ఎండీ గ్యుంటర్‌ బషేక్‌ వ్యాఖ్యానించారు. 

దేశీయ ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహకరం ఒక కారణమే
దేశ ఆర్థిక పరిస్థితులు కూడా నిరుత్సాహకరంగా ఉండటం, నిధుల కొరత దీనికి ఆజ్యం పోసిందని, కమర్షియల్‌ వాహన నిబంధనలు మరింత కఠినతరం చేయడం వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా తయారైందని ఆటోమొబైల్‌ సంస్థల పరిస్థితి టాటా మోటర్స్‌ ఎండీ గ్యుంటర్‌ బషేక్‌ అన్నారు. 

భారీస్థాయిలో ఉత్పత్తి తగ్గించుకుంటున్న ఆటో సంస్థలు
ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఆటోమొబైల్‌ సంస్థలు భారీ స్థాయిలో ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయని..దీంతో ఈ ఏడాది మూసివేత నామ సంవత్సరంగా మారిపోయిందని టాటా మోటర్స్‌ ఎండీ గ్యుంటర్‌ బషేక్‌ పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించిన ఆయన.. ఈ గడ్డు కాలం నుంచి బయటపడాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios