న్యూఢిల్లీ: వాహన విక్రయ సంస్థలకు ఫిబ్రవరి నెల నిరాశే మిగిల్చింది. ఒకవైపు భగ్గుమంటున్న చమురు ధరలు, మరోవైపు వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయిలోనే ఉండటంతో వినియోగదారుల్లో సెంటిమెంట్ నిరాశ మిగిలిచ్చింది. దీంతో వాహన అమ్మకాల్లో వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. కాకపోతే యుటిలిటీ వెహికల్స్ పట్ల యువత క్రేజ్ ప్రదర్శిస్తుండటంతో వాటికి ఎక్కువ డిమాండ్ లభిస్తోంది. 

కార్ల తయారీ దిగ్గజం మారుతికి నిరాశే ఎదురవగా, హోండా, మహీంద్రా, టాటా మోటార్స్ విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. మారుతి సుజుకీ ఇండియా విక్రయాల్లో స్వల్ప వృద్ధిని నమోదు చేసుకోగా, హోండా కార్స్, మహీంద్రా మాత్రం రెండంకెల పెరుగుదల నమోదైంది. టాటా మోటర్స్‌ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో రెండు శాతం పెరుగుదల నమోదవగా, టయోటా కిర్లోస్కర్ సేల్స్ తగ్గుముఖం పట్టాయి. 

గత నెలలో మారుతి 1,39,100 కార్లను దేశీయంగా విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో విక్రయించిన 1,37,900లతో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనిపించింది. మినీ సెగ్మెంట్‌కు చెందిన ఆల్టో అమ్మకాలు 26.7 శాతం తగ్గగా, కాంప్యాక్ట్ వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, సెలేరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్‌ మోడల్ కార్ల విక్రయాలు 11.4 శాతం పెరుగడం విశేషం.

యుటిలిటీ వాహనాలైన ఎస్-క్రాస్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, జిప్సీలు ఏడాది ప్రాతిపదికన 7.4 శాతం పెరిగాయి. మరో కార్ల తయారీ సంస్థయైన హోండా కార్స్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 16 శాతం పెరిగి 13,527లకు చేరుకున్నట్లు ప్రకటించింది. హోండా కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ రాజేష్ గోయల్ మాట్లాడుతూ కీలక మోడళ్లకు వినియోగదారుల నుంచి భారీ మద్దతు లభించడం వల్లే విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైందన్నారు. ముఖ్యంగా అమేజ్, సిటీ, డబ్ల్యూఆర్-వీలకు అధిక డిమాండ్ నెలకొందన్నారు. మొత్తం మీద మార్కెట్లో సెంటిమెంట్ నిరాశావాదంగా ఉన్నా కంపెనీ మెరుగైన వృద్ధిని నమోదు చేసుకోవడం విశేషమన్నారు. యుటిలిటీ వాహనాల తయారీలో అగ్రగామి సంస్థయైన మహీంద్రా అండ్ మహీంద్రా దేశవ్యాప్తంగా 26,109 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో విక్రయించిన 22,389లతో పోలిస్తే 17 శాతం వృద్ధి కనబరిచింది.

ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎక్స్‌యూవీ 300కి వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించడం వల్లనే అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ రాజన్ వాదేరా తెలిపారు. 

కాగా, టాటా మోటర్స్ 18,110 వాహనాలను విక్రయించింది. వాహన పరిశ్రమ తీవ్ర ఆటోపోట్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కూడా రెండు శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన ప్రెసిడెంట్ మయాంక్ పరేఖ్ తెలిపారు. 

దీంతోపాటు టయోటా అమ్మకాలు 11,864ల నుంచి 11,760లకు పడిపోయాయి. వాహన అమ్మకాలు తగ్గుముఖం పట్టడం తాత్కాలికమైనా వినియోగదారుల్లో సెంటిమెంట్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నదని టీకేఎం డిప్యూటీ ఎండీ ఎన్ రాజా తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందు అమ్మకాలు పడిపోవడం పరిపాటిగా వస్తున్నదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పుంజుకునే అవకాశం ఉందన్నారు.

హీరో మోటో తప్ప ద్విచక్ర వాహనాల విక్రయాలు బెటరే
కార్ల విక్రయాలతో పోలిస్తే ద్విచక్ర వాహన విక్రయాలు స్వల్ప పెరుగుదల నమోదైంది. గత నెలలో బజాజ్ ఆటో 2,21,706 యూనిట్ల విక్రయాలు జరిపింది. 2018 ఫిబ్రవరి నెలలో అమ్మిన 2,14,023 యూనిట్లతో పోలిస్తే 4 శాతం వృద్ధి నమోదైంది. టీవీఎస్ మోటర్ సంస్థ 2,31,582 యూనిట్లను అమ్మింది. కానీ, ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత నెలలో కంపెనీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 1.96 శాతం పతనం చెంది 6,17,215లకు పడిపోయినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.