న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్‌యూవీ 300 మోడల్ కార్లలో ఎఎంటీ మోడల్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ డబ్ల్యూ6 వేరియంట్ కారుకు అందుబాటులో ఉండనున్నది. దీని ధర రూ.9.99 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.

వాస్తవంగా డబ్ల్యూ8 మోడల్ కారులోని ఎఎంటీతో పోలిస్తే దీని ధర రూ.1.50 లక్షలు తక్కువ. కేవలం డీజిల్ మోడల్‌లో మాత్రమే మహీంద్రా ఎక్స్ యూవీ 300 ఎఎంటీ లభిస్తుంది. సాధారణ డబ్ల్యూ 6 మోడల్ కారు కంటే దీనికి రూ.49 వేలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

దీనిలోని 5 స్పీడ్ ఆటో షిప్ట్ ఎఎంటీని మాగ్నెటీ మారెల్లీ నుంచి తీసుకున్నట్లు మహీంద్రా వివరించింది. దీనిలో 1.5 లీటర్ల టర్బో ఇంజిన్ అమర్చారు. ఇది 300 ఎన్ఎం టార్క్ వద్ద 115 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. దీంతోపాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఈ కారులో లభిస్తాయి.