న్యూఢిల్లీ: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.5000 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన వాటిలో రూ.2.93 లక్షల నుంచి రూ.11.49 లక్షల లోపు ధర కలిగిన మోడల్ కార్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్‌ డీజిల్‌, సెలేరియో, బాలెనో డీజిల్‌, ఇగ్నిస్‌, డిజైర్‌ డీజిల్‌, టూర్‌ ఎస్‌ డీజిల్‌, విటారా బ్రెజ్జా, ఎస్‌-క్రాస్‌ మోడళ్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కంపెనీకున్న అన్ని షోరూమ్‌లలో బుధవారం నుంచి తగ్గింపు అమల్లోకి రానుంది.

ప్రస్తుత ప్రమోషనల్‌ ఆఫర్లలో భాగంగా కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్లకు ఇది అదనమని మారుతీ సుజుకీ స్పష్టం చేసింది. పండగ సీజన్‌లో కస్టమర్‌ సెంటిమెంట్‌ను మెరుగుపర్చడంతోపాటు వాహన మార్కెట్‌ డిమాండ్‌ పునరుద్ధరణకు ఇది తోడ్పడవచ్చని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

గత వారం కేంద్ర ప్రభుత్వం బడా కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22శాతానికి తగ్గించింది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలన్న ఉద్దేశంతో ధరలు తగ్గించినట్లు మారుతీ సుజుకీ పేర్కొంది.